తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి: మహిళా జర్నలిస్టు ఆవేదన ఇదీ!

By Sree S  |  First Published Apr 26, 2020, 5:45 PM IST

తాజాగా ఒక జర్నలిస్టు తెలంగాణలో కరోనా కేసుల టెస్టింగ్ గురించి తన వ్యక్తిగత అనుభవాలను ట్విట్టర్ వేదికగా ఒక పోస్టును పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు సర్వత్రా చర్చనీయాంశం అవడంతోపాటుగా తెలంగాణాలో కరోనా వైరస్ స్థితిగతులపై నూతన అనుమానాలను రేకెత్తించేవిగా ఉన్నాయి. 


కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని భావించిన కేంద్రం ఒక బృందాన్ని కూడా ఇక్కడ పరిశీలనకు పంపించింది. ఇలా బృందం పరిశీలన, కేసుల పెరుగుదల జరుగుతూ ఉండగానే తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తమైంది. 

కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఇలా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి పూర్తిగా ప్రజల కదలికలను నియంత్రించడం, ఇతరాత్రా  చర్యల వల్ల కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. గత నాలుగు రోజులుగా చూసుకుంటే... కేసులు అదుపులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. 

Latest Videos

undefined

నేడు తాజాగా ఒక జర్నలిస్టు తెలంగాణలో కరోనా కేసుల టెస్టింగ్ గురించి తన వ్యక్తిగత అనుభవాలను ట్విట్టర్ వేదికగా ఒక పోస్టును పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు సర్వత్రా చర్చనీయాంశం అవడంతోపాటుగా తెలంగాణాలో కరోనా వైరస్ స్థితిగతులపై నూతన అనుమానాలను రేకెత్తించేవిగా ఉన్నాయి. 

పద్మప్రియ అనే జర్నలిస్ట్ కు  5 రోజుల కింద జ్వరం వచ్చినట్టుగా అనిపించి ఒక పారాసిటమాల్ మాత్ర వేసుకొని తన రోజువారీ పనులకు ఉపక్రమించారు. రెండవరోజు జ్వరం మరింతగా పెరిగి తలనొప్పి కూడా తీవ్రమయినట్టుగా గుర్తించి ఒక డాక్టర్ ని సంప్రదించింది. ఆ సదరు డాక్టర్ సలహా మీద సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ మాత్రలను వాడారు. ఒకవేళ లక్షణాల తీవ్రత అధికమయితే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయమని డాక్టర్ సలహా ఇచ్చారు.  

తెల్లారి పరిస్థితి మరింత దిగజారడంతో ఆమె హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసారు. వారు అన్ని విషయాలను అడిగి తెలుసుకొని, ఎవరైనా కరోనా వైరస్ సోకినా వ్యక్తితో ప్రైమరీ కాంటాక్టును కలిగి ఉన్నారా అని అడిగారు. అందుకు ఆమె లేదు అని చెప్పారు. 

మరుసటి రోజు పరిస్థితి మరింతగా దిగజారడంతో కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు ఆమెకు మందులిచ్చి సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండమన్నారు తప్ప, ప్రైమరీ కాంటాక్టు లేనందువల్ల టెస్టులు మాత్రం చేయలేదు. ఆమెలాగే అక్కడకు వచ్చిన చాలా మందికి టెస్టులు చేయకుండా కాంటాక్టు లేదని వెనక్కి పంపించి వేస్తున్నారని ఆమె రాసుకొచ్చారు. 

ఆమెకు కొన్ని మందులు ఇచ్చి, ఒకవేళ కరోనా వైరస్ సోకినా వయసులో ఉన్నారు కాబట్టి మీరు బయటపడగలుగుతారని డాక్టర్లు చెప్పారట. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారితే అప్పుడు తమకు చెప్పాలని డాక్టర్లు సూచించినట్టుగా ఆమె తెలిపారు. 

ఈమె కూరగాయలు తెచ్చుకోవడానికి మాత్రమే మూడు సార్లు ఇంటినుండి బయటకు వెళ్లినట్టుగా పేర్కొన్నారు. ఈ మొత్తం తతంగం చూసిన తరువాత కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. 

మొదటగా తెలంగాణాలో టెస్టులు తక్కువగా చేస్తున్నారా? లక్షణాలు ఉన్నాయని ఈమె వెళ్లి అడిగినా....  అన్ని లక్షణాలు ఉన్నయాని డాక్టర్లు నిర్ధారించిన తరువాత కూడా టెస్ట్ చేయకపోవడం మరి విడ్డూరంగా ఉంది. 

ప్రైమరీ కాంటాక్టుతో సంబంధం కలిగి ఉన్నారా అని ఈమెను అడుగుతున్నారు. మనం ఎక్కడో బయట కలిసిన వ్యక్తికి కరోనా ఉందా లేదా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది. 

ఈమె కేవలం మూడు సార్లు మాత్రమే బయటకు వెళ్లినట్టుగా పేర్కొన్నారు.  ఈమెకు గనుక కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయితే.... కరోనా వైరస్ సోకినవారందరిని ప్రభుత్వం ఐసొలేషన్ కి తరలించింది. వారి కాంటాక్ట్స్ అందరిని కూడా క్వారంటైన్ లో ఉంచింది. అలాంటప్పుడు ఈమెకు ఈ వైరస్ ఎలా సోకినట్టు? తెలంగాణాలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలయిందా?

తెలంగాణ ప్రభుత్వం కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ను అందించడంలో ముందుంది. ఆసుపత్రులను కూడా చాలా నీట్ గా మైంటైన్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం లక్షణాలు కనబడుతున్నప్పటికీ కూడా టెస్టులు నిర్వహించమని చెప్పడం మాత్రం నిజంగా శోచనీయం. 

ప్రైమరీ కాంటాక్ట్ లేకపోయినా సరే, దగ్గు, జలుబు,జ్వరం ఇన్ని లక్షణాలు కనబడుతున్నప్పుడు టెస్టు చేస్తే వచ్చే నష్టం ఏమి లేదు కదా. ఆఖరకు ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా టెస్టింగును అధిక స్థాయిలో చేసినప్పుడు మాత్రమే ఈ వైరస్ ని మనం అడ్డుకోగలమని అంటున్నారు. 

ఇప్పటికైనా ఈ లాక్ డౌన్ ను ఎత్తివేసే స్టేజి కి వస్తున్న నేపథ్యంలోనయినా టెస్టులను కొద్దిగా అధికంగా చేస్తే మాత్రమే ఈ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిరోధించగలమేమో!

click me!