తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం, బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కామారెడ్డి సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన అగ్రనేతలను  రంగంలోకి దింపుతుంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య  కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో  నిర్వహించిన సభలో  పాల్గొన్నారు.

Google News Follow Us

కామారెడ్డి:తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని  కర్ణాటక సీఎం సిద్దరామయ్య ధీమాను వ్యక్తం చేశారు. కామారెడ్డిలో  శుక్రవారంనాడు నిర్వహించిన  కాంగ్రెస్ సభలో  కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రసంగించారు.  అవినీతి డబ్బుతో  తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ ఈ దఫా కేసీఆర్ ను ఓడించాలని  ప్రలు నిర్ణయించుకున్నారన్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న  రెండు  నియోజకవర్గాల్లో  ఓటమి చెందుతారని ఆయన  జోస్యం చెప్పారు.

 కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సిద్దరామయ్య ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో అవినీతి రాజ్యమేలిందని ఆయన ఆరోపణలు చేశారు. తమ ఓటు హక్కుతో  కేసీఆర్ ను ఇంటికి పంపాలని  ప్రజలు ఎదురు చూస్తున్నారని సిద్దరామయ్య చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నాలుగైదు సీట్లు వస్తే అవే చాలా ఎక్కువ అని ఆయన  ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాలుగైదు సార్లు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడ దక్కవని ఆయన  జోస్యం చెప్పారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం నరేంద్ర మోడీ కర్ణాటకకు  48 దఫాలు వచ్చిన విషయాన్ని సిద్దరామయ్య ప్రస్తావిస్తూ మోడీ ఎక్కడ ప్రచారం చేశారో అక్కడే కాంగ్రెస్ కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని సిద్దరామయ్య చెప్పారు.దీంతో మోడీని నమ్ముకున్న కర్ణాటక బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్దాల కోరు అని  ఆయన  విమర్శించారు. ఇలాంటి అబద్దాల కోరు ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. మోడీ వందసార్లు  వచ్చి ప్రచారం చేసినా  బీజేపీ అభ్యర్థులు  గెలవరని ఆయన  చెప్పారు.

దళితులు,వెనుకబడిన వర్గాల వారు ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టారా అని ఆయన ప్రశ్నించారు.దళితులు, వెనుకబడినవర్గాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని  సిద్దరామయ్య   విమర్శించారు. 

also read:బీసీలకు ప్రత్యేక మంత్రి పదవి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీ స్కీమ్ ను  అమలు చేయలేరని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేసీఆర్ కూడ  విమర్శలు చేశారన్నారు. కానీ,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కేసీఆర్  చేస్తున్న విమర్శలను  సిద్దరామయ్య తోసిపుచ్చారు. కర్ణాటకకు వస్తే  ప్రజలకు ఇచ్చిన హామీలను  అమలుకు ఎంత ఖర్చు చేస్తున్నామో చూపుతామని సిద్దరామయ్య  ప్రకటించారు.


 

Read more Articles on