
శాలరీ సరిపోవడంలేదని సైడ్ ఇన్ కం గా చిలుకలను అమ్మడం మొదలు పెట్టాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తాను పనిచేస్తున్న ఏయిర్ టెల్ సర్వర్ రూంనే కేంద్రంగా చేసుకొని చాలా సాఫ్ట్ గా ఈ దందా ప్రారంభించాడు.
చివరకు సీఐడీ అధికారులు కనిపెట్టడంతో అతడి బాగోతం బయటపడింది.
తమిళనాడుకు చెందిన డిప్యూటీ రేంజ్ ఫారెస్టు ఆఫీసర్ పి. నటరాజన్ కుమారుడు రఘుల్. బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడి ఏయిర్ టెల్ కార్యాలయంలో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
అలా పనిచేస్తే బాగానే ఉండేది కానీ, సైడ్ ఇన్ కం గా అదే ఆఫీసులో ఇంకో పని కూడా మొదలుపెట్టాడు.
తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి కాబట్టి తమిళనాడు నుంచి ఈజీగా ఖరీదైన జాతికి చెందిన చిలుకలను పట్టుకొచ్చి బెంగళూరులో అమ్మడం మొదలు పెట్టాడు.
అది కూడా తన ఆఫీసులోని సర్వర్ రూం కేంద్రంగా ఈ దందా షురూ చేశాడు.
సర్వర్ రూంలో రహస్యంగా చిలుకలను పెంచి వాటిని సోషల్ మీడియా ద్వారా విక్రయానికి పెట్టాడు.
ఈ విషయం తెలిసిన కర్ణాటక అటవీ శాఖ సీఐడీ ఉద్యోగులు ఏయిర్ టెల్ సర్వర్ రూంలోకి వెళ్లి మనోడి వ్యాపారాన్ని బట్టబయలు చేశారు.
పాపం... అక్కడ ఉద్యోగులకు కూడా సీఐడీ అధికారులు వచ్చేవరకు ఈ దందా గురించి తెలియదు. దీంతో వారు ఈ విషయం తెలుసుకొని షాక్ తిన్నారు.
ఈ చిలుకల దొంగ.. ఏయిర్ టెల్ సర్వర్ రూంలో దాచి ఉంచి చాలా పక్షులను అమ్మినట్లు అధికారులు నిర్దారించారు.
వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.