T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ప్రారంభంకానున్న నేపథ్యంలో హఠాత్తుగా ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మెగా టోర్నమెంట్ పై దాడి చేస్తామంటూ పాక్ ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడ్డారు.
Terrorist threats on T20 World Cup 2024 : యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే, క్రికెట్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తూ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే హఠాత్తుగా ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. జూన్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా క్రికెట్ వెస్టిండీస్‌కు తీవ్రవాద దాడి హెచ్చరికలు వచ్చాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీపై ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ఉత్తర పాకిస్తాన్‌లో ఉన్న ఐఎస్ కు చెందిన ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ శాఖ అయిన ఐఎస్-ఖొరాసాన్ బెదిరించింది. కరేబియన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించింది.
పాకిస్థాన్ నుంచి ఉగ్రదాడి ముప్పు..
వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందన్న భయాందోళనలను తొలగించేందుకు క్రికెట్ వెస్టిండీస్ ప్రయత్నించింది. 2024 టీ20 ప్రపంచకప్‌కు గట్టి భద్రత కల్పిస్తామని క్రికెట్ వెస్టిండీస్ హామీ ఇచ్చింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ప్రతి ఒక్కరి భద్రత తమ ప్రథమ ప్రాధాన్యత అనీ, తాము సమగ్రమైన, బలమైన భద్రతా ప్రణాళికను కలిగి ఉన్నామని భరోసాను ఇవ్వగలమని క్రికెట్ వెస్టిండీస్ సీఈవో జానీ గ్రేవ్స్ చెప్పినట్టు క్రిక్‌బజ్ నివేదించింది.
టోర్నీకి ముందు భయాందోళనలు..
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ప్రో-ఇస్లామిక్ స్టేట్ నుండి టీ20 ప్రపంచ కప్‌కు ముప్పు పొంచివుంది. 'నాషీర్ పాకిస్తాన్' మీడియా గ్రూప్ ద్వారా ఈ సమాచారం అందింది. డైలీ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, నషీర్-ఇ పాకిస్థాన్ అనేది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో అనుబంధించబడిన ప్రచార ఛానెల్. వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు ఆంటిగ్వా, బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరుగుతాయి. అలాగే, అమెరికా నగరాలైన ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్‌లలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఆటలకు ఎటువంటి ముప్పు కనిపించలేదు. రెండు సెమీ ఫైనల్‌లు ట్రినిడాడ్, గయానాలో, ఫైనల్ బార్బడోస్‌లో జరుగుతాయి.
జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024..
టీ20 ప్రపంచ కప్ 2024 గురించి ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉగ్రవాద హెచ్చరికల పట్ల కూడా అప్రమత్తంగా ఉంది. టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్ జూన్ 1 నుండి జూన్ 29 వరకు నిర్వహించనున్నారు. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో ఐర్లాండ్‌తో జూన్ 5 నుంచి టీమ్ ఇండియా ప్రపంచ కప్ మ్యాచ్ లను ప్రారంభించనుంది. 2024 జూన్ 9న న్యూయార్క్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.