మావోయిస్టుల కోసం గాలింపు సాగుతున్న తరుణంలో ములుగు జిల్లాలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా సాగుతోన్న ఆపరేషన్ ఖగార్‌లో పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. వెంకటాపురం మండల సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలుడు జరిగింది.
వెంకటాపురం మండల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన మందుపాతర పేలుడు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే అమర్చిన మందుపాతర ఒక్కసారిగా పేలినట్లు సమాచారం.
దాడి అనంతరం మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం. ఈ విఘటనలో మరికొంతమంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కర్రెగుట్ట కేంద్రంగా చేపడుతున్న ఆపరేషన్ కగార్ ముస్తాబైన భద్రతా చర్యల మద్య చోటుచేసుకుంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే 22 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పక్కనే విస్తరించి ఉన్న ఈ కొండలలో భారీ స్థాయిలో మావోయిస్టుల ఉనికి ఉందన్న ఆధారాలతో భద్రతా బలగాలు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
అయితే దట్టమైన అడవి, ఎండ తీవ్రత, నీటి కొరత లాంటి ప్రతికూల పరిస్థితులు భద్రతా బలగాలకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. బీ.ఆర్.ఎస్ అధినేత కేసీర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.