టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పాక్‌ బౌలర్‌

By sivanagaprasad KodatiFirst Published Aug 26, 2018, 6:28 PM IST
Highlights

 టీ20 అంటేనే పరుగుల వరద. ప్రతి బంతిని బౌండరీ బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించడం టీ20లో సర్వసాధారణం. మెయిడిన్‌‌ ఓవర్లు అనేవి చాలా అరుదు....అయితే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

బార్బడోస్‌ : టీ20 అంటేనే పరుగుల వరద. ప్రతి బంతిని బౌండరీ బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించడం టీ20లో సర్వసాధారణం. మెయిడిన్‌‌ ఓవర్లు అనేవి చాలా అరుదు....అయితే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేసి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు. వరుసగా 23 డాట్‌ బాల్స్‌ను విసిరి రికార్డు సృష్టించాడు‌. టీ20 చరిత్రలో అత్యంత తక్కువ పరుగులిచ్చిన(4-3-1-2) ఏకైక బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బార్బడోస్‌ ట్రిడెంట్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ పాట్రియాట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బార్బడోస్‌ జట్టు తరఫున ఆడిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్‌ అందులో వరుసగా 23 బంతులను డాట్‌ బాల్స్‌గా వేశాడు. మూడు మెయిడిన్‌ ఓవర్లతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. 

4 ఓవర్లు వేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి, ఓపెనర్లు క్రిస్‌ గేల్‌, ఇవిన్‌ లెవిస్‌ వికెట్లను తీశాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తన బంతులతో బెంబేలెత్తించాడు. అతని చివరి ఓవర్‌లో ప్రత్యర్థి జట్టు ఒక్క పరుగు సాధించింది. లేకపోతే అది కూడా మెయిడిన్‌‌ ఓవర్‌గా మిగిలేది.

అయితే ఇంతలా అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ అతని జట్టు ఓడిపోవడం గమనార్హం. తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగా 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియాట్స్ జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలుపొందింది. 

click me!