
Lakshya Sen : పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు అద్భుతమైన పోరాట ప్రదర్శనను చూపించారు. బ్యాడ్మింటన్ పరుషుల సింగిల్స్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ బ్రాంజ్ మెడల్ కొద్ది దూరంలో కోల్పోయాడు. కానీ, లక్ష్యసేన్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి అందరి మనసులను గెలుచుకున్నాడు. బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్ లో మలేషియాకు చెందిన లీ జి జియాతో తలపడ్డాడు. ఈ మ్యాచ్ లో లక్ష్యసేన్ మొదటి గేమ్ ప్రారంభం నుంచి అధిపత్యం ప్రదర్శించాడు. అద్భుతమైన షాట్స్ తో లీ జి జియాకు షాకిచ్చాడు. లక్ష్యసేన్ తొలి గేమ్ ను 20-13తో గెలుచుకున్నాడు. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇక్కడ లక్ష్యసేన్ ఓడిపోయాడు. లీ జి జియా రెండో గేమ్ ను 21-16 తో గెలుచుకున్నాడు. విజేతను నిర్ణయించడానికి మూడవ, చివరి గేమ్ ఆడారు. ఈ గేమ్ లో కూడా ఇద్దరు ప్లేయర్లు అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించారు. అయితే, లీ జి జియా ఫుల్ ఛార్జ్ తో ఈ గేమ్ లో మొదటి నుంచి లక్ష్యసేన్ పై పైచేయి సాధించాడు. ఈ గేమ్ లో.లక్ష్యసేన్ పై 11-21తో లీ జి జియా విజయాన్ని అందుకుని బ్రాంజ్ మెడల్ ను గెలుచుకున్నాడు.
ఎవరీ లక్ష్యసేన్?
పారిస్ ఒలింపిక్స్ 2024 లో రికార్డుల మోత మోగించిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో బ్రాంజ్ మెడల్ ను కొద్ది దూరంలో కోల్పోయాడు. అయితే, అతని పోరాటాన్ని యావత్ భారతావని ఎప్పటిీ గుర్తుంచుకుంటుంది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఆగస్టు 16, 2001న జన్మించిన లక్ష్య సేన్.. బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. సేన్ 2016లో ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ ప్రారంభించాడు. జూనియర్ సర్క్యూట్‌లో చెప్పుకోదగ్గ విజయాలతో ప్రయాణం ప్రారంభమైంది. ఆ సంవత్సరం జూనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. కానీ, ఆ తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌తో సహా 2017లో జరిగిన టోర్నీలలో చాలా ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నాడు.
అక్కడితో కుంగిపోకుండా తర్వాతి సంవత్సరాల్లో లక్ష్యసేన్ ఆటతీరును గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. 2017లో వియత్నాం ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో జపాన్‌కు చెందిన కోడై నారోకాతో తలపడ్డాడు.. తృటిలో మెడల్ కోల్పోయాడు. 2021లో BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ ఆక్సెల్‌సెన్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఫైనల్‌కు చేరుకోవడం లక్ష్యసేన్‌కు 2022 సంవత్సరం కీలకమైనది. అలాగే, కిదాంబి శ్రీకాంత్, HS ప్రణయ్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి వంటి సహచరులతో కలిసి సేన్ థామస్ కప్‌ను గెలవడానికి భారతదేశానికి సహాయం చేయడంలో గణనీయమైన విజయాన్ని సాధించాడు.
ఈ విజయంతో అతని ఆకట్టుకునే ప్రదర్శనలతో పాటు BWF ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం. 6 కెరీర్-బెస్ట్ ర్యాంకింగ్ కు చేరుకున్నాడు. 2022లో ఇండియా ఓపెన్, 2023లో కెనడా ఓపెన్‌ను గెలుచుకున్నాడు. లక్ష్య బ్యాడ్మింటన్ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి డీకే సేన్ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ కోచ్. అలాగే, అతని అన్న చిరాగ్ జాతీయ స్థాయిలో పోటీ పడ్డాడు. అలాగే, లక్ష్యసేన్ తాతయ్య కూడా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో కొద్ది దూరంలో ఆగిపోయాడు.