తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి బంపర్ మెజార్టీ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్న సీట్లను కాంగ్రస్‌కు కట్టబెట్టి కొత్త రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌ను బలమైన ప్రత్యర్థిగా శాసన సభలో కూర్చోబెడుతున్నారు. ఈ సారి అసెంబ్లీలో బీజేపీ బలం పెరగడంతోపాటు వామపక్ష ఎమ్మెల్యే కూడా ఉండనున్నారు.
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండోసారి ముందస్తుకు వెళ్లిన ఆ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చింది. అంటే.. కొత్త రాష్ట్రాన్ని సుమారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌కు రాష్ట్ర వనరులు, రాబడి, వ్యయాలు, ఇతర అంశాలపై వేరే ఏ పార్టీకీ లేని స్పష్టత ఉండటం సహజం. పలు శాఖలపై విస్తారమైన అవగాహన, ముఖ్యమంత్రిగానూ, రాజకీయ చాతుర్యత కేసీఆర్‌కు మెండుగా ఉన్నది. కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం, జగదీశ్ రెడ్డి వంటి బలమైన నేతలు బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇప్పుడు 2023లో ఓటర్లు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడుతూ తీర్పు ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో రేవంత్ రెడ్డికి అనుభవం లేదని, ఇది వరకు ఏ మంత్రి పదవీ చేయకపోవడం మూలంగా ఈ లోటు ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ రెండు సార్లూ అధికారంలో ఉన్నప్పుడు శాసన సభలో బలమైన ప్రతిపక్షలోటు కొనసాగింది. బీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు పోతున్నదని, నియంతృత్వ ధోరణులూ ప్రభుత్వంలో ఉన్నాయనే విమర్శలు ఈ నేపథ్యంలోనే వచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
undefined
Also Read : Janasena Party: అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో జనసేన ఫ్లాప్ షో
రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ హవా ఏమీ లేదు. ఆ పార్టీ కేవలం మెజార్టీ మార్క్ దాటి 64 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. రెండుమార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నా.. బలంగానే ఉన్నది. వామపక్ష నేత కూడా ఈ సారి అసెంబ్లీలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్రంలో బలమైన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంతో పాటు సంఖ్య పెంచుకున్న జాతీయ స్థాయి ప్రత్యర్థి బీజేపీని కూడా ఢీకొట్టాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవడమూ కాంగ్రెస్‌కు సవాల్‌గానే మారుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్షేమ పథకాలు వెలువలా ప్రకటించింది. వీటిని అమలు చేసే బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీపైనే ఉన్నది. దీంతో అప్పుల కుప్పగా ఈ రాష్ట్రం మారిందని చెప్పే కాంగ్రెస్ పార్టీకి వీటికి నిధులను అడ్జస్ట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ విసిరే ప్రశ్నలు, సవాళ్లను ఎదుర్కొంటూ పాలన అందించాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కత్తిమీద సాము చేయాల్సే ఉంటుంది. దీనికితోడు కాంగ్రెస్‌లో శృతిమించిన అంతర్గత ప్రజాస్వామ్యం ఉండనే ఉన్నది. పదవులు, హోదాలు, బాధ్యతల కేటాయింపుల్లో అలకలు, అసంతృప్తిని సర్దుకుంటూ పోవాల్సి ఉన్నది. దీనికితోడు త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ ఈ దూకుడును కొనసాగించాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రభుత్వం విజయవంతంగా సాగుతున్నట్టైనా ముద్ర వేసుకోవాల్సి ఉంటుంది.
Also Read : Election Results: ముగ్గురు బీజేపీ ఎంపీల ఓటమి.. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల గెలుపు
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో అసలు పాలన ఇప్పుడే మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.