2017 లో భారత రాజకీయాల యంగ్ సూపర్ స్టార్స్

First Published Dec 22, 2017, 12:37 PM IST
Highlights

యోగి అదిత్యనాథ్, రాహుల్ గాంధీ,  హార్ధిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, మేవాని, కెటిఆర్, కన్హయ కుమార్

 భారత రాజకీయాలలో ఈ ఏడాది కొత్త తరం సాక్షాత్కరించింది. ముందు ముందు దేశ రాజకీయాలను వాళ్లు ప్రభావితం చేస్తారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఇది ఒక కొత్త పరిణామం. వీళ్లలో  ఎక్కువ కొత్తతరానికి చెందిన నేతలు. వాళ్ల ఐడియాలజీ చాలా మందికి నచ్చకపోవచ్చు.అయితే, భారత దేశాన్ని వాళ్లు తమ వైపు తిరిగేలా చేశారు. వాళ్లు చెప్పే దాని గురించి  అంతా ఒకసారి ఆలోచించేలా చేశారు. దేశ రాజకీయాల్లో విభిన్న ఆలోచనలున్న యువతరం ముందుకు రావడం ఒక మంచి ప్రజాస్వామిక పరిణామం. దేశరాజకీయాలను శాసిస్తున్న వృద్ధతరానికి వాళ్లు నిజంగా సవాలే. రాజకీయాలు మళ్లీ క్రియాశీలం కాబోతున్నాయని 2017 చెబుతున్నది. ఈ ఏడాది తళ తళ మెరిసిన తారలు వీరే. ఇది సర్వే ద్వారా తేలింది కాదు. జనంలో,మీడియాలో వినపడిన  తీరును బట్టి ఎంపిక చేసిన పేర్లివి. అందర్ని యంగ్ క్యాటగిరి లోచేర్చడం జరిగింది. ఉన్నంతలో పెద్ద వాడు యోగియే.

యోగి ఆదిత్యనాథ్‌


యోగి ఆదిత్యానాథ్‌ ఇపుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి.  మొన్నటి వరకూ గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగా, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడిగానే అందరికీ తెలుసు. ఈ ఏడాది యూపీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో యోగి ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు. అతివాద హిందూ నేతగా ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్వతంత్ర ఆలోచనలు కల్గిన నాయకుడని పేరుంది.  నరేంద్ర మోదీ తరువాత భారత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్‌ అని ప్రచారం మొదలయింది.

రాహుల్‌ గాంధీ


2004లోనే రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో ప్రవేశించినా ఆయన అధికారికంగా నాయకుడయ్యింది ఈ ఏడాదే. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే గుజరాత్‌ ఎన్నికల్లో రాహుల్‌ తొలిసారి తన సత్తాను చాటుకున్నారని కాంగ్రెస్ హుశారెక్కింది.  మోదీపై విమర్శలు చేయడంలోనూ రాహుల్‌ పరిణతి ప్రదర్శించారని పేరు తెచ్చుకున్నారు.

హార్ధిక్‌ పటేల్ పటేల్‌


గుజరాత్ లో పాటిదార్‌ రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టిన కుర్రవాడు  హార్ధిక్‌ పటేల్‌. రేపటి తరం రాజకీయ ప్రతినిధిగా గుజరాత్‌లో స్థానం సంపాదించుకున్నారు. రాజకీయాలలో ఆయనదొక రికార్డు. ఆయన ఎంతవయసులో గుజరాత్ ను ప్రభావితం చేశాడంటే  మొన్నటి అసెంబ్లీ  ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు కూడా అర్హత లేని వయసు.  ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్రంలో ఆయనకే సవాల్ గా మారారు. గుజరాత్ ఎన్నికల్లో సౌరాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి భారీగా సీట్లు వచ్చాయంటే అది హార్ధిక్‌ పటేల్‌ సత్తానే అని చెప్పాలి. 

జిగ్నేష్‌ మేవానీ 


ఈయన కూడా గుజరాత్ కే చెందిన సామాజిక వేత్త, న్యాయవాది. గుర్తింపు తెచ్చుకున్న జిగ్నేష్‌ మేవానీ. 2017 గుజరాత్‌ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారారు. ప్రధానంగా దళిత నేతగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని మోదీని టార్గెట్ చేసుకున్న మరొక యువనాయకుడు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో వడ్గావ్‌ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 19 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

అల్ఫేష్‌ ఠాకూర్‌ 


గుజరాత్‌లో కొత్త  ఓబీసీ నేతగా అల్ఫేష్‌ ఠాకూర్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీని, ప్రధాని మోదీ, అమిత్‌లంటే గిట్టదు. గుజరాత్‌ క్షత్రియ ఠాకూర్‌ సేన పేరుతో ఆల్ఫేష్‌ ఠాకూర్‌ బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో అల్ఫేష్‌ ఠాకూర్.. బీజేపీ అభ్యర్థిపై 10 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 

కెటిఆర్

తెలంగాణా ఐటి, మునిసిపల్ పంచాయతీ రాజ్ మంతి.  ఈ ఏడాది దేశం దష్టిని ఆకట్టుకున్న ఏకైకదక్షిణాది నాయకుడు. రాజకీయంగా విజయవంతమయ్యాడు. పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నెగోషియేటింగ్ స్కిల్స్ ముందున్నాడని చెబుతారు. విభజన తర్వాత ఐటి హబ్ గా హైదరాబాద్ మసక బారకుండా ముందుకు తీసుకువెళ్తున్నాడని పేరు తెచ్చుకున్నాడు.

కన్హయ కుమార్

ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు. జెఎన్ యు ఎంతో మంది నాయకులను అందించినా, విద్యార్థిగా ఉండగానే దేశమంతా సంచలనం సృష్టించిన నాయకుడు కన్హయకుమారే. బీహార్ రైతు కుటుంబం నుంచి వచ్చిన కన్హయ మీద దేశ ద్రోహం కేసు పెట్టారు. అయితే, కేసులో వీగిపోయింది.దీనితో కన్హయ హీరో అయ్యారు. ఈ దేశం కొత్త తరం ప్రతినిధిగా ఆయనను అంతా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం జెఎన్ యులో ఆయన రీసెర్చ్ స్కాలర్.

click me!