కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మాదిరిగానే మోదీ గ్యారంటీల పేరిట ఏడు ప్రధాన హామీలతో తెలంగాణ బిజెపి మేనిఫెస్టో రూపొందినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది... ప్రచారానికి ఇంకా పదిరోజులు మాత్రమే సమయం వుంది. ఈ నేపథ్యంలో గేర్ మార్చి ప్రచార జోరు పెంచేందుకు బిజెపి సిద్దమయ్యింది. ఇప్పటికే బిఆర్ఎస్ మేనిఫెస్టో హామీలతో, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. కానీ బిజెపి మాత్రం మేనిఫెస్టో ప్రకటన, హామీల విషయంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. కానీ లేటయినా లేటెస్ట్ హామీలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు... తెలంగాణ ప్రజలకు మేలుచేసేలా తమ హామీలుంటాయని తెలంగాణ బిజెపి నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజా మేనిఫెస్టో తయారయ్యిందని... రేపు(శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలంగాణ బిజెపి ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మాదిరిగానే బిజెపి కూడా ప్రధానమైన ఏడు అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. మోదీ గ్యారంటీ నినాదంతో 'ఇంద్రధనుస్సు' పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంకోసం ఇవాళ రాత్రి తెలంగాణకు చేరుకోనున్నారు అమిత్ షా. రేపు వివిధ నియోజవకర్గాల్లో ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఆయన బిజెపి మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలున్నాయి.
undefined
బిజెపి మేనిఫెస్టో పేద, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా వుంటుందని తెలుస్తోంది. ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం హామీని మేనిఫెస్టోలో పొందుపర్చారట. అలాగే నారీశక్తి పేరిట ప్రతి వివాహితకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇచ్చేలా కొత్త పథకాన్ని తీసుకురానున్నామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్ ధర విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కుటోంది... కాబట్టి ఈ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పడకుండా మేనిఫెస్టోలో జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. కేవలం రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read More Kalvakuntla Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి పదవి... కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక అన్ని ప్రధాన పార్టీల మాదిరిగానే వ్యవసాయ రుణాాలు మాఫీ హామీ కూడా బిజెపి మేనిఫెస్టోలో కనిపించనుందట. కేవలం రైతుల రుణమే కాదు వడ్డీ కూడా మాఫీ చేసేలా బిజెపి హామీ వుండనుందట. ఇక ఉద్యోగాల భర్తీకి ముందుగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని... ప్రతి నెలా మొదటి వారంలో నియామక పత్రాలు ఇస్తామని బిజెపి ప్రకటించనుందట. పేదలకు ఇళ్లు, ఉపాధి కల్పన కోసం ఏం చేస్తారో బిజెపి ప్రకటించనుంది. ఇలా విద్యార్థులు, సామాన్యులు, రైతులకు లబ్ది చేకూర్చేలా బిజెపి మేనిఫెస్టోలోని అంశాలు వుండనున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.