నామినేషన్ వేసేందుకు వెళ్లిన షెట్కార్ కు షాక్: నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డికే కాంగ్రెస్ టిక్కెట్టు

By narsimha lode  |  First Published Nov 10, 2023, 1:50 PM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో  రెండు అసెంబ్లీ స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్ధులను మార్చింది.  తాను సూచించిన అభ్యర్థులకే  దామోదర రాజనర్సింహ టిక్కెట్లు దక్కించుకున్నారు.



నారాయణఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లాలో  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పంతం నెగ్గించుకున్నారు.  పటాన్ చెరు,  నారాయణఖేడ్ స్థానాల్లో తాను సూచించిన అభ్యర్ధులకే టిక్కెట్లు దక్కేలా చేసుకున్నారు.  గతంలో  ప్రకటించిన ఇద్దరికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను మార్చింది.  నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుండి  సంజీవరెడ్డికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  సంజీవరెడ్డి  నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో  పార్టీ నాయకత్వం సంజీవరెడ్డికే టిక్కెట్టు కేటాయించినట్టు సమాచారం అందింది. దీంతో సంజీవరెడ్డి  అనుచరులు  మళ్లీ కాంగ్రెస్ జెండాలు చేతబూనారు.

ఇదిలా ఉంటే  నామినేషన్ దాఖలు చేసేందుకు  సురేష్ షెట్కార్  తన అనుచరులతో  రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లారు. అదే సమయంలో సంజీవ రెడ్డికి టిక్కెట్టును కేటాయించినట్టుగా పార్టీ నాయకత్వం సమాచారం అందించింది. దీంతో  సురేష్ షెట్కార్ తన  అనుచరులతో కలిసి నామినేషన్ వేయకుండానే  వెనక్కు తిరిగారు.

Latest Videos

సురేష్ షెట్కార్ కు లోక్ సభ టిక్కెట్టు ఇస్తామని  కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుండి  నామినేషన్ వేయకుండానే  షెట్కార్ వెనుదిరిగారు.  నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుండి సంజీవరెడ్డి,  పటాన్ చెరు నుండి కాటా శ్రీనివాస్ గౌడ్ లకు టిక్కెట్లు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పట్టుబట్టారు. కాంగ్రెస్ నాయకత్వంతో అమీతుమీకి సిద్దమయ్యారు.  ఈ విషయమై  మాట్లాడిన  పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  తన అభిప్రాయాలను దామోదర రాజనర్సింహ కుండబద్దలు కొట్టారు. దరిమిలా కాంగ్రెస్ నాయకత్వం పునరాలోచనలో పడింది.  ఈ రెండు స్థానాల్లో  అభ్యర్థులను మార్చింది. పటాన్ చెరులో  నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కే టిక్కెట్టు కేటాయించింది. 
 

click me!