అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రాళ్ల దాడి, టెన్షన్ : ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు

By narsimha lode  |  First Published Nov 12, 2023, 9:36 AM IST

తెలంగాణ  రాష్ట్రంలో ఎన్నికల వేళ  నాగకర్నూల్ జిల్లాలో  ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  భారత రాష్ట్ర సమితి,  కాంగ్రెస్ వర్గీయులు  ఘర్షణకు దిగారు.



అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నాడు అర్థరాత్రి  కాంగ్రెస్,  బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.  బీఆర్ఎస్ శ్రేణులు   కారులో  డబ్బులు తరలిస్తున్నారనే  కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. డబ్బులు తరలిస్తున్నారనే  అనుమానంతో  ఓ కారును  అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  

భారత రాష్ట్ర సమితి నేతలు కారులో డబ్బులను తరలిస్తున్నారనే అనుమానంతో  ఉప్పునుంతల మండలం వెల్దూర్ గేట్ వద్ద ఓ కారును అడ్డుకొనే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.  అయితే  ఈ వాహనం నిలిపివేయకపోవడంతో అచ్చంపేటలోని అంబేద్కర్ కూడలిలో  ఈ వాహనాన్ని అడ్డుకొని రాళ్లతో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడ అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు.  మరో వైపు  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  వంశీకృష్ణ కూడ అక్కడికి చేరుకున్నారు.  దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.  ఇరు వర్గాల రాళ్ల దాడిలో  ఎమ్మెల్యే  గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి.  ఆయనకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం  గువ్వల బాలరాజును హైద్రాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు . 

Latest Videos

ఈ ఘటనపై  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు  భారత రాష్ట్ర సమితికి చెందిన శ్రేణులు  కారులో డబ్బులు తరలిస్తున్న విషయాన్నిపోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు  పట్టుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. పోలీసులు అధికార భారత రాష్ట్ర సమితికి  సహకరిస్తున్నారని కాంగ్రెస్ నేత చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు.  

click me!