సెకండాఫ్ అదుర్స్.. మెక్సికోపై స్వీడన్ విజయం

First Published 28, Jun 2018, 10:39 AM IST
Highlights

సెకండాఫ్ అదుర్స్.. మెక్సికోపై స్వీడన్ విజయం

హైదరాబాద్: గ్రూప్ ఎఫ్‌లో నాకౌట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర దించుతూ స్వీడన్ టాప్ పొజిషన్‌లో ఉన్న మెక్సికోపై 3-0 గోల్స్ తేడాతో అసాధారణ రీతిలో గెలుపొందింది. ఫస్ట్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఇంతటి సంచలనానికి ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ వేదికగా మారింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అగస్టిన్సన్ నిలిచాడు.ఫస్టాఫ్‌ అంతా నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగడంతో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. మంచి చాన్సులు వచ్చినా కానీ వాడుకోవడంలో విఫలమయ్యాయి. 


సెకండాఫ్ వచ్చేసరికి స్వీడన్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. మంచి దూకుడు మీద ఆడింది. టీమ్ వర్క్ బ్రహ్మాండంగా పనిచేసింది. డిఫెండర్ అగస్టిన్సన్ 50వ నిముషంలో బ్రహ్మండమైన గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యత సంపాదించి పెట్టాడు. ఆ తర్వాత 62వ నిముషంలో స్వీడన్‌కు పెనాల్టీ కిక్ దక్కింది. బాల్‌ను కొట్టే అవకాశాన్ని కెప్టెన్ ఆండ్రియన్ గ్రాంక్విస్ట్ అంది పుచ్చుకున్నాడు. గోల్ కీపర్ కన్నుగప్పాడు. ఒక్కసారిగా డైరెక్షన్ మార్చి బాల్‌ను నెట్స్‌లోకి కొట్టాడు. మైదానమంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోగా స్వీడన్‌కు 2-0 ఆధిక్యతను సమకూర్చాడు. ఇక 74వ నిముషంలో మెక్సికో డిఫెండర్ ఎడ్సన్ అల్వరేజ్ సెల్ఫ్ గోల్ చేయడంతో స్వీడన్ ఆధిక్యత 3-0కు పెరిగిపోయింది. మెక్సికోపై ఘన విజయం సాధించింది.

Last Updated 28, Jun 2018, 10:39 AM IST