Phone Tapping Case: టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో తొలి కేసు తెలంగాణలోనే..

By Mahesh KFirst Published Mar 29, 2024, 8:31 PM IST
Highlights

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు కొత్తగా టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించిన విషయం విధితమే. ఈ చట్టం కింద మన దేశంలో నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
 

Privacy: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత టెలిగ్రాఫ్ చట్టాన్ని ఇందులో పేర్కొనలేదు. కానీ, ఆ తర్వాత ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని జతపరచాల్సి ఉంటుందని తెలియగానే అధికారులు ఈ చట్టాన్ని కూడా కేసులో జోడిస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.

నిజానికి టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో ఇది వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బంజారాహిల్స్ పోలీసులు ఈ చట్టాన్ని కేసులో చేర్చడంతో తొలిసారిగా ఈ చట్టం కింద కేసు నమోదైనట్టయింది. దేశంలోనే ఈ చట్టం కింద తొలి కేసు తెలంగాణలోనే నమోదైంది.

ఉగ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల కుట్రలను భగ్నం చేయడానికి వీలైన అన్ని మార్గాలను దర్యాప్తు సంస్థలు ఉపయోగిస్తుంటాయి. ఈ క్రమంలో వారి ఫోన్ ట్యాపింగ్ చేసి కుట్రలను అడ్డుకోవడాన్ని చట్టం తప్పుపట్టదు. కానీ, సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు, న్యాయ కోవిదులు, పాత్రికేయులు వంటివారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం. రాజ్యాంగం కల్పించే గోప్యత హక్కును కాలరాసే విధంగా ఏ సాధారణ పౌరుడి ఫోన్‌నైనా ట్యాపింగ్ చేయడం కుదరదు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సంబంధిత చట్టాల కింద దర్యాప్తు సంస్థలు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభుత్వాలకు సరైన కారణాలు ఉండాలి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి ఇందుకు అనుమతులు ఉంటాయి. ఉన్నతాధికారుల విజ్ఞప్తుల మేరకు సర్వీస్ ప్రొవైడర్ చట్టానికి లోబడే ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి సుస్థిరత, భద్రత, విదేశీ వ్యవహారాలు, వేరే దేశాలతో సంబంధాలపై ప్రభావం పడకుండా ఉంటూ.. ఏదైనా నేరాన్ని అడ్డుకునే క్రమంలో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం ఫోన్ కాల్స్‌ను ఇంటర్‌సెప్ట్ చేయవచ్చు. అవసరమైతే ఆ డేటాను కంప్యూటర్‌లో స్టోర్ కూడా చేయవచ్చు.

సాధారణంగా జాతీయ స్థాయిలో సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ, సీబీడీటీ, డీఆర్ఐ, రీసెర్చ్ ఏజెన్సీలు వంటి సంస్థలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి.

పౌరుల గోప్యత హక్కును ఉల్లంఘిస్తే.. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బీ) కింద ఫోన్ ట్యాపింగ్ నేరానికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

click me!