బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసమన్నారు సీఎం కేసీఆర్. ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వోలు వస్తారని.. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధులో సగం ఇవ్వమని అడుగుతారని కేసీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసమన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ములుగులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. 15 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఎన్నికల్లో పార్టీలో దృక్పథాన్ని చూసి ఓటేయ్యాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని .. ఎవరి పాలనలో ఎంత మేలు జరిగిందో పోల్చిచూడాలని ఆయన కోరారు.
కంటి వెలుగు వంటి కార్యక్రమాన్ని ఎవరూ ఊహించలేదని.. ప్రతి గ్రామంలో శిబిరాలు పెట్టి 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని కేసీఆర్ గుర్తుచేశారు. కంటి వెలుగు కార్యక్రమం కింద 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు. ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మీ కింద రూ.లక్షా 116 ఇస్తున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు.
undefined
కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని.. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారులు, లంచాల రాజ్యం వస్తుందని సీఎం హెచ్చరించారు. ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వోలు వస్తారని.. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధులో సగం ఇవ్వమని అడుగుతారని కేసీఆర్ పేర్కొన్నారు.
ధరణి వల్లే రైతుబంధు డబ్బులు ఇవ్వగలుగుతున్నామని సీఎం తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు వచ్చాయా, కాంగ్రెస్ ప్రభుత్వం పోడుపట్టాలు ఇచ్చిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఇంకేమీ లేవని ముఖ్యమంత్రి చురకలంటించారు.