తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో కూకట్ పల్లి టికెట్ జనసేనకు దక్కగా గెలుసుకోసం జైనసైనికులు కృషిచేస్తున్నారు.
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓటర్లు ఎక్కువగా వున్న నియోజకవర్గం కూకట్ పల్లి. దీంతో ఈ సీటును జనసేనకు కేటాయించింది బిజెపి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల ప్రభావం వుండే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన జనసేన పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. బిజెపి, జనసేన పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి కూకట్ పల్లిలో జెండా పాతాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లిలో జనసేన ప్రచార సరళి, గెలుపుకోసం అనుసరించాల్సిన విధానాలపై అభ్యర్థితో పాటు ముఖ్య నాయకులతో చర్చించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి బిజెపి కార్యాలయానికి విచ్చేసారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపుకోసం జనసైనికులు, వీర మహిళలు కృషిచేయాలని ఆయన సూచించారు. భారీ మెజారిటీతో గెలిపించి ఆయనను తెలంగాణ అసెంబ్లీకి పంపించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి జనసేన నాయకులు చేరుకోవాలని... అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రచారం సాగించాలని సూచించారు.
undefined
ఈ సందర్భంగా నాదెండ్ల మీడియాతో మట్లాడుతూ... కూకట్ పల్లిలో జనసేనకే గెలిచే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా కూకట్ పల్లి ప్రచార సభలో పాల్గొంటారని ప్రకటించారు. ఈ నెల 26న కూకట్ పల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో అమిత్ షా, పవన్ కల్యాణ్ పాల్గొంటారని నాదెండ్ల తెలిపారు.
Read More Bandi Sanjay: దళిత బంధులో అవినీతి.. కమీషన్ లో కేసీఆర్ కు వాటా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఇక అంతకుముందే అంటే నవంబర్ 24న కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని జనసేన, బిజెపి నాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు. ఇలా కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి గెలుపుకోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కూకట్ పల్లిలో ఇప్పటికే బిజెపి, జనసేన నాయకులు ప్రజల్లోకి వెళుతూ ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. వచ్చేవారం ఈ ప్రచారం మరింత జోరందుకోనుందని తెలిపారు. అమిత్ షా, పవన్ కల్యాణ్ పాల్గొనే సభలో జన సైనికులు, వీర మహిళలతోపాటు బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.