ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్

By Mahesh KFirst Published Mar 29, 2024, 9:22 PM IST
Highlights

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రాధాకిషన్ రావు గతంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసిన విషయం విధితమే. ఆ తర్వాత ఆయన పదవీ విరమణ పొందాక.. ఓఎస్డీగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించారు. 

రికార్డులు ధ్వంసం చేశారని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుతో రాధాకిషన్ రావుకు లింక్ ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబీలో పని చేస్తున్నప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాప్ చేసేవారని, ఆ సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు టీమ్ అక్రమంగా, అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీం అక్రమంగా నడుచుకుని వసూళ్లకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో దర్యాప్తు బృందం విచారణ చేసింది. అనంతరం, శుక్రవారం సాయంత్రం ఆయనకు గాంధీ హాస్పిటల్‌లో మెడికల్ టెస్టులు చేపట్టారు. ఆ తర్వాత ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది.

click me!