టీఆర్ఎస్, ఎంఐఎం కోరిక దేశభద్రతకే ముప్పు: యోగి ఆదిత్యనాథ్

By Siva KodatiFirst Published Apr 7, 2019, 4:43 PM IST
Highlights

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నాయన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నాయన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. గతంలో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని మూసివేస్తే.. రూ.5,500 కోట్లతో దానిని పునరుద్దరించామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు నిజాం పాలనను తలపిస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వకూడదని ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

దేశ సమగ్రతకు విఘాతం కలిగించే ఎంఐఎం లాంటి పార్టీలు చేస్తున్న ప్రకటనలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలుకుతోందని యోగి మండిపడ్డారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ మన సైనికుల శక్తి ప్రదర్శనకు... మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాల ప్రదర్శనకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని..కేవలం బీజేపీ హయాంలోనే ఉగ్రవాదులపై మెరుపుదాడులు జరిగాయని... అంతరిక్షంలోనూ మన శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని.. దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్రమోడీని మరోసారి ఎన్నుకోవాలని ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపిస్తే... మోడీ ప్రభుత్వం వారికి బుల్లెట్లతో సమాధానమిచ్చిందని వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కావాలంటూ టీఆర్ఎస్, ఎంఐఎంలు దేశ భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారికి సైతం మోడీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. 

click me!