Parenting tips: పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా మంచిదారిలో ఎలా పెట్టాలో తెలుసా?

Published : Jun 24, 2025, 04:28 PM IST
Parenting tips for emotionally strong kids

సారాంశం

చాలామంది పిల్లలు.. పేరెంట్స్  చెప్పిన మాట వినరు. ఎదురు తిరుగుతారు. ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. దీంతో పేరెంట్స్ కోపం ఆపుకోలేక వారిని కొట్టడం, తిట్టడం చేస్తుంటారు. అయితే ఇవి రెండూ చేయకుండా వారిని మంచి మార్గంలో పెట్టవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.  

ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. కొందరు పేరెంట్స్ మాట వింటారు. చక్కగా నడుచుకుంటారు. మరికొందరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. బాగా అల్లరి చేస్తుంటారు. పేరెంట్స్ కి ఎదురు తిరుగుతుంటారు. దీంతో పేరెంట్స్ వారిని కొట్టడం, తిట్టడం.. వారిపై కేకలు వేయడం చేస్తుంటారు.

కానీ పిల్లలకి ఏ విషయాలు ఎలా చెప్తున్నామన్నది చాలా ముఖ్యం. కొడితే, కేకలు వేస్తే పిల్లలు మాట వింటారని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అది తప్పు. అలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. భయం పెరుగుతుంది. 

కొట్టడం, కేకలు వేయడం పిల్లల మీద ప్రేమ అని చాలామంది అనుకుంటారు. వారిని దారిలో పెట్టడానికి అదే సరైన మార్గం అనుకుంటారు. చాలా తరాలుగా ఇది పాటిస్తున్నారు కూడా. కానీ కొట్టకుండా, తిట్టకుండా.. పిల్లల మీద అధికారం చూపకుండా వారిని ఎలా మంచి మార్గంలో పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

పిల్లల్ని మంచి మార్గంలో పెట్టే చిట్కాలు

పెద్ద పెద్ద మాటల కంటే చిన్న మౌనం పిల్లల్ని కదిలిస్తుంది. కొట్టకుండా, కేకలు వేయకుండా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలంటే కోపంలో మీరు కాస్త మౌనంగా ఉండండి. ఓపికగా పరిస్థితిని చక్కదిద్దడం అలవాటు చేసుకోండి. ఎక్కువ కోపంలో.. వాళ్లపై కేకలు వేయకుండా మౌనంగా ఉంటే పిల్లలు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటారు.

పిల్లల్ని మోకాళ్ల మీద కూర్చోబెట్టి శిక్షించడం కంటే.. తల్లిదండ్రులు పిల్లల కళ్లలోకి చూసి మాట్లాడేలా కాస్త వంగి, మోకాళ్ల మీద కూర్చొని మాట్లాడితే విషయాలు మారుతాయి. మీరు నిటారుగా నిలబడి మాట్లాడితే పిల్లలకి భయం కలుగుతుంది. కోపంగా ఉన్న పెద్దవాళ్లు తమ ముందు మాట్లాడితే పిల్లలు భయపడతారు. దాని బదులు మీరు దగ్గరగా కూర్చుని లేదా వాళ్ల ముందు మోకాళ్ల మీద కూర్చొని మాట్లాడితే మీతో హాయిగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడతారు.

మీరు చెప్పే చాలా విషయాలు పిల్లలు వినకుండా ఎదురు మాట్లాడటం.. వాళ్ల చిన్నతనం వల్లే. వాళ్లు చెప్పేది మీరు వినలేదనో లేదా వాళ్లు సురక్షితంగా లేరనో మీకు ఎదురుతిరుగుతారు. మీరు పిల్లలను తిట్టినప్పుడు వాళ్ల మానసిక స్థితి దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి వాళ్లతో అలా మాట్లాడండి. పెద్దగా కేకలు వేయద్దు. ఉద్రిక్త పరిస్థితుల్లో గుసగుసలాడటం, కేకలు వేయడం కంటే ఎక్కువ శ్రద్ధను ఆకర్షిస్తుంది. ఇది పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మృదువైన స్వరం వాళ్ల మనసును తాకుతుంది.

నువ్వెందుకు అలా చేశావు, నువ్వేం చేశావో చూడు.. అని పిల్లలతో మాట్లాడకండి. వాళ్ల మీద నింద వేయడం తల్లిదండ్రుల లక్ష్యం కాకూడదు. పిల్లలు సమస్యను గ్రహించేలా చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. పదే పదే పిల్లల్ని తప్పు చేశావ్, నువ్వు ఇలా ఉన్నావ్ అని నిందిస్తే వాళ్ల నమ్మకం, భద్రతా భావం కోల్పోతారు. 

అంతేకాదు వాళ్ల వ్యక్తిగత విషయాలు మీతో పంచుకోవడానికి సంకోచిస్తారు. కాబట్టి పిల్లలు చేసిన తప్పును ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. అలా చేయడం ద్వారా వారు అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!