ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలుగు సినీ పరిశ్రమపై ఉక్కుపాదం మోపడానికే సిద్ధపడ్డారు. అందుకు రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయి. ఒక రకంగా వైఎస్ జగన్ సినీ పరిశ్రమపై పగ తీర్చుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉక్కుపాదం మోపడానికే నిశ్చయించుకున్నారు. సినీ పరిశ్రమపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది చావు దెబ్బ తినేందుకు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాజకీయంగా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తనకు వ్యతిరేకంగా ఉండడమే అందుకు కారణమని భావించడానికి వీలవుతోంది. సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలేవీ ఒకటి రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానానికి ఆయన కళ్లెం వేసినట్లు కనిపిస్తున్నారు.
బెనిఫిట్ షోలకు కూడా YS Jagan ప్రభుత్వం కళ్లెం వేసింది. కేవలం నాలుగు షోలను మాత్రమే అనుమతిస్తోంది. దానికి తోడు, సినిమా టికెట్ల ధరల విషయంలో స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు వేర్వేరు ధరలు నిర్ణయించింది. ఆ ధరలతో సినిమాలను ఆడించలేమని నిర్మాతలు, సినీ ప్రముఖులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ జగన్ చలించడం లేదు. నాగార్జున జగన్ తో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి నెయ్యం కోరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సినిమా ధరల విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. దిల్ రాజు వంటి కొందరు నిర్మాతలు మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు.
undefined
ధరల నియంత్రిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం 35వ నెంబర్ జీవోను జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ దాదాపు 250 మంది హైకోర్టును ఆశ్రయించారు. జీవోను రద్దు చేస్తూ టికెట్ల ధరలను నిర్ణయించుకోవడానికి ఎగ్జిబిటర్లకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో సినీ పరిశ్రమకు ఊరట లభించిందని భావించారు. కానీ జగన్ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసి సినీ పరిశ్రమ మనుగడకే ఎసరు పెట్టింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. అది విచారణలో ఉంది. విచారణ వచ్చే 4వ తేదీకి వాయిదా పడింది.
ప్రభుత్వం దాంతో మిన్నకుండలేదు. రాష్ట్రంలోని థియేటర్లను టార్గెట్ చేసింది. అధికారులు రాష్ట్రంలోని థియేటర్లను తనిఖీ చేస్తూ నిబంధలను పాటించనివాటిని సీజ్ చేస్తూ వస్తున్నారు. దీంతో యజమానులు థియేటర్లను స్వచ్ఛందంగా మూసేసుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమాలు ప్రదర్శించే పరిస్థితి రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బ తింటూ వస్తోంది. ఈ స్థితిలో బాలకృష్ణ అఖండ విడుదలైంది. టికెట్ థరలపై స్పందిస్తూ తాము అన్నింటికీ సిద్ధపడే సినిమాను విడుదల చేశామని Balalrishna అన్నారు. మరోవైపు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఎఫ్ 3 వంటి సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. బెనిఫిట్ షోల ద్వారా, టికెట్ల ధరలు పెంచుకోవడం ద్వారా లాభాలను ఆర్జించాలనే సినీ పెద్దల ఆలోచనకు ఆంధ్రప్రదేశ్ లో దెబ్బ పడినట్లే.
నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా క్రేజ్ ఎక్కువ. ఎంత వరకు నిజమో గానీ ఈ సినిమా క్రేజ్ గురించి సరదా ఓ మాట చెబుతూ ఉంటారు. ఓసారి ఓ మంత్రిగారు ఓ గ్రామాన్ని సందర్శించి, మీ సమస్యలేమిటని ప్రజలను అడిగారట. దానికి గ్రామ ప్రజలు మా ఊళ్లో సినిమా థియేటర్ కావాలని అడిగారట. ఏపీలో సినిమాపై ఉన్న క్రేజ్ కు అది అద్దం పడుతుంది. దీన్ని సినిమాలు ఎక్కువగా ఆర్జించేది తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినిమాల ఆదాయానికి పెద్ద యెత్తున గండి పడుతుందనేది అర్థమవుతోంది. ఆ అదాయానికి గండి కొట్టడమే కాకుండా సినిమా నిర్మాణం మీదనే జగన్ ప్రభుత్వ నిర్ణయం, చర్యలు తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
దాన్ని బట్టి సినీ పరిశ్రమపై ప్రతీకారం తీర్చుకునే దిశగా లేదా పగ తీర్చుకునే దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించవచ్చు. జనసేన అధినేత Pawan Kalyan రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించడం జగన్ చర్యకు తక్షణ కారణంగా కానిపిస్తోంది. అయితే, జగన్ మొత్తం సినీ పరిశ్రమ పెద్దలను లక్ష్యం చేసుకున్నారని అనుకోవచ్చు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదు కేంద్రంగా విస్తరిస్తోంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివెళ్లే అవకాశాలు లేవు. అయితే, చాలా మంది పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోసాని కృష్ణమురళి, పృథ్వీ, నట్టి కుమార్ వంటి ద్వితీయ శ్రేణి పెద్దలు మాత్రమే జగన్ కు మద్దతుగా నిలిచారు. కమెడియన్ అలీ కూడా జగన్ కు మద్దతు తెలిపారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వేలు పెడుతున్నారు. చాలా మంది పెద్దలు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అంటే సినీ రంగాన్ని శాసించే పెద్దల్లో అత్యధికులు TDPకి మద్దతుదారులే. జగన్ చర్యలకు ఇది కూడా ఓ కారణం.
అంతేకాకుండా, గతంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పుడు పలువురు సినీ ప్రముఖులు Chandrababuను కలిసి అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ విజయం సాధించినప్పుడు కూడా పలువురు సినీ ప్రముఖులు కేసీఆర్ ను కలిసి అభినందించారు. కానీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ 151 శాసనసభ స్థానాలను, 22 లోకసభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ సినీ పెద్దలు జగన్ ను కలిసి అభినందించిన పాపాన పోలేదు. దీంతో సినీ పరిశ్రమ జగన్ విజయాన్ని గుర్తించడానికి నిరాకరించిందా అనే అనుమానాలు తలెత్తాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్ ను కలిశారు. నాగార్జున జగన్ కు సన్నిహితులే. అంత మాత్రాన సినీ పరిశ్రమను సహించాలని, దాని మనుగడను యధాస్థితిలో కొనసాగించాడనికి జగన్ అనుకోవడం లేదని భావించవచ్చు. దీంతో సినీ పరిశ్రమను కూకటివేళ్లతో ఏపీలో కూల్చేయడానికి జగన్ సిద్ధపడ్డారని అనుకోవచ్చు.
నిజానికి, తెలుగు సినీ పరిశ్రమ పెద్ద హీరోల చుట్టూ, పెద్ద నిర్మాతల చుట్టూ తిరుగుతోంది. హీరోల రెమ్యునరేషన్ సినిమా నిర్మాణ వ్యయంలో సగం ఉంటుందనే అంచనాలున్నాయి. వారిలో చాలా మంది జగన్ కు పూర్తిగా వ్యతిరేకులు కాకపోయినా టీడీపీకి మద్దతుదారులనే విషయం తెలిసిందే. వారిని దెబ్బ తీయడం ద్వారా టీడీపీ రాజకీయాలను కొంత మేరకు దెబ్బ తీయవచ్చునని జగన్ అనుకుని ఉంటారనే విషయంలో సందేహం లేదు.
ఇదిలావుంటే, సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్ మీద, మంత్రుల మీద, వైఎస్సార్ కాంగ్రెసు నాయకుల మీద చేసిన వ్యాఖ్యలను, ఆ వ్యాఖ్యలను ఖండించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడాన్ని జగన్ తీవ్రంగా పరిగణించారనే చెప్పవచ్చు. Chiranjeevi వంటి కొద్ది మంది మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించారు తప్ప ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టలేదు. రాజకీయంగా తనను వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ ను తప్పు పట్టడానికి ముందుకు రాని సినీ ప్రముఖుల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పైగా దాన్ని దెబ్బ తీస్తేనే తనకు మేలు జరుగుతుందని జగన్ అనుకుంటారని చెప్పవచ్చు.
తెలుగు సినిమాల వల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం కూడా పెద్దగా ఏమీ లేదు. వినోదాన్ని పంచడమనే ఏకైక కారణంతో అవి మనుగడ సాగిస్తున్నాయి. తమిళంలో లాగా, మలయాళంలో లాగా పెద్ద హీరోలు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా లేరు. వారి హిరోయిజాన్ని ఆకాశానికెత్తే సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ప్రజల తరఫున నిలబడే పాత్రలను చేయడానికి వారు ఇష్టపడడం లేదు. అందువల్ల వాటిని సహించాల్సిన అవసరం కూడా లేదని జగన్ భావించారని చెప్పలేం గానీ మొత్తంగా సినిమాలను అడ్డుకుంటే సాధారణ ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి లేదు. హీరోల అభిమానులు మాత్రమే గొడవకు దిగారు. హీరోల అభిమానులు ఒక రకంగా సమస్యగా తయారయ్యారు. జగన్ అనుకున్నా అనుకోకపోయిన అభిమానుల వెర్రికి ముకుతాడు వేయడానికి జగన్ నిర్ణయం తోడ్పడుతుంది. మొత్తంగా జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలుగు సినీ పరిశ్రమ భారీ కుదుపునకు గురైంది. భవిష్యత్తులో దాని మనుగడ కూడా ప్రశ్నార్థకం కావచ్చు. జగన్ కోరుకున్నది కూడా ఇదేనని చెప్పవచ్చు.