ఆన్ లైన్ విద్య అవస్థ తీరేది ఎట్లా?

By telugu teamFirst Published Jul 25, 2021, 12:54 PM IST
Highlights

కరోనా క‌ష్టకాలంలో ఆన్ లైన్ విద్య విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆవేదనతో సరోజ బోయని రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

సామాజికాంశం

"గురుకులం" అంటే అక్కడ ఒకటే కులం అందరిది చదువు కులం. ఒకప్పుడు గురుకులాలు ఊల్లల్లో కాకుండా అరణ్యంలో పచ్చని చెట్లు ,పక్షులు,ఆహ్లాద కరమైన వాతావరణం మధ్య  విద్య బోధన జరిగేది..గురు శిష్యుల మధ్య బంధం కూడా గౌరవంతో గురువును దైవ సమానంగా చూసుకునేది.  గురువులు కూడా శిష్యులను తమ బిడ్డలుగా భావించే వారు. పురాణాలు, హితిహాసాలు, కథలు, శ్లోకాలతో విద్య నేర్పే వాళ్ళు.  ఒక శ్లోకం పఠించాలి అంటే నోరు తిరగక పోయేది.  అందులో ఎంతో నిగూఢగ అర్థాలు ఉండేవి.అలాంటి విద్య నేర్వాలి అంటే ఎంతో తపన ఉండాలి, తపస్సు చేయాలి.

కానీ ఆ కాలంలో విద్య బ్రాహ్మణులకు, క్షత్రియలకు మాత్రమే దక్కేది.  శూద్రుల  పిల్లలను వివక్ష పేరుతో విద్యకు దూరంగా ఉంచే వారు.   ఆడపిల్లలకు కూడా అందని ద్రాక్ష గా ఉండేది.  క్షత్రియ కాంతలకు తప్ప వేరే వాళ్లకు విద్య దక్కేది కాదు.

అనేక సంస్కరణల తర్వాత కాలక్రమేణ మార్పు వచ్చి కులాల అడ్డు గోడలు తొలిగి అందరికి చదువు అందుబాటులోకి వచ్చింది.  కానీ భాష , లింగ వివక్షతతో అందరూ చదువు కోలేకపోయారు.  నేటి ఆధునిక యుగంలో తల్లి,దండ్రులలో మానసిక మార్పు వచ్చి లింగ వివక్ష చూడకుండా ఆడ,మగ అందరిని సమానంగా చదివించడం జరిగింది.

ఇప్పుడు చదువు  అంటే యాజమాన్యానికి వ్యాపారం.  చదువు చెప్పే పంతులుకి బ్రతుకు తెరువు.  తల్లి తండ్రులకు మోయలేనంత పీజుల మోత.   పిల్లలకు బుర్రలు బద్దలు అయ్యేటంత ఒత్తిడి.  ఎక్కడ అలనాటి ఆట,పాటలతో కూడిన చదువు?  గురువు అంటే భక్తి, గౌరవం ఎక్కడా?  పిల్లలను మందలియ్యాలి అంటే ఉపాధ్యాయులు భయపడే కాలం.  ఒకప్పుడు పిల్లలను జ్ఞానం కోసం, మంచి చెడుల విచక్షణ కోసం తను నేర్చుకున్నవిద్య  ఓ నలుగురికి పంచడం కోసం చదివిస్తే  ఇప్పుడు ఓ నాలుగు ఇంగ్లీష్ అక్షరాల కోసం, ర్యాంకుల కోసం, మంచి ఉద్యోగాల కోసం, ఉద్యోగం వచ్చినాక హై ఫైగా ఆడంబరంగా జీవించడం కోసం చదివిస్తున్నారు.

ఆన్ లైన్ విద్య :

కరోన జన జీవనాన్ని స్తంభింపచేయడమే కాకుండా దాని ప్రభావం విద్య పైన కూడా పడింది. కరోనాతో బడులు అన్ని మూసివేయటం వల్లపిల్లల విద్యా సంవత్సరం వెనుక బడుతుందేమోనని తల్లిదండ్రులలో  పెరిగిన కలవరం.  దీనినే అదనుగా చేసుకొని కార్పొరేట్ యాజమాన్యం ఆన్ లైన్ తరగతులను రంగంలోకి దించింది.  కానీ ఈ ఆన్ లైన్ తరగతుల వలన ఎవరికి లాభం?  ఇక ఈ ఆన్ లైన్ చదువు కూడా ఉన్నోనికే విద్య, లేని వాడికి అందని ద్రాక్ష.

లేని వాడు  బ్రతకడమే కష్టం.  ఇక వేలకువేలు  పోసి మొబైల్ ఎలా కొనగలడు.  అప్పోసప్పో చేసి కొన్నా దానికి బ్యాలెన్స్  వేయడం  అది సామాన్యుడికి మోయలేని బారమే.  నిరు పేద సగటు మనిషికి ఇది ఎంత మోయలేని భారం.  ఇంత చేసి పిల్లల కోసం అన్ని అమ్మి ఆన్ లైన్ తరగతులు ఏర్పాటు చేస్తే ఆ పిల్లలు క్లాస్ అని చెప్పి మొబైల్ ను చెడు కోసం ఉపయోగిస్తే?  చదువురాని తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు మొబైల్ లో ఏం చూస్తున్నారో వాళ్లకు ఏం తెలుస్తుంది.  పిల్లలు పెడదారి పట్టే ప్రమాదం లేదా ఆన్ లైన్ తరగతుల వల్ల?

తోటి పిల్లల తోటి కలిసి ఆడుకుంటూ, పాడుకుంటూ సాగే విద్యాభ్యాసం నాలుగు గోడల మధ్య నలిగి పోతుంది.   పొద్దున లేచింది మొదలు పిల్లలకు విశ్రాంతి లేకుండా చేతిలో మొబైల్ తో చెవిలో హియర్ ఫోన్స్ తో బయటి ప్రపంచంతో సంభందం లేకుండా ఒక జైలు లాంటి విద్య  వాడి భవిషత్ మీద ఎంత ప్రభావం చూపుతుంది.

ఇప్పటికే జనాలు మొబైల్ కి బానిస అయ్యి కనీసం తన పక్కన ఉన్నవాళ్లను కూడా పట్టించు కోకుండా మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి.  ఇక పిల్లలు కూడా మొబైల్ కు బానిస అయితే వారికి మంచి, చెడుల విచక్షణ లేకుండా బంధాల, బంధుత్వాల విలువ తెలియకుండా పెరగరా ??  చివరికి  రేడియేషన్  పిల్లల మానసిక, శారీరిక ఆరోగ్యం పై చూపే  తీవ్ర ప్రభావం సంగతి?.

- సరోజ బోయని

click me!