Vote Share: కామ్రేడ్లా?.. కమలనాథులా?.. తెలంగాణ రాష్ట్రం ఎటు వైపు?

By Mahesh KFirst Published Dec 7, 2023, 12:57 AM IST
Highlights

తెలంగాణలో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నా.. ఒంటరిగా పోటీ చేసినా బలహీనపడుతూనే వస్తున్నాయి. అదే బీజేపీ మాత్రం పొత్తులో లాభపడుతున్నది. క్రమంగా బలపడుతూ వస్తున్నది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వీటి సరళి ఎలా ఉన్నది?
 

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం కాగా.. కాంగ్రెస్ తొలిసారిగా నూతన తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠాన్ని అధిరోహించనుంది. మిగిలిన పార్టీలు తమ పురోగతిపై ఆత్మపరిశీలన చేసుకుంటున్నాయి. సాధారణ ప్రజలు కూడా ఏ పార్టీ బలపడుతున్నది? ఏ పార్టీ బలహీనమవుతున్నది? అనే అంచనాలు వేసుకుంటున్నారు. ఈ బలాలను సీట్లతో లెక్కవేయడం కంటే ఓటు షేర్‌తో అంచనా వేయడం సబబుగా ఉంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రం. తెలంగాణలోనూ సాయుధ రైతాంగ పోరాటం మొదలు అనేకమార్లు కమ్యూనిస్టులు ప్రజలపై తమ ముద్రను బలంగా వేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో వారిది కీలకపాత్ర. కానీ, రానురాను కమ్యూనిస్టుల బలం హరించుకుపోతున్నట్టు తాజా ఎన్నికలు తేలుస్తున్నాయి. కమ్యూనిస్టులు శత్రువుగా చెప్పే బీజేపీ మాత్రం ఎదుగుతూ వస్తున్నది.

Also Read: Revanth Reddy: పార్లమెంటులో వివాదం.. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫైర్.. ఇంతకీ రేవంత్ ఏమన్నారు?

2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు షేర్ ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలిద్దాం. లోక్ సభ ఎన్నికలను ఇందుకు పరిగణించడం లేదు. లోక్ సభ ఎన్నికల విషయంలో ఓటర్ల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్న ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐ. ఇక్కడ కమ్యూనిస్టుల బలం అంటే ఈ రెండు పార్టీల బలంగా అర్థం చేసుకోవాలి. 

కమ్యూనిస్టుల కథ:

2018లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితి కలిసి పోటీ చేశాయి. అప్పుడు సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. సీపీఎం 26 స్థానాల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అయితే.. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.40 శాతం, సీపీఎంకు 0.44 శాతం ఓటు శాతం దక్కింది. మొత్తం కమ్యూనిస్టు పార్టీలకు 2018లో దక్కిన ఓటు శాతం 0.84 శాతం. 2023లో కాంగ్రెస్‌తో పొత్తులో సీపీఐ ఒకే చోట పోటీ చేసి గెలిచింది. సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేసి గెలువలేదు. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.34 శాతం, సీపీఎంకు 0.22 శాతం. 2023లో కమ్యూనిస్టు పార్టీల ఓటు శాతం 0.66 శాతం. 

Also Read: Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ఈ అరుదైన ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఇదే.. అప్పుడు ఏం చేసేవాడో తెలుసా?

నోటా బెటర్:

అంటే.. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటు శాతం 0.22 శాతం తగ్గిపోయింది. నిజానికి ఈ రెండు సార్లూ నోటాకు వచ్చిన ఓటు శాతం అధికంగా ఉన్నది. 2014లో 1.09 శాతం, 2018లో 0.73 శాతం. 2014లో సీపీఐకి 0.9 శాతం, సీపీఎంకు 1.6 శాతం ఓటు షేర్ లభించింది. ఈ లెక్కన కమ్యూనిస్టు పార్టీలు రానురాను బలాన్ని కోల్పోతూనే ఉన్నాయి. పొత్తులో ఉన్న సీపీఐ, ఒంటరిగా పోటీ చేస్తున్న సీపీఎం రెండూ కూడా ఓటు షేరును కోల్పోతున్నాయి.

బీజేపీ దూకుడు:

అదే బీజేపీకి 2018లో 6.98 శాతం ఓటు షేరు ఉండగా.. ఇది 2023లో 13.89 శాతానికి పెరిగింది. 2014లో టీడీపీతో పొత్తులో పోటీ చేసినప్పుడూ బీజేపీకి 7.1 శాతం ఓటు శాతం లభించింది. అంటే.. టీడీపీతో పొత్తు బీజేపీకి కలిసి వచ్చింది. ఆ తర్వాత కూడా బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వస్తున్నది.

click me!