
ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం ప్రేమ,గౌరవాన్ని వ్యక్తపరచడానికి ఒక అందమైన మార్గం. స్నేహితులు, తల్లిదండ్రులు, స్నేహితురాలు, భార్య, భర్త, సోదరుడు, సోదరి ఎవరికైనా సరే.. బహుమతులు ఇవ్వడం లేదా స్వీకరించడం అందరికీ ఆనందకరమైన అనుభవం. కానీ కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీ సంబంధానికి దురదృష్టం వస్తుందని నమ్ముతారు. మరి, ఎలాంటి వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదో తెలుసుకుందామా...
కత్తులు, కత్తెరలు లేదా ఇతర పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. ఇలాంటి బహుమతులు ఇవ్వడం వల్ల సంబంధంలో సమస్యలు వస్తాయి. కలిసి ఉండాలి అని ప్రేమతో ఇచ్చే బహుమతి.. ఇద్దరి మధ్య బేధాలు రావడానికి కారణం అవుతాయి. కాబట్టి, బహుమతులుగా అలాంటి వస్తువులను ఇవ్వడం మానుకోండి.
గడియారాలను బహుమతిగా ఇవ్వడం కాలం గడిచిపోవడాన్ని సూచిస్తుందని భావిస్తారు. చైనీస్ నమ్మకం ప్రకారం, గడియారం ఇవ్వడం సంబంధం ముగింపును సూచిస్తుంది. కాబట్టి, దీనిని దురదృష్టకర బహుమతిగా భావిస్తారు. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకునే వారికి మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి.
కొన్ని సంస్కృతులలో నలుపు ,తెలుపు రంగులు శోకం ,విడిపోవడాన్ని సూచిస్తాయి.ముఖ్యంగా జీవిత భాగస్వామి కి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ఈరంగులలో వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన కాదని నమ్ముతారు. బదులుగా, మీరు ఎరుపు ,గులాబీ వంటి రంగులను ఎంచుకోవచ్చు.
బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వడం అంటే ఆ వ్యక్తి మీ నుండి దూరంగా వెళ్లిపోతాడని అర్థం.కాబట్టి, పొరపాటున కూడా వీటిని బహుమతులుగా ఇవ్వకూడదు. దీనిని చెడు శకునంగా భావిస్తారు.
విరిగిన గాజు, నాణేలు లేదా దెబ్బతిన్న వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీ సంబంధంలో దురదృష్టం వస్తుంది. ఇది సంబంధంలో సమస్యలను తెస్తుందని నమ్ముతారు. కాబట్టి ఎల్లప్పుడూ కొత్త ,మంచి స్థితిలో ఉన్న వస్తువులను మాత్రమే బహుమతులుగా ఇవ్వండి.
మీరు ఇచ్చే బహుమతులు ఆనందాన్ని తీసుకురావాలి. కాబట్టి, దురదృష్టాన్ని తెచ్చే వస్తువుల కంటే మంచి ఉద్దేశాలను తెలియజేసే బహుమతులను ఎంచుకోవడం మంచిది. అదేవిధంగా, మీరు డబ్బుతో కొనుక్కునే బహుమతుల కంటే మీ స్వంత చేతులతో తయారుచేసే బహుమతులు విలువైనవని గుర్తుంచుకోండి.