
దుబాయ్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో కోహ్లీ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో విరాట్ పరుగుల వరద సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు సాధించడంతో టెస్ట్ ర్యాంకుల్లో తిరిగి అగ్రస్థానాన్నిచేరుకున్నాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ మొదటిసారి టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానానికి పడిపోయాడు.
తాజాగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో చేసిన పరుగులకు గాను కోహ్లీ తిరిగి నంబర్‌వన్‌గా నిలిచాడు. 937 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.... ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. కోహ్లీ టెస్టు కెరీర్‌లోనే ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో కోహ్లీయే నెంబర్ వన్
మరోక భారత ఆటగాడు పుజారా టాప్ టెన్ లో స్థానం సాధించాడు. 6వ స్థానంలో పుజారా నిలవగా....రహానె 19వ స్థానంలోనూ శిఖర్ ధావన్ 22వ స్థానంలో నిలిచారు. హార్థిక్ పాండ్య 8 స్థానాలను ఎగబాకి 51వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే రవీంద్ర జడేజా 3వ స్థానంలోనే కొనసాగుతుండగా... ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి కాస్త దిగజారి 7, 22 ర్యాంకుల్లో నిలిచారు. బౌలర్ల జాబితాలో కూడా పాండ్య కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 51వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా పాండ్య 27 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకును దక్కించుకున్నాడు.