ఆధునిక రాజ్యంలో వికేంద్రీకరణ- వొక ప్రాకృతిక పరిణామం

By Siva KodatiFirst Published Feb 1, 2020, 5:59 PM IST
Highlights

ఆధునిక రాజ్యాల భావనలో అతి ప్రాముఖ్యమైనది మ్యాప్ లో మనం గీసుకునే ‘వర్చువల్’ రాజకీయ విభజన రేఖ. ఒక ప్రాంతానికి ఉండే గుర్తింపు దాని ‘మ్యాప్’ లోనూ, అందులో గుర్తించబడిన దాని రాజధాని నగరం, వీటిని బట్టి మన ఉనికిని ఇతరులు గుర్తిస్తారు గౌరవిస్తారు.  

- జాన్‌సన్ చోరగుడి

ప్రతి కాలంలోనూ చరిత్ర ప్రజలు – ప్రాంతము ఈ రెండింటి చుట్టూనే తిరగడం అన్ని ఇతిహాసాల్లోనూ మనకు కనిపిస్తుంది. చరిత్ర రచనలో ఈ రెండింటికీ విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రెండింటి కేంద్రంగా అపారమైన ఘర్షణ మనం చూస్తాం. అయినప్పటికీ, రెండు జాతుల మధ్య ఘర్షణ ఎప్పుడూ కొత్త మైదానాల మీదికి మానవాళి విస్తరణకు, అలా ఆ ప్రాంతాల ‘వోపెనింగ్’ కు అవి కారణమయ్యేవి. కొత్త ప్రాంతము అనేసరికి, అక్కడ కొత్త వనరులు ఉంటాయి వాటి వల్ల కొత్త అవకాశాలు దొరుకుతాయి. దాంతో అప్పటివరకు అటువంటివి అందని జాతులకు కూడా సరికొత్త మార్గాలు ద్వారాలు తెరుచుకుంటాయి. అందువల్ల ఇన్నాళ్ళు వారికవి లేకున్నా ఇకముందు దొరుకుతాయి.

మనిషి - తాను జీవిస్తున్న ప్రాంతంలో కాలక్రమంలో జరిగే ఇటువంటి విస్తరణ సంబంధిత మార్పులు కారణంగా, ప్రతిసారీ ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు. ఇవి చాలవు ఇప్పుడు ఉన్నవాటికంటే ఇంకా మెరుగైన ప్రయోజనాలు పొందాలి, అనుకున్నప్పుడు తానే అటువంటి అవకాశాలు ఉన్న సుదూర తీరాలకు వాటిని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. స్థూలంగా చూస్తున్నప్పుడు ‘మొబిలిటి’ (కదలిక) ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం. మనం మన ఊళ్ళోనే ఉంటున్నప్పుడు కొత్తగా ఏమిటి ఈ ‘కదలిక’? జవాబు – ‘పవర్’. మన పంచాయతీ కొత్తగా ‘నగర పాలిక’ అవుతుంది. మన మున్సిపాలిటీ కొత్తగా రాబోతున్న ఏదో ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ పరిధిలో ఉంటుంది. వాటికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అవి మనకు కూడా అందుతాయి. ఇదీ – ‘కదలిక’!

 

(యుద్దంలో  గెలిచిన కనాను రాజ్యాన్ని జాషువా 12 యూదా తెగలకు పంపిణీ చేసిన మ్యాప్ )

విస్తరణలో భాగంగా ‘రాజ్యం’ తరలి వచ్చినప్పుడు, జరిగేది ఏమిటి? ‘రాజ్యం’ అంటే అధికారం. కాలక్రమంలో జరిగే రాజకీయ పరిణామాల్లో ‘అధికారం’ కొత్త ప్రాంతాలకు వస్తే, అప్పుడు అది కొత్త సరిహద్దులకు విస్తరించి, మనిషి ప్రయోజనం పొందుతాడు. దీనికి దోహదం చేసేది, స్తబ్ధస్తితి లేదా యధాతధ స్థితి నుంచి చలన స్థితిలోనికి ప్రయాణం. నడక – పరుగు తర్వాత, రెండు చక్రాల ‘బైస్కిల్’తో తన కదలిక పరుగు కంటే వేగం అవుతుంది అనే అవగాహన మొదటి దశ. దానికి చిన్న మోటార్ బిగిస్తే... అనే ఆలోచన రావడం ఆ తర్వాత దశ! ఈ చూపు ఎప్పుడూ ముందుకే కదలడం, వేగం పెరగడం మానవ చరిత్ర చెబుతున్న పాఠం.

మన కుటుంబాల విస్తరణ కూడా ఇదే తీరు. పుట్టిన మనిషితో పాటుగా కాలక్రమమంలో వచ్చి చేరే ‘లగేజ్’ మనతో చాలా ఉంటుంది. అందులో ప్రధానమైంది – సంపద. విస్తరణ దాని సహజ లక్షణం. ఇందుకు ఉదాహరణ కోసం మనకు అంబానీలు అక్కరలేదు, వొక గొర్రెల కాపరి చాలు! పెరుగుతున్న మందల్ని అతడు తన కుటుంబానికి పంచుతూ, వాటిని కొత్త మైదానాలవైపు తరలిస్తాడు. బైబిల్ ఆదికాండంలో జెహోవా ఆదేశాలమేరకు అబ్రహాం ఈజిప్ట్ నుంచి బయటకు బయలుదేరతాడు. అన్న కుటుంబ యజమాని కనుక, అన్నను తమ్ముడు లాట్ (లోతు) కుటుంబం కూడా అనుసరించింది. అయితే, ఆ.కా.13.6 లో ఇలా ఉంటుంది - ‘వారు కలిసి జీవించుటకు ఆ ప్రదేశం చాలక పోయెను, ఎందుకనగా వారి ఆస్థి, వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను’. ఈ వాక్యం చదివాక, ఆ తర్వాత జరిగింది ఏమిటో మనకు అర్ధమైపోతుంది. ఆ స్థితి వచ్చేసరికి వారికి ఎదురైన సంకట పరిస్థితికి వారు వొక కొత్త పరిష్కారం వెతుక్కోక తప్పలేదు! ఈజిప్ట్ నుండి వాళ్ళు తమతమ అస్తులతోనే బయలుదేరి వచ్చారు. కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు వారు కలిసి జీవించడానికి ఆప్రదేశం చాలకపోతే, జరిగేది కూడా మునుపు జరిగిందే. ‘మొబిలిటీ’ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ స్థలాన్ని ఖాళీచేసి మరొకరికి దాన్ని విడిచిపెట్టి అక్కణ్ణించి వేరొక ప్రాంతానికి వెళ్ళాలి.
అయితే, ఆస్థి ఎటూ మనతోనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ‘కదలిక’ వల్ల కొత్తగా మన ఆస్తితో పాటుగా జతకలుస్తున్నది ఏమిటి? అది - భూమి. లేదా సరికొత్త మైదానం. 

మానవాళి సంపద పరిణామం చరిత్రలో భూమిని స్వాధీనపరచుకోవడం అనేది కొత్త ‘ఎడిషన్’. మనం స్థలం మారాలి అనుకున్నప్పుడు మనతో తీసుకునివెళ్ళ గలిగిన ఆస్థి కంటే, భూమి పూర్తిగా భిన్నమైనది. నిజమే ఇది మనతో కూడా తీసుకుని వెళ్ళడం కుదరదు. అయినప్పటికీ కాలక్రమంలో అప్పటివరకు ఉన్న పశుగణం, వెండి బంగారం, విలువైన వస్త్రాలు, దాసదాసీలు వీటితోపాటు అంతే విలువైన ఆస్థిగా మనిషికి భూమి మారడం మొదలయింది. దాంతో ఎంత విస్తీర్ణమైన భూమి మన స్వాధీనంలో ఉంది? అనేది ఆస్థికి ఒక ప్రమాణం అయింది. అంతే, భూమి మీద కన్నేసిన మనిషి సంచార జీవనం దశ నుంచి స్థిరజీవనానికి వచ్చాడు. భూసంభందిత ప్రాకృతిక వనరుల్ని స్వాదీనపర్చుకోవడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో భూమి సంపదకు అస్సలు సిసలు కొలమానం అయింది. 

 

(కేంద్రీకరణ- వికేంద్రీకరణ)

భూమి అనగానే దానికి కొలతలు సరిహద్దులు రెండూ ఉంటాయి, విలువ ఎటూ ఉంటుంది. కనుక, భూమి మన స్వాధీనంలో ఉన్నప్పుడు దానితో పాటుగా దాని మీద ఉండే అధికారం (పవర్) కొత్తగా భూమి యజమాని వద్దకు వచ్చింది. భూమి క్రయవిక్రయాల దస్తావేజుల్లో ఇప్పటికీ మనం రాసుకునే జల.. తరు...ఖనిజ... వంటి పదాలు ‘భూమి’తో పాటుగా తదనంతరం వచ్చి కలిసిన ‘వాల్యూ ఎడిషన్’ అంశాలు. దేశానికీ తూర్పువైపున 2002 సం.తర్వాత ఏర్పడ్డ కొత్త రాష్ట్రాల ప్రాముఖ్యత అంతా ఖనిజ సంపద కావడం తెలిసిందే. ఆధునిక రాజ్యాల భావన వచ్చాక, ప్రపంచ చరిత్రలో విముక్తి లేదా స్వాత్యంత్ర పోరాటాలు అన్నీ భూమి విభజన కొరకు జరిగినవే! ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోవడం, పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడం, ఇప్పుడు కొత్తగా (ప్రతిపాదిత) ఏ.పి. రాజధాని నగరాలు – విశాఖపట్టణం, అమరావతి, కర్నూల్ కావడం, ఇవన్నీ మనకు తెలిసినవే. వీటిలో అతి ప్రాముఖ్యమైన అంశం - భూమి మీద కాదు, మ్యాప్ లో మనం గీసుకునే ‘వర్చువల్’ రాజకీయ విభజన రేఖ. 

ఒకసారి విభజన జరిగాక, ఒక ప్రాంతానికి ఉండే గుర్తింపు దాని ‘మ్యాప్’ లోనూ, అందులో గుర్తించబడిన దాని రాజధాని నగరం, వీటి ప్రాతిపదికగా మన ఉనికిని ఇతరులు గుర్తిస్తారు గౌరవిస్తారు. అస్సలు విభజన జరిగినప్పుడు జరిగేది ఏమిటి? ముందుగా ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విషయం - పెద్దవి చిన్నవి కావడం. బైబిల్లో జెహోవా ఆదేశాలు మేరకు కీ.పూ.1406 లో జరిగిన యుద్దంలో కానాను రాజ్యాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత, జాషువా ఇందుకోసం మొదటిసారి అతి పెద్ద కసరత్తు చేసాడు. అక్కడ ఆయన జెహోవా ప్రణాళికను అమలు చేయవలసి వచ్చింది. యూదులలో ఉన్న ప్రతి తెగకు వాటి జనాభా మేరకు ఆయన భూమిని కేటాయిస్తాడు. జాతుల ప్రాతిపదికన నివాస భూమిని కేటాయించినప్పుడు జరిగేది ఏమిటి? ఆయా జాతులు ఆ భూమి మీద హక్కులు ఆధిపత్యం రెండు కలిగి ఉంటాయి.

ఇక్కడ మళ్ళీ మనం ఆధునిక రాజ్య భావన వద్దకు వచ్చినప్పుడు, పరిశీలిస్తే - ‘రాజ్యం’ చిన్న చిన్న యూనిట్లు చేయవద్దని వెల్లువెత్తుతున్న ఆందోళన ఒక వైపు; చేయవలసిందే అని విభజనకు అనుకూలంగా బహుజన వర్గాల ఆకాంక్షలు మరొక వైపు కనిపిస్తాయి. ఒకే చోట అధికార లేదా రాజ్యం ‘కేంద్రీకరణ’ కనుక సరైనది అయితే, కనాను ను స్వాధీనపరచుకున్న జాషువా తాను రాజుగా ఉంటూ మిగిలిన యూదు తెగలు అన్నిటినీ తన పరిపాలన క్రింద ఉంచుకోవాలి. కానీ జాషువా అలా చేయలేదు. సమన్యాయంతో ఆయా జాతుల జనాభా మేరకు వెంటనే ఆయన రాజ్య భూభాగాన్ని వారికి పంచేసాడు. కుటుంబ యజమాని అయిన పురుషుడు చనిపోతే, స్త్రీకి కేటాయించిన భూమి మీద హక్కు కల్పించాడు. ఆయా జాతుల కోణంలో నుంచి దీన్ని చూసినప్పుడు కనిపించే ప్రధానమైన అంశం ఒకటుంది . అది –పరాధీనం కాకుండా మన రాజ్యం మనమే పరిపాలించుకుంటున్నాం, అనే స్వాభిమానం ఇక్కడ కీలకం. ఇటువంటి విభజన లేదా వికేంద్రీకరణ కాకుండా, కేంద్రీకరణ విధానంలో ‘రాజ్యం’ ఉన్నప్పుడు, ఇటువంటి బహుజన వర్గాల స్వాభిమానానికి ఆస్కారం ఉండదు.

 

(వికేంద్రీకరణ తర్వాత న్యాయాధిపతుల అధీనంలో 325 ఏళ్ళు కొనసాగిన 12 యూదా రాజ్యాల మ్యాప్)

బైబిల్లో జాషువా తర్వాత న్యాయాధిపతులు గ్రంధం ఉంటుంది. ఎవరీ న్యాయాధిపతులు? ‘Judges is book about heroes’ అని బైబిల్ పండితులు వీరి గురించి ఘనమైన కితాబు ఇస్తారు. జాతులవారీగా విభజితమైన భూభాగాన్ని వీరు 325 ఏళ్ళ పాటు పరిపాలించారు. ఈ కాలం వీరికి నల్లేరు మీద బండిలా ఏమీ సాగలేదు. ఒక కొత్త భూభాగంలో ఒక జాతి (ట్రైబ్) తన స్వంత రాజ్యపాలనకు ఎదురయ్యే కష్టాలు అన్నీ వీరికి ఎదురయ్యాయి. జెహోవా దేవుని దృష్టిలో వీరి ప్రవర్తన పలుమార్లు బైబిల్ భాషలో ‘పాపం’ అని పరిగణించబడింది. అయినప్పటికీ అందులో పడుతూ లేస్తూ జెహోవా మార్గదర్శనంలో వారు పనిచేసారు అంటారు, ఈ గ్రంధ రచయిత శామ్యూల్. 

ఆధునిక భారత చరిత్రలో కూడా 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలన తర్వాత భారత జాతీయ నాయకుల అనుభవం, బహుశా కీ.పూ. కాలంలో న్యాయాధిపతులకు ఎదురైన దానికి భిన్నం కాదు. ఒక భూభాగాన్ని పరిపాలన కొరకు కొత్తగా మనకు అప్పగించినప్పుడు, అప్పటివరకు లేని పరిపాలనా అనుభవం ఎవరికైనా ఉన్నట్టుండి ఎక్కణ్ణించి వస్తుంది? సహేతుకమైన సందేహం ఇది. ఇందుకు సమాధానం కోసం మన దేశ చరిత్రలోకే చూసినప్పుడు మనకు అక్కడ, డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షుడుగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ రచనా సంఘం కనిపిస్తుంది. అది తయారుచేసిన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న తర్వాత, గడచిన డెబ్బై ఏళ్లుగా ఈ దేశంలో ఎవరు పాలకులుగా ఉన్నా అదే మార్గదర్శిగా ఉంది. బైబిల్ కాలం మాదిరిగా ఇప్పుడు మనం దాన్ని ‘పాపం’ అనడంలేదు గానీ, ఇక్కడ మాత్రం ఎన్ని వైఫల్యాలు లేవు. 

 

 

రాజ్యాంగ స్పూర్తిని పలు దశల్లో నీరుగార్చడం, ఏదో ఒక నియంత్రణ వ్యవస్థల జోక్యంతో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం మనం చూస్తున్నదే. ఇందులో మనకు కనిపిస్తున్నది ఏమిటి? స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దొరలు దేశం విడిచిపెట్టి వెళ్ళాక, నెమ్మదిగా మనకూ స్వపరిపాలన క్రమంగా అలవడింది. సందర్భం వచ్చినప్పుడు పరిస్థితులు ‘డిమాండ్’ చేసినప్పుడు, ఏదీ ఆగకుండా ముందు పని మొదలు పెడతాము. ఏ ప్రాంతమూ ఏ జాతీ ఎల్లకాలము వెలుగు చూడకుండా ఉండదు అని, బైబిల్ ఆదికాండంలో కీ.పూ.1446 నుంచి కూడా మనకు చరిత్ర చెబుతున్న పాఠం. ఎందుకంటే - వికేంద్రీకరణ ప్రాకృతిక పరిణామం.

click me!