Telangana Assembly Elections 2023 : బిఆర్ఎస్ పార్టీకి ఈసీ నోటీసులు... 24 గంటల్లో రియాక్ట్ కావాలంటూ... 

By Arun Kumar PFirst Published Nov 28, 2023, 7:05 AM IST
Highlights

కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు అధికార బిఆర్ఎస్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీని ఈసీ ఆదేశించింది. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ప్రచారం చివరిదశకు చేరుకోవడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా ప్రకటనలతో రాజకీయ పార్టీలు కార్పోరేట్ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ యాడ్స్ లో తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడమే కాదు ప్రత్యర్థి పార్టీలను కించపరుస్తూ సెటైరికల్ గా వుంటున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ అంటూ అధికార బిఆర్ఎస్ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ యాడ్స్ పై ఎన్నికల కమీషన్ రియాక్ట్ అయ్యింది.  

కాంగ్రెస్ ను 'స్కాంగ్రెస్' అంటూ బిఆర్ఎస్ పార్టీ ప్రకటనలు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బిఆర్ఎస్ యాడ్స్ పై తెలంగాణ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసారు. వెంటనే స్పందించిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ బిఆర్ఎస్ పార్టీకి నోటీసులు జారీచేసారు. ఇరవైనాలుగు గంటల్లోగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్ కు సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు.   

Latest Videos

Read More  Ration Cards: కేటీఆర్ సంచలన హామీ.. రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన.. ఎప్పుడంటే?

ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు కూడా ఈసీ నోటీసులు జారీచేసింది. దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ బాన్సువాడ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై సీరియస్ అయ్యారు. మాకు చేతులు లేవా! కత్తి పట్టలేమా! మాకు తిక్కరేగిందో దుమ్మురేగుతుంది జాగ్రత్త... అంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఇలా కేసీఆర్ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఈసికి ఫిర్యాదు చేసింది. 

కాంగ్రెస్ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో వుండి ఎన్నికల వేళ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని కేసీఆర్ కు సూచించింది. ఇకపై ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి వుంటుందని... తగిన చర్యలు తీసుకుంటామని ఈసీఐ అడ్వైజరీ కమిటీ హెచ్చరించింది. ఈ నోటీసులను తెలంగాణ సిఈవో వికాస్ రాజ్ సీఎం కేసీఆర్ కు పంపించారు. 

ఇక మంత్రి కేటీఆర్‌కు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ నోటీసులు ఇచ్చింది. రాజకీయ కార్యకలాపాల కోసం కేటీఆర్ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకున్నారని సూర్జేవాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిందిగా కేటీఆర్‌ కు నోటీసులు జారీ చేసింది. 

 

click me!