CPM : సంగారెడ్డిలో ఆసక్తికర పరిణామం.. సీపీఎం మద్దతు కోరిన మంత్రి హరీశ్ రావు

By Mahesh K  |  First Published Nov 16, 2023, 9:29 PM IST

మంత్రి హరీశ్ రావు.. సీపీఎం పార్టీ మద్దతు కోరడం ఆసక్తిగా మారింది. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌తో పాటు సీపీఎం జిల్లా కార్యాలయానికి వెళ్లి ఆయన సీపీఎం పార్టీ మద్దతు కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరు మినహా మిగిలిన తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.
 


హైదరాబాద్: సంగారెడ్డిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు మద్దతు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు సీపీఎం పార్టీ మద్దతు కోరారు. వాస్తవానికి వామపక్ష పార్టీలే బీఆర్ఎస్‌ పిలుపు కోసం ఎదురుచూసి యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే.

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆ మద్దతును బీఆర్ఎస్‌తో కొనసాగుతుందని వామపక్షాలు ఆశించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో మద్దతు కొనసాగుతుందని, అందుకోసం సీట్ల పంపకాల కోసం చర్చించడానికి వామపక్షాల నేతలు ఎదురుచూశారు. కొన్నాళ్ల తర్వాత వామపక్షాల నేతలను సంప్రదించకుండానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వామపక్షాలు తమ దారి తాము చూసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు మంత్రి హరీశ్ రావు సీపీఎం మద్దతు కోరడం గమనార్హం. సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నది కానీ, సీపీఎం ఒంటరిగా పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

Latest Videos

undefined

Also Read: Chidambaram: తెలంగాణ బలిదానాలకు క్షమాపణలు చెప్పిన చిదంబరం.. హంతకుడే సంతపం చెప్పినట్టుంది: హరీశ్ రావు

సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌తోపాటు మంత్రి హరీశ్ రావు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములును, జిల్లా కార్యదర్శి మల్లేశం, మరికొందరు పార్టీకి చెందిన ఇతర నేతలను సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు సీపీఎం మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో పటాన్ చెరు నుంచి సీపీఎం పార్టీ ఏ మల్లేశ్వర రావును బరిలోకి దించింది. మిగిలిన 9 స్థానాల్లో సీపీఎం పార్టీ పోటీ చేయడం లేదు. దీంతో ఈ మిగిలిన తొమ్మిది స్థానాల్లో సీపీఎం పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కోరారు. బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సీపీఎం మద్దతు కోరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

click me!