
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పేరు మార్చి అమలు చేస్తున్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కొంపల్లిలోని పీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ప్రధానిగా దిగిపోయే ముందు మోడీ.. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మేలు చేశారని ప్రశంసించారు.
ఏపీలోనూ అన్నదాత సుఖీభవ పేరిట పథకాన్ని తీసుకొచ్చారని... తెలంగాణ నమూనాను దేశం మొత్తం గమనిస్తోందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు 24 గంటలపాటు నీరు వచ్చే రోజు రావాలని... నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
హైదరాబాద్‌లో 4 వేల బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని.. ఇప్పటికే 40 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయని మిగిలినవి త్వరలో మారుస్తామని కేటీఆర్ వెల్లడించారు. మెట్రో రైలు మార్గాన్ని మరింత విస్తరించి.. హైదరాబాద్‌లోని చెరువులన్నీ సుందరీకరిస్తామని ఆయన తెలిపారు.