Relationship: భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మంచిది..?

Published : Jun 21, 2025, 03:57 PM IST
Couple

సారాంశం

హిందూ సంప్రదాయంలో పెళ్లి విషయంలో, వధూవరుల వయసు విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి. కచ్చితంగా అబ్బాయి.. అమ్మాయి కంటే వయసులో పెద్దవాడు అయ్యి ఉండాలని నమ్ముతారు.

ప్రేమ వయసు చూడదు.. ఈ మాట వినే ఉంటారు. చాలా మంది ఇదే ఫాలో అవుతారు. తమకు మనిషి నచ్చితే చాలు.. కులం, మతం, వయసు లాంటివి పట్టించుకోరు. ఒకరిపై మరొకరికి ప్రేమ, నమ్మకం ఉన్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటారు. కానీ.. పెళ్లికి ఇవన్నీ సెట్ అవ్వవు. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో వివాహం అనేది ఒక సామాజిక, మానసిక బంధంగా పరిగణిస్తారు.

హిందూ సంప్రదాయంలో పెళ్లి విషయంలో, వధూవరుల వయసు విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి. కచ్చితంగా అబ్బాయి.. అమ్మాయి కంటే వయసులో పెద్దవాడు అయ్యి ఉండాలని నమ్ముతారు. పొరపాటున అమ్మాయి వయసు పెద్ది అయితే..అదొక వింతలా చూస్తారు. ఎందుకు.. అబ్బాయి మాత్రమే వయసులో పెద్దవాడు అవ్వాలి? భార్య పెద్దది అవ్వకూడదా? అసలు.. నిజంగా భార్యభర్తల మధ్య సంబంధాన్ని వయసు అనేది ప్రభావితం చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు..? భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే.. వారి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. వయసు అనేది శరీరానికి కాదు, మనసుకు సంబంధించినది. ఒకరు వయసు పెద్దది అయినా.. వారి మనసు చిన్న పిల్లవారిలా ఉండొచ్చు. కానీ, కొందరు వయసు చిన్న వారు అయినా... వారి చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించవచ్చు. అందుకే, ఈ రోజుల్లో చాలా మంది వయసును పెద్దగా పట్టించుకోవడం లేదు. మనిషి వయసు కంటే.. మనుసుకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకే.. ఎవరు, ఏ వయసు వారినైనా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ, మనం ఈ భౌతిక , సామాజిక ప్రపంచాన్ని పరిశీలిస్తే, ఇక్కడ అనుభవాల ఆధారంగా, భర్త భార్య కంటే 5 నుండి 7 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. కనీసం ఐదు ఏళ్ల వయసు తేడా ఉంటే దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుందని నమ్ముతారు.

వివాహం అనేది రెండు మనసుల కలయిక మాత్రమే కాకుండా, రెండు జీవితాల మధ్య ఏర్పడే శాశ్వత బంధం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహం విజయవంతం కావాలంటే, ఇద్దరి మనసుల మధ్య సంబంధం ఉండాలి. ఒకరిని మరొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవం , నమ్మకం ఉన్నప్పుడు వారి బంధం బాగుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వయసు తో పని ఉండదు. మనసులు కలిసినప్పుడు, నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు, విభేదాలు పరిష్కరించగలుగుతారు, జీవితాన్ని కలిసి ముందుకు నడిపించగలుగుతారు.

వయసు కేవలం సంఖ్యే

వివాహ సంబంధంలో వయసు గురించి సాధారణంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది పెద్ద వయసు వ్యత్యాసాన్ని ఇష్టపడతారు, మరికొందరు సుమారు సమాన వయసు ఉన్నవారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ వాస్తవానికి, ఒక సంబంధంలో ఉన్న గౌరవం, అవగాహన, నమ్మకం, సహనం లాంటివే సంబంధాన్ని శాశ్వతంగా నిలిపే మూలాధారాలు. వయసు కేవలం ఒక సంఖ్యగా మిగిలిపోతుంది.

సైన్స్ ఏమి చెబుతుంది?

సైన్స్ ప్రకారం, మానవ శరీరంలో , మానసిక పరిణతిలో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా ఎదుగుతారు. శారీరకంగా బాలికలలో హార్మోన్ల మార్పులు సాధారణంగా 7 నుండి 13 ఏళ్ల మధ్య మొదలవుతాయి. అబ్బాయిలలో ఇది 9 నుండి 15 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఇది వారిలో భావోద్వేగ పరిపక్వత, బాధ్యతలు పెరగడం, జీవితాన్ని గంభీరంగా చూడగల నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దృష్టికోణంలో చూస్తే, అబ్బాయిలు కొద్దిగా ఎక్కువ వయస్సులో ఉన్నా, సంబంధాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతారు.

చాణక్య నీతి ఏం చెబుతుందంటే..

ప్రాచీన భారతీయ ఆచార్యుడు చాణక్యుడు తన నీతి గ్రంథంలో వివాహ సంబంధాల గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తల మధ్య 3 నుండి 5 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉండడం మంచిదని చెబుతారు. తక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే, ఇద్దరి మధ్యలో అవగాహన బాగా ఉంటుంది. వారు సమాన అభిరుచులు, ఆలోచనలు, జీవనశైలి కలిగి ఉంటారు. అయితే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే.. ఆలోచనల తేడా, జీవన దృక్కోణాల విభిన్నత కారణంగా విభేదాలు పెరగవచ్చు.

అవగాహన, గౌరవం ముఖ్యమైనవి

ఏ సంబంధమైనా పరస్పర గౌరవం , అవగాహన లేకపోతే సరిగా సాగదు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, మార్పులను అంగీకరించడంలో, కలిసి ఎదగాలనే భావన కలిగి ఉండడంలోనే బలమైన బంధం పుట్టుకొస్తుంది. నమ్మకం అనేది సంబంధానికి మూలస్తంభంలాంటిది. ఇది ఒకసారి ఏర్పడితే, వయసు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం వంటి విషయాలు రెండో స్థానానికి వెళ్తాయి.

వివాహానికి ముందే..

వివాహానికి ముందు కేవలం జాతకాలు లేదా కుటుంబ పరిస్థితులు మాత్రమే కాదు, వ్యక్తుల స్వభావం, అభిరుచులు, జీవితంపై వారి దృక్కోణం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే తత్వం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనసులు కలిసినప్పుడు, ఇద్దరూ జీవితం పట్ల ఒకే దృక్కోణంతో ముందుకు సాగగలుగుతారు.

సారాంశంగా చెప్పాలంటే, హృదయాలు కలిసినప్పుడు, మనసులు ఒకే దారిలో నడిచినప్పుడు, వయసు తేడా ఎంత ఉన్నా సంబంధం విజయవంతం కావచ్చు. కానీ, పరస్పర గౌరవం, అవగాహన, నమ్మకం లేకుండా, వయస్సు సమానం ఉన్నా కూడా సంబంధం నిలవకపోవచ్చు. అందుకే వయసుకంటే మనసును ఎక్కువగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

దిష్టి నిజమేనా? స్మృతి మంధాన, సమంత లైఫ్ ఇలా అవ్వడానికి దిష్టే కారణమా?
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి భార్య ఉన్న భర్త ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు!