వీరవనితలతో పునీతమైన తెలంగాణ... చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆర్టికల్

By Arun Kumar P  |  First Published Sep 26, 2021, 1:10 PM IST

మహోజ్వలమైన సాయుధ పోరు వీర వనితల చరిత్రపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీలు ప్రత్యేక శ్రద్ధ వహించి నమోదు కాబడి ప్రచురణకు నోచుకొని స్త్రీల చరిత్రను ప్రచురించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ హనుమకొండ నుండి దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు అస్నాల శ్రీనివాస్ రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.


దొరలకు, నిజాం రజాకార్ల రాచరికానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధపోరాటం మానవ ఇతిహాసంలో మహోజ్వల ఘట్టం. గత 300 సంవత్సరాల భారత చరిత్రలో ఒక తాత్విక దృక్పథంతో, వెట్టిచాకిరి విముక్తి కోసం, దున్నేవారికే భూమి పై హక్కు కోసం , అంటరానితనం నిర్ములన, పాలనలో ప్రజల భాగస్వామ్యం, శ్రామికులకు అధిక వేతనాల కోసం, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం , ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం, జీవించే హక్కు కొరకు కొనసాగిన ఏకైక ఉద్యమం ఇది.

అనేక మంది చరిత్రకారుల అభిప్రాయంలో భారత స్వాతంత్రోద్యమం కేవలం స్వపరిపాలన వంటి ఉద్వేగాలతో జరిగింది. అధికార మార్పిడి ప్రధాన ఎజెండాగా కొనసాగింది.  కానీ రైతాంగ పోరు రాజకీయ సాంఘిక , ఆర్ధిక విప్లవ మిళితంగా కొనసాగింది. నిద్రాణమై సుప్తావస్థలో, జడత్వంతో నిండి ఉన్న తెలంగాణ గడ్డను విప్లవ దీక్షతో  శక్తివంతంగా మార్చింది ఈ ఉద్యమం.  ఈ పోరు అందించిన విన్నూత్న చైతన్యం, నైతిక సాంస్కృతిక విలువల అపురూప సాంప్రదాయాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికి నిలబెట్టుకుంటున్నది.

Latest Videos

undefined

ఇలాంటి తెలంగాణ రైతాంగ పోరులో ఆకాశంలో సగం, అవనిలో సగం అంటూ ఎంతో మంది వీర వనితలు పాల్గొన్నారు.  సమాజంలో సగభాగమైన స్త్రీలు పాల్గొనందే ఏ విప్లవం విజవంతం కాదు అనే సార్వత్రిక సత్యం మరోసారి ఈ పోరు ద్వారా వెలుగులోకి వచ్చింది.

కిరాతక భూస్వాములను, నిజాం, పటేల్ సైన్యాలను ఎదిరిస్తూ, వారి దౌర్జన్యాలకు బలిగాకుండా తెలంగాణ మహిళ చూపిన దీక్ష, ప్రతిఘటన అసమానమైనది.పోరాటపు తొలినాళ్లలో గెరిల్లాలకు  అన్నం పెట్టడం, ఆశ్రయమిచ్చి కాపాడుకోవడానికి పరిమితమయిన స్త్రీలు తమ పాత్రను మరింతగా విస్తరించుకున్నారు. పోరులో అడుగడుగునా భుజం భుజం కలిపి ఆకలిదప్పులు మరచి తుపాకులకు తలలొడ్డి నిర్భయంగా నడిచారు. మనిషి విలువ, బతుకు విలువ తెలుసుకోవడం, తమకు,తమ వారికి, తరతరాలకి స్వేచ్చా స్వాతంత్రాలు సాధించడం కోసం విజయమో,వీర మరణమో తీరులో త్యాగాలు చేశారు. అక్షర జ్ఞానం లేని అనేక మంది తల్లులు తమ ధైర్య సాహాసాలతో అద్భుతమైన చరిత్ర సృష్టించారు.

తెలంగాణ రైతు పుట్టినగడ్డ కోసం, అన్నం పెట్టే భూమిని నిలుపుకోవడం కోసం  జరిపిన పోరాటపు తొలిదశ చిహ్నం , అగ్నికణిక చాకలి ఐలమ్మ. ఇంటినే పోరాట కేంద్రంగా, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి , కుటుంబాన్ని మొత్తం పార్టీకి అంకితం చేసి , గుండాలతో ప్రత్యక్షంగా తలపడి తాను పండించిన పంటను ఇంటికి చేర్చుకున్న ఐలమ్మ సాహసం ఒక గొప్పనైన ఉత్తేజభరిత  ఘట్టం.  తనను లొంగ దీసుకోవాలని తలంచిన నిజాం సేనాని దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి మెడలు వంచిన ధీర ఐలమ్మ.  కొడుకులపై అక్రమ కేసులు, కూతుళ్లపై అఘాయిత్యాలు జరిగినా వెరవకుండా, పోరుదారిని వీడకుండా కొనసాగి మహిళలు వెల్లువలా ఉద్యమంలో పాల్గొనడంలో ఐలమ్మ పాత్ర చిరస్మరణీమైనది.

1944 భువనగిరి ఆంధ్రమహాసభ తీర్మాణాల వెలుగులో చైతన్యంతో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని , ఐలమ్మ పంట రక్షణ పోరులో విసునూరు దొరలపై మడమ తిప్పని గ్రామంగా తెలంగాణలో  కడవెండి పోరాట కేంద్రంగా మారింది. దొడ్డి కొమురయ్య అమరత్వంతో రైతాంగ సాయుధ పోరుగా మారింది.

భూ సమస్యల గురించి జనగామ మున్సిఫ్ మేజిస్ట్రేట్ చర్చిద్దామని చెప్పి కడవెండి నాయకుడు ఎర్రమరెడ్డి మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.  చర్చల తర్వాత నిజాం పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. వీరిని విడిపించడం కోసం కడవెండి గ్రామంలో   నల్లా వజ్రమ్మ, ఎన్నమ్మ, గోపమ్మ, శేరమ్మ, సుశీలలతో ఏర్పడిన తొలి మహిళా దళం రాళ్లతో దాడి చేసి తమ నాయకుడిని విడిపించుకున్నారు.  జనగామ తాలుకాలో పెరుగుతున్న కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం నిజాం రాజు ప్రధాని మీర్జా ఇస్మాయిల్ 300 ల మందితో కూడిన సైన్యాన్ని కడవెండి, దేవరుప్పుల గ్రామలపైకి పంపించాడు.అప్పుడు కూడా ఇదే దళం ప్రజలను సమీకరించి వడిశెల రాళ్లు, కారంపొడి, రోకళ్ళు ఆయుధాలతో  మూడు గంటల పాటు పోరాడి సైన్యాన్ని గ్రామాల్లోకి రాకుండా చేశారు.  పోరాటం విస్తరించిన వందలాది గ్రామాల్లో స్త్రీలు ఇదే రకంగా ఉద్యమాన్ని , ఉద్యమకారులను శత్రువుల నుండి కాపాడుకున్నారు.  ఉద్యమ తొలి దశలో పోరాటకారులకు అన్నం పెట్టడం, కాపాడటంలో స్త్రీలు పాల్గొన్నారు.  ఉద్యమంపై తీవ్ర నిర్బంధం పెరిగినప్పుడు మగవాళ్ళు అడవులలో తలదాచుకున్నప్పుడు పిల్ల పాపలను, ముసలి వాళ్ళను, గొడ్డు గోదాను స్త్రీలు చూసుకున్నారు.  ఈ విధంగా స్త్రీలు ఉద్యమానికి వెన్నముకగా నిలిచారు. తర్వాతి దశలో స్త్రీలు మరింత చైతన్యం కనపరచి, పట్టుపట్టి మైదాన, అటవీ ప్రాంతాలలో సాయుధ దళాలోకి చేరారు.

నల్లమల అటవీ ప్రాంతంలో రంగమ్మ దళం చురుకుగా పని చేసింది.  నిజాం సైన్యాన్ని , ఆ తర్వాత యూనియన్ సైన్యాలను ధీరుగా ఎదుర్కొంది.  రంగమ్మ దళ పర్యవేక్షణలో నల్ల నర్సింహ, మగ్దుమ్ మోహినుద్దీన్, రాజ బహద్దూర్ గౌర్  కొంతకాలం పని చేశారు.  ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో ఆదివాసీ మహిళ వెంకటమ్మ దళం పని చేసింది.  అనేక గ్రామాలను దొరల నుండి విముక్తి చేసింది.మానుకోట ప్రాంతంలో షార్ఫ్ షూటర్ గా పేరు పొందిన నాగమ్మ దళం శత్రు ఆయుధాగారాలే మన ఆయుధాగారాలు  అని మెరుపు దాడులతో అనేక ఆయుధాలను చేజిక్కించుకుంది. 

  కొంత శిక్షణ తీసుకుని అనేక దళాలతో తిరుగుతూ గాయపడ్డ, జ్వరం బారిన పడిన గెరిల్లాలకు కట్లతో, ఇంజెక్షన్లతో చికిత్స అందించి, కొన్ని సార్లు గాయపడ్డ వారిని మైళ్ళ కొద్దీ  మోసుకెళ్లి రక్షిత ప్రాంతాలలోకి చేర్చి ప్రాణాలు పోసిన అక్షర జ్ఞానం అంతగా లేని అపర ధన్వంతరి అచ్చమాంబ, బర్లు కాసుకునే దూడల సాలమ్మ ఉద్యమంలో చేరి బద్దం ఎల్లారెడ్డి,నల్లా నర్సింహ దళాలతో పని చేసి అనేక రజాకార్ల క్యాంపుల పై జరిపిన దాడులలో ముందు భాగంలో ఉండి విరుచక పడిన తీరు, ఎర్రగొల్లపహాడ్ లో కుప్పల కొద్దీ రాళ్లతో పోలీసులను తరింకొట్టి పది మంది గెరిల్లాలను కాపాడుకున్న పుట్నాల రామక్క, మైదాన ప్రాంత ఉద్యమాల్లో తమ ప్రజల భాషలో వాడి వేడి ఉపన్యాసాలిస్తూ రైతాంగ ఉద్యమాన్ని విస్తరించిన మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలమ్మ, ప్రియంవదలు, పార్టీ బాధ్యతలకు ఇబ్బంది కలుగకూడదని తన పసి కందును ఆదివాసీలకు ఇచ్చిన మానుకోట కమలమ్మ, ఉద్యమం నుండి తన భర్త వెనక్కుపోయిన తను మాత్రం కొనసాగి పెద్ద మహిళా దళాన్ని నడిపించిన రాములమ్మ, దేశముఖ్ కుటుంబం నుండి వచ్చి పూర్తి స్థాయి ఉద్యమ నేతగా మారిన సూర్యాపేట లలితమ్మ, దాడులు,ఆత్మ రక్షణలో స్త్రీలకు సైనిక శిక్షణ ఇచ్చిన మోటూరి ఉదయం, పార్టీ వలంటీర్లకు ప్రధమ చికిత్స ,మంత్రసాని శిక్షణ ఇచ్చిన డా.కొముర్రాజు ఆచ్చమాంబ, హైదరాబాద్ నగరంలో  రజాకార్ వ్యతిరేక దళాలను నిర్మించిన బ్రిజ్ రాణి, ప్రమీల, రజియా లాంటి వందలాది స్త్రీల త్యాగం, ధైర్య సాహాసాలు ఆశ్చర్యంతో, ఆనందంతో, అణువణువు పులకరిస్తుంది.

ప్రతి మానవ విమోచన ఉద్యమానికి సాంస్కృతిక రంగం రథచక్రంగా పని చేస్తుంది.  మల్లు స్వరాజ్యం, శశిరేఖలు ఉయ్యాల,బతుకమ్మ పాటలతో మహిళలను సమీకరించేవారు.  "ఎంత పాపకారి ఉయ్యాలో, విసునూరి దోరోళ్ళు ఉయ్యాలో" అనే పాటలతో పీడకుల దౌర్జన్యాలను చెప్పి ప్రతిఘటనకు సిద్ధమయ్యేలా ఉత్తేజింప చేసేవారు.  కొటేశ్వరమ్మ, తాపీ రాజమ్మ, సరోజిని, ఉదయం, లక్మిలతో బుర్ర కథ దళాలు రాష్ట్రమంతా తిరిగి ఉద్యమానికి ఉతమయ్యాయి.  స్వతంత్ర పోరాట పాటలు, నిజాం వ్యతిరేక పాటలు, స్త్రీల హక్కుల పాటలు పాడుతూ చివరకు "కదిలి నడువమ్మా స్వేచ్ఛకై ఎర్రజెండా నెత్తుమమ్మా" అనే పాటతో ముగించేవారు.  ఆనాడు కమ్యూనిస్టు పార్టీ సభలకు వచ్చే ప్రజలలో మగవారి కంటే స్త్రీలు అధిక సంఖ్యలో హాజరయ్యేవారు.

ఉద్యమ ఉధృతితో దొరల నుండి వేల గ్రామాలు విముక్తి కావడం, తాను బలహీనం అవడంతో యధాతద ఒప్పందం నుండి వైదొలిగి ఎలాంటి ప్రతిఘటన లేకుండా హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేసాడు నిజాము రాజు . పచ్చి కమ్యూనిస్టుల వ్యతిరేకి అయిన హోమ్ మంత్రి తన ప్రత్యర్థి నెహ్రూకు కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారని భావించి రజాకార్లను కాపాడి  కమ్యూనిస్టులపై ఉక్కుపాదం మోపాడు.  కిరాతక సైనిక జనరల్ నంజప్ప సారధ్యంలో యూనియన్ సైన్యాలు చేసిన అత్యాచారాలు  నిజాం కంటే చాలా రెట్లు ఎక్కువని అనేక నివేదికలు తెలియచేసాయి.  ఈ దురాగతాలను మహిళా దళాలు సాయుధ పోరాట విరమణ అయ్యే వరకు తమ శక్తి మేర ప్రతిఘటించాయి.  మహిళా డిటెన్యూలుగా  జైళ్లలో సౌకర్యాల కల్పన కోసం జంగ్ సైరెన్ కూడా మోగించారు.

ఉద్యమంలో రోజు రోజుకు పెరుగుతున్న స్త్రీల భాగస్వామ్యం, వెన్నెముకగా నిలుస్తున్న వారి సాహసం ను దెబ్బ తీయాలని నిజాం, దొరల గుండాలు స్త్రీలపై కనీవినీ ఎరగని అఘాయిత్యాలకు ఒడిగట్టారు. గ్రామాలను కాలబెట్టడం, స్త్రీలను చెరచడం, సజీవ దహనాలు చేయడం వంటి కిరాతక చర్యలకు పాల్పడ్డారు.  ఈ దురాగతాలను సాయుధ పోరాట సేనాని రావి నారాయణ రెడ్డి జాతీయ మీడియాకు తెలియచేశారు.  విషయాన్ని తెలుసుకుని చలించి మాహాత్మా గాంధీ సరోజిని నాయుడు కూతురు పద్మజా నాయుడుని నిజ నిర్ధారణ చేయమని ఆదేశించారు. ఆకునూరు, మచ్చిరెడ్డిపల్లి ఇంకా అనేక గ్రామాలు తిరిగి అనేక సాక్ష్యాలతో దొరల దురాగతాలను ఎండగడుతూ నివేదికను విడుదల చేసారు సరోజిని నాయుడు కూతురు పద్మజా, కొడుకు డా.జయసూర్య లు.  వీరు పౌర హక్కుల నేతలుగా పని చేసి తెలంగాణ ప్రజల తరపున చివరి వరకు కృషి చేసారు.

తెలంగాణ రైతాంగ పోరు భూపంపకము, హైదరాబాద్ విలీనం వంటి అనేక విజయాలతో పాటు స్త్రీల జీవితాల్లో అనూహ్యమైన మార్పులను తీసుకవచ్చింది.  తెలంగాణ చరిత్రలో మొదటి సారి మగవాళ్ళు, ఆడవాళ్లు సమానం అనే భావన వ్యక్తమయ్యింది. దోపిడీ,అణచివేతలకు వ్యతిరేఖంగా మగవాళ్ళతో సమానంగా పోరాడే హక్కు ఉందని నిరూపించగలిగారు. బాల్య వివాహాలను, భార్యలను హింసించడం చాలా మేరకు నిరోధించగలిగారు. అవసరమైనప్పుడు విడాకులను ప్రోత్సహించారు. ఎరుకల, ఆదివాసీ స్త్రీలకు రవికలు తొడగడం నేర్పించింది ఈ పోరాటం.   కట్న కానుకలు లేని వివాహాలకు, వితంతు వివాహాలకు ఆదరణ పెరిగింది. వెట్టి నుండి విముక్తి అయ్యారు. ఆరోగ్య స్పృహ పెరిగింది.  సాంప్రదాయ, ఫ్యూడల్ ఆలోచనల ప్రభావం తగ్గింది.

పోరులో తన మాట, పాట, ఆయుధాలతో అద్వితీయ పాత్ర పోషించి ఈనాటికి అదే స్ఫూర్తితో, ఆశయంతో కొనసాగుతున్న 'లివింగ్ లెజెండ్'  మల్లు స్వరాజ్యం మాటల్లో -  స్త్రీలకు చరిత్ర ఉండాలి, చరిత్రకు మనుషులు అవసరం, మా వంతు పాత్ర ఆమోఘంగా పోషించాము.  కానీ నమోదు చేయడానికి నా జీవితం నాకు అవకాశం ఇవ్వలేదు.  ఐలమ్మ గురించి రాయాలనుకున్నాము.  ఐలమ్మ లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. అందరి చరిత్ర ఉట్టిగనే పాయే. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి రైతాంగ పోరాట ప్రతీకలు చోదకశక్తిగా పనిచేసాయి. స్వరాష్ట్రంలో చరిత్ర , సంస్కృతికి సముచిత స్థానాన్ని ఇస్తున్నారు. విద్యా ప్రణాళిక, పోటీ పరీక్షల సిలబస్ లో చేర్చారు. అయితే మహోజ్వలమైన సాయుధ పోరు వీర వనితల చరిత్రపై ప్రత్యేక దృష్టి సారించాలి.   ఐలమ్మ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడం కేసీఆర్ వేసిన గొప్ప ముందడుగు. ఈ క్రమంలో ప్రొఫెసర్ రమా మేల్కొటే, వసంత, లలితల బృందం తెచ్చిన పోరాటకారుల అనుభవాల పుస్తకం "మనకు తెలియని మన చరిత్రను" ఒక పేపర్ గా సామాజిక భాషా శాస్త్రాల ప్రణాళికలో చేర్చాలి.  తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీలు ప్రత్యేక శ్రద్ధ వహించి నమోదు కాబడి ప్రచురణకు నోచుకొని స్త్రీల చరిత్రను ప్రచురించాలి.  తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట స్మృతి కేంద్రాలను, వీరోచితగాధలను తరతరాలకు స్పూర్తి కలిగించే విధంగా నిర్మించాలి.

(నేడు అనగా సెప్టెంబర్ 26న చిట్యాల ఐలమ్మ  జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా)

click me!