
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంత మొనగాడేమి కాదని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది.. ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో భారత్ ధీమాగా ఉంది..
ఈ క్రమంలో అండర్సన్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచంలో శక్తిమంతులు ఎవరూ ఉండరు.. ఎంతటి కాకలు తీరిన బ్యాట్స్‌మెన్ అయినా సరే ఏదో ఒక బౌలర్ చేతిలో... ఏదో ఒక బంతికి ఔటవ్వాల్సిందే. కోహ్లీ కూడా దీనికి మినహాయింపు కాదు. తమ గెలుపును అడ్డుకుంటున్న కోహ్లీ వికెట్ ఎలా దక్కించుకోవాలన్న దానిపై తాము కసరత్తు చేశామని.. అయితే టాయిలెండర్ల సాయంతో కోహ్లీ బ్యాటింగ్ చేస్తే మాత్రం అతనిని ఔట్ చేయడం కష్టమేనని అండర్సన్ అంగీకరించాడు.
మా ఫీల్డింగ్ ఏ మాత్రం బాలేదు.. గత రెండేళ్ల నుంచి తమ జట్టును ఈ సమస్య బాగా పీడిస్తోందని.. అదే కోహ్లీకి రెండు సార్లు జీవనదానాలను ఇచ్చిందని జేమ్స్ అన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్ నుంచి తమ ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సహచరులంతా వెనుదిరిగిన కరన్ ధాటిగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సాయపడ్డాడని అండర్సన్ ప్రశంసించాడు. 194 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత జట్టు 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 43 పరుగులతో, దీనేశ్ కార్తీక్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.