సరళాసాగర్ ప్రాజెక్టు: ఆసియా ఖండంలోనే మొదటి హూడ్ సైఫన్ స్పీల్ వే డ్యాం

By Siva Kodati  |  First Published Sep 16, 2020, 9:56 PM IST

సంస్థానాదీశుల కాలంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు ఒక ప్రత్యేకత ఉంది


సంస్థానాదీశుల కాలంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు ఒక ప్రత్యేకత ఉంది.

వనపర్తి సంస్థానాదీశులైన రామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరుమీద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1947 లోనే సంకల్పం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంజినీర్ పీ ఎస్ రామకృష్ణరాజు ఆటోమేటిక్ హూడ్ సైఫన్ స్పిల్ వే (Hood Siphon Spillway) గురించి రామేశ్వర్‌రావుకు వివరించారు.

Latest Videos

undefined

ఈ పద్ధతిలో ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని సూచించారు. రామకృష్ణ రాజు వివరణతో సంతృప్తి చెందిన రామేశ్వర రావు వెంటనే పనులు ప్రారంభించాలని, ప్రాజెక్టు కింద 10 గ్రామాలకు ప్రయోజనం కలిగేలా కాలువలను నిర్మించాలని ఆయన సూచించినారు.

 

 

సైఫన్ స్పిల్ వే తో కూడిన డ్యాంను డిజైన్ చేసినారు రామకృష్ణ రాజు. సైఫన్ కట్టడాలను డిజైన్ చేయడంలో ఆయన నిష్ణాతుడు. వనపర్తి సంస్థానాధీశుడు రామేశ్వర్‌రావు ఆదేశాల మేరకు రూ.35 లక్షల వ్య యంతో, పది గ్రామాల్లో విస్తరించి ఉన్న 4,158 ఎకరాల ఆయకట్టుకు నీరు పారేలా ప్రాజెక్టు కాలువలను డిజైన్ చేసినారు ఇంజనీర్లు.

15, సెప్టెంబర్ 1949 రోజున హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్ గా వ్యవహరిస్తున్న జనరల్ జె ఎన్ చౌదరి సరళా సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంఖు స్థాపన చేసినట్టుగా డ్యాం మీద స్థాపించిన శిలాఫలకం ద్వారా తెలుస్తున్నది. 1949 లో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు 1959 లో పూర్తి చేశారు.

డ్యాం వద్ద ఉన్న సమాచారం ప్రకారం పి ఎస్ రామకృష్ణ రాజుగారు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తున్నది. ఆయన 1947 నుంచి 1956 వరకు అసిస్టెంట్ ఇంజనీరుగా, 1956 నుంచి 58 వరకు ఎగ్సీగ్యూటివ్ ఇంజనీరుగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించినారు.

మెకానికల్ ఇంజనీరింగ్ లో బి ఇ చదివిన తరవాత రాజా రామేశ్వర రావు అందించిన ఆర్థిక సహకారంతో అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ చదివినారు. అక్కడే సైఫన్ కట్టడాలను ఆయన అధ్యయనం చేసి, వాటిని డిజైన్ చేయడంలో మంచి అనుభవం గడించినాడు.

ఆ అనుభవంతోనే ఆయన సరళా సాగర్ డ్యాం ను సైఫన్ స్పీల్ వే తో డిజైన్ చేయడానికి సాహాసం చేసినాడు. చేయడమే కాదు వాటి నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించినాడు. అవి గత 60 ఏండ్లుగా ఎటువంటి సమస్యలు లేకుండా అద్భుతంగా పని చేస్తున్నాయి. 

సరళా సాగర్ డ్యాం వివరాలు :

 డ్యాం మట్టి కట్ట పొడవు : 3537 అడుగులు (1078 మీటర్లు)
 సైఫన్ స్పిల్ వే పొడవు : 391 అడుగులు (119 మీటర్లు)
 గ్రావిటి డ్యాం పొడవు : 520 అడుగులు (158 మీటర్లు)
 మొత్తం డ్యాం పొడవు : 4448 అడుగులు (1355 మీటర్లు)
 కట్ట గరిష్ట ఎత్తు : 45 అడుగులు
 గరిష్ట నీటి మట్టం (FRL) : 1090 అడుగులు
 నీటి నిల్వ సామర్థ్యం : 0.55 టి‌ఎం‌సి లు
 జలాశయం విస్తీర్ణం : 771 ఎకరాలు (2 చ.మైళ్లు )
సైఫన్ స్పిల్ వే వివరాలు :
 ప్రైమింగ్ సైఫన్ లు (Priming Siphon) : 4
 హూడ్ సైఫన్ లు (Hood Siphon) : 17
 సైఫన్ డిశ్చార్జ్ సామర్థ్యం : 60,500 క్యూసెక్కులు

కాలువల వివరాలు :
i) ఎడమ కాలువ :

 కాలువ ప్రవాహ సామర్థ్యం : 82 క్యూసెక్కులు
 కాలువ వెడల్పు : 2.74 మీటర్లు
 కాలువ పొడవు : 16 కి మీ
 కాలువ కింద ఆయకట్టు : 3770 ఎకరాలు
 ప్రయోజన పొందే గ్రామాలు : 8

ii) కుడి కాలువ :

 కాలువ ప్రవాహ సామర్థ్యం : 6.90 క్యూసెక్కులు
 కాలువ వెడల్పు : 0.90 మీటర్లు
 కాలువ పొడవు : 4.50 కి మీ
 కాలువ కింద ఆయకట్టు : 388 ఎకరాలు
 ప్రయోజన పొందే గ్రామాలు : 2

ఈ రెండు కాలువల ద్వారా విడుదలైన నీరు ప్రాజెక్టు కింద ఉన్న శంకరమ్మపేట, దంతనూరు, మదనాపురం, నెల్విడి, నర్సింగాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడ్, అజ్జకొల్లు, చర్లపల్లి, వడ్డెవాట గ్రామాలలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది.

సరళా సాగర్ డ్యాం పరీవాహక ప్రాంతం నుంచి నీరు రాకపోయినా కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఘన్ పూర్ బ్రాంచ్ కాలువ ద్వారా సరళా సాగర్ నీటి సరఫరాకు ఏర్పాటు జరిగింది. కాబట్టి సరళా సాగర్ కింద ఉన్న 4158 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు నికరంగా సాగునీరు అందుతుంది. 

ఆసియా ఖండంలో మొదటి హూడ్ సైఫన్ స్పీల్ వే : ఆటోమెటిక్ హూడ్ సైఫన్ సిస్టంతో రూపుదిద్దుకున్న సరళాసాగర్ ప్రాజెక్టు ఆనాటికి ఆసియా ఖండంలోనే మొట్ట మొదటిది, ప్రపంచంలో రెండోది ప్రాజెక్టుగా పేరుగాంచింది.

జలాశయం సామర్థ్యానికి మించి ప్రాజెక్టులోకి నీరు చేరితే ఆటోమెటిక్ సైఫన్ స్పిల్ వే ద్వారా నీరు నదిలోకి విడుదలవుతుంది. సరళాసాగర్ కంటే ముందే మైసూరు సంస్థానంలో కూడా రెండు సైఫన్ స్పిల్వేలు ఉన్న డ్యాంలను సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపకల్పన చేసినాడు.

ఒకటి మార్కొనహళ్లి డ్యాం. దీన్ని కర్ణాటక రాష్ట్రంలో తుమ్కూరు జిల్లా కునిగల్ తాలూకాలో శింషా నదిపై నిర్మించారు. రెండోది కాణ్వా డ్యాం. దీన్ని రామనగర్ జిల్లా చన్నపట్నం తాలూకాలో కాణ్వా నదిపై 1946 లో పూర్తి చేశారు.

మైసూరు సంస్థానాన్ని పాలిస్తున్న కృష్ణరాజ వొడెయార్ సంకల్పంతో ప్రముఖ ఇంజనీర్, భారత రత్నమోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ డ్యాంలను రూపకల్పన చేసి 1938-46 కాలంలో నిర్మింపజేశాడు.

 

 

అయితే ఇవి హూడ్ తరహా సైఫన్ స్పీల్ వే ఉన్న డ్యాంలు కావు. ఆ రకంగా చూసినప్పుడు హూడ్ తరహా సైఫన్ స్పీల్ వే కలిగిన డ్యాం భారత దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే సరళా సాగర్ డ్యాం మొదటిది అని చెప్పవచ్చు.

ఏదైనా డ్యాం లోకి గరిష్ట పరిమాణం కంటే ఎక్కువ వరద నీరు వస్తున్నప్పుడు ఆ నీటిని డ్యాం కింద నదిలోకి సురక్షితంగా పంపించే ఏర్పాటును స్పిల్ వే అంటారు. చెరువుల్లో అయితే మత్తడి అంటారు.

చిన్న డ్యాముల్లో అయితే గేట్లు లేకుండానే డిజైన్ చేస్తారు. ఉదాహరణకు పోచారం, డిండి .. ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద డ్యాం లకు స్పిల్ వే గేట్లు ఉంటాయి. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం, నిజాంసాగర్ .. వీటిని gated spill ways అంటారు.

ఇక్కడ తప్పని సరిగా operator అవసరం అవుతారు. స్పిల్ వే డిజైన్ చేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, వరద పరిమాణం తదితర ఇంజనీరింగ్ అంశాలను పరిశీలిస్తారు. Gated spill ways అత్యంత సాధారణంగా డిజైన్స్ చేస్తారు.

అవి మన కంట్రోల్ లో ఉంటాయి. సరళా సాగర్ వంటి హూడ్ సైఫన్ స్పిల్ వే (Hood Siphon Spillways) ను అతి అరుదుగా ఎంచుకుంటారు. ఎందుకంటే అవి మన కంట్రోల్ ఉండవు. భౌతిక సూత్రాలను అనుసరించి అవి పని చేస్తాయి. రిస్క్ ఉంటుంది. అవి పని చేస్తాయో లేదా అనే ఒక అనుమానం ఎప్పుడు ఉంటుంది.

 

 

అందుకే ప్రపంచంలో సైఫన్ స్పిల్ వే ఉన్న డ్యాం లు కొన్నే ఉన్నాయి. మన దేశంలో కర్ణాటకలో రెండు సైఫన్ స్పిల్ వే డ్యాం ల గురించి పైన వివరించాను. ఇతర దేశాల్లో చూస్తే.. అల్జీరియాలో, అమెరికాలో, దక్షిణ కొరియాలో సైఫన్ స్పిల్ వే డ్యాం లు ఉన్నట్టు తెలుస్తున్నది.

ప్రపంచ వ్యాప్తంగా ఇవి చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. వీటిలో ఇమిడి ఉండే అంతర్గత సమస్యల కారణంగా డ్యాంలను డిజైన్ చేసే ఇంజనీర్లు సైఫన్ స్పిల్ వే ను ఏర్పాటు చేయడానికి ఇష్టపడరు. అయితే కాలువల మీద సైఫన్ సొరంగ కట్టడాలు మాత్రం వందల సంఖ్యలో ఉన్నాయి.

అటువంటిదే కాకతీయ కాలువపై కోరుట్ల వద్ద ఉన్నది. సరళా సాగర్ డ్యాం ను డిజైన్ చేసిన ఇంజనీర్ పి ఎస్ రామకృష్ణ రాజు సైఫన్ కట్టడాలు డిజైన్ చేయడంలో నిష్ణాతుడు. కాబట్టే ఆయన సరళా సాగర్ లో హూడ్ సైఫన్ స్పీల్ వే ఏర్పాటుకు సాహాసించాడు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువను కోరుట్ల వాగును దాటించడానికి కూడా ఆయన సైఫన్ సొరంగాన్ని డిజైన్ చేశాడు. కాకతీయ కాలువ నాగులపేట గ్రామం దగ్గర కోరుట్ల వాగు వద్దకు రాగానే కాకతీయ కాలువ వాగు కిందకు మాయం అవుతుంది.

కాలువ పైన వాగు ప్రవహిస్తూ ఉంటుంది. 500 మీ అనంతరం కాలువ తిరిగి బయట పడుతుంది. ఇది కూడా చూడ ముచ్చటగా ఉంటుంది. ఆ కట్టడాన్ని రామకృష్ణ రాజుకు అంకితం చేశారు. అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.

ఆటోమేటిక్ సైఫన్ స్పిల్ వే ఎట్లా పని చేస్తుంది?
నీటిసామర్థ్యం గరిష్టస్థాయికి చేరినప్పుడు నీళ్ళు వాటంతట అవే సైఫోనిక్ ఏక్షన్ ద్వారా డ్యాం కింద నదిలోకి ప్రవహించడం దీని ప్రత్యేకత. సైఫన్లు తెరవడానికి, మూయడానికి ఆపరేటర్లు అవసరం లేదు. డ్యాంలో నిర్ధారిత మట్టానికి నీరు చేరుకోగానే సైఫన్ సొరంగంలో air sucking ప్రక్రియ మొదలవుతుంది.

దానితో ఆ సొరంగం నుండి నీరు కిందకి ప్రవహిస్తుంది. మన నిత్య జీవితానుభవంలో ఉన్న ఒక చిన్న ఉదాహరణ ద్వారా సైఫన్ పని విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. నిండుగా ఉన్న డ్రం లో ఒక పైపును వేసి మరొక చివరి నుంచి గాలి పీల్చడం ద్వారా సైఫోనిక్ ఏక్షన్ ప్రారంభం అయి నీరు డ్రం లో నుంచి కిందకి ప్రవహిస్తుంది.

ఇక్కడ air sucking ను మనం ప్రేరేపించాము. Priming చేశామన్నమాట. సైఫన్ స్పిల్ వే లో ఆటోమాటిక్ గా air sucking ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దాన్ని self priming అంటారు. 

 

 

సైఫన్ స్పీల్ వే లను ఆటోమాటిక్ ఫాలింగ్ షట్టర్స్ (Automatic Falling Shutters) తో పోల్చలేము. ఆటోమాటిక్ ఫాలింగ్ షట్టర్స్ లో నిర్ధారిత మట్టానికి నీరు చేరగానే షట్టర్లు కిందకు పడిపోతాయి. నీరు డ్యాం కిందకు ప్రవహిస్తుంది. నీటి మట్టం దిగిపోగానే షట్టర్లు పైకి లేస్తాయి.

ఇవి మెకానికల్ షట్టర్స్. ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. పాలేరు జలాశయంలో ఇటువంటి ఫాలింగ్ షట్టర్లు బాగా పని చేస్తున్నాయి. వీటిని రెగ్యులర్ గా నిర్వహణ లేకపోతే ఇవి తెరుచుకోవు.

11 ఏండ్ల తర్వాత ఈ ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు సరళాసాగర్ జలాశయం నిండి సైఫన్ స్పిల్వే నుండి నీరు కిందకు ప్రవహిస్తున్న అద్భుత దృశ్యం సందర్శకులకు కనువిందు చేసింది. సరళా సాగర్ ప్రత్యేకత ప్రపంచానికి తెలిసి వచ్చింది.

- శ్రీధర్ రావు దేశ్‌పాండే

click me!