telangana exit polls : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను నమ్మబోనని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు వాటిపై విశ్వాసం లేదని చెప్పారు. కర్ణాటకలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాలకు తేడా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (telangana assembly election 2023) పోలింగ్ ముగిసింది. నేతల భవితవ్యం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. కౌంటింగ్ ఇంకా మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దాదాపుగా ఆదివారం మధ్యాహ్నం తరువాత రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ (congress)దే అధికారం అని అంచనా వేశాయి. అయితే దీనిని అధికార బీఆర్ఎస్ కొట్టి పారేస్తోంది. వాస్తవ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఏ పార్టీకి ఎప్పుడు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు? మొత్తం డేటా ఓకే చోట
ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా అధికార మార్పిడి తప్పదని చెబుతుండంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలించాలని భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకే ఎన్నికైన ఎమ్మెల్యేలను తీసుకెళ్లాని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ తనకు ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మీడియా అడిగిన ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ.. ‘ఎగ్జిట్ పోల్స్ పై వ్యక్తిగతంగా నాకు నమ్మకం లేదు. కర్ణాటకలో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏమయ్యాయో మీ అందరికీ తెలుసు.’’ అని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమయం గడిపే వారికే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ శాంపిల్ బేస్డ్ అని, ఒక రాష్ట్రం మొత్తం చిత్రాన్ని ప్రతిబింబించబోవని చెప్పారు.
ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను బెంగళూరులో ఉంచుతారా అని డీకే శివ కుమార్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. రాజస్థాన్ పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, తమ పార్టీయే అధికారం చేపడుతుందని తనకు నమ్మకం ఉందని అన్నారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు తాను పని చేస్తానని వెల్లడించారు.
కాగా.. గతంలో కాంగ్రెస్ పార్టీకి పలుమార్లు విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వాటిని శివ కుమార్ డీల్ చేశారు. గతంలో మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలో ఉన్న రిసార్టుల్లో చూసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి శివ కుమార్ అంటే విశ్వాసం ఏర్పడింది. మరి ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.