ప్రో కబడ్డి 2019: రాహుల్ చౌదరి అత్యుత్సాహానికి భారీ మూల్యం... పాట్నా చేతిలో తమిళ్ టీం ఓటమి

By Arun Kumar PFirst Published Jul 29, 2019, 8:46 PM IST
Highlights

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పట్నా పైరేట్స్ మరో విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ పోరులో తమిళ తలైవాస్ పై కేవలం 1 పాయింట్ తేడాతో పట్నా పైరేట్స్ జట్టు విజయాన్ని అందుకుంది.  

ప్రో కబడ్డి సీజన్ 7 లో మరో ఉత్కంఠపోరుకు ముంబై లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ తమిళ్ తలైవాస్, పాట్నా పైరేట్స్ జట్ల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే కీలక సమయంలో తమిళ్ జట్టు స్టార్ రైడర్ రాహుల్ చౌదరి చేసిన చిన్న పొరపాటు ఆ జట్టును ఓడించింది. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరకు పట్నా జట్టు కేవలం 1 పాయింట్స్ తేడాతో విజేతగా నిలిచింది.  

తమిళ జట్టు రైడర్ రాహుల్ చౌదరి మ్యాచ్  మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా పాట్నాకు అనవసరంగా ఓ పాయింట్ సమర్పించుకున్నాడు. ప్రత్యర్థి కంటే రెండు పాయింట్లు వెనుకబడ్డ తమ జట్టును విజేతగా నిలపాలన్న తాపత్రయంతో అతడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఈ క్రమంలో రైడింగ్ కు వెళ్లిన అతడు పొరపాటును కోర్ట్ బయటకు వెళ్ళిపోయి అనవసరంగా ఓ పాయింట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత తమిళ జట్టు సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్లు సాధించినప్పటికి 23-24 తేడాతో పట్నా గెలిచింది. ఇలా రాహుల్ చేసిన చిన్న తప్పుకు తమిళ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. 

ఇక మ్యాచ్ ఆసాంతం ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడాయి. ఇరు జట్లలో రైడర్స్ కంటే డిఫెండర్స్ అద్భుతంగా ఆడారు. ఇలా తమిళ జట్టు రైడింగ్ లో 9, ట్యాకిల్స్ లో 11 పాయింట్లు సాధించగా పైరేట్స్ జట్టు రైడింగ్ లో 7, ట్యాకిల్స్ లో 13 పాయింట్లు సాధించింది. ఇక తలైవాస్ కు ఎక్స్‌ట్రాల రూపంలో 3 పాయింట్లు లభిస్తే పట్నాకు 4 పాయింట్లు లభించాయి. 

తమిళ ఆటగాళ్లలో రాహుల్ చౌదరి 5, మంజీత్ చిల్లర్ 4, అజిత్ 3, అజయ్ 3,రాన్ సింగ్ 3, మంజీత్ చిల్లర్ 1 పాయింట్లు సాధించారు.  పట్నా ఆటగాళ్ళలో జయదీప్ అత్యధికంగా 7, మోను 5, ఇస్మాయిల్ 2, హది 2 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక ప్రదీప్, నీరజ్, వికాస్, ఆశిశ్ లు తలో ఒక్క పాయింట్ సాధించి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.  
 

click me!