నోట్ల రద్దు కోసం రిజర్వు బ్యాంకు మెడలు వంచారట

First Published Jan 10, 2017, 6:38 PM IST
Highlights

నోట్ల రద్దు విషయంలో స్వయం ప్రతిపత్తి వదులుకుని రిజర్వు బ్యాంకు ప్రభుత్వం చెప్పిన పని చేసింది

రిజర్వు బాంకు అసలు రహస్యం బయటపెట్టింది.

 

పెద్ద నోట్లను రద్దుచేసిందెవరు?  రిజర్వు బ్యాంకా లేక మోదీ ప్రభుత్వమా  అనేది చాలా మందిని ఇంకా వేధిస్తున్న ప్రశ్న.

 

రిజర్వు బ్యాంకు చేసిందని చాలా మంది అనుకుంటున్నారు.  నోట్ల రద్దు పర్యవసానాలు చూసి బెంబేలు పడిన అనేక మంది మంత్రులు కూడా నోట్ల రద్దు ప్రభుత్వ చర్య కాదు, రిజర్వు బ్యాంకు దే అంటూ  నెపం బ్యాంకు మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు.

 

అయితే,  రిజర్వు బ్యాంకు తయారు చేసిన  ఒక నివేదిక  పెద్ద నోట్ల రద్దు ఎలా జరిగిందో బయటపెట్టింది.

 

ఈ ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రిజర్వు బ్యాంకుక రావడం, రిజర్వు బ్యాంకు దానిని ఆమోదించడం, తర్వాత కేంద్ర క్యాబినెట్ ఎమర్జన్సీ మీటింగ్ జరిని నోట్ల రద్దు నిర్ణయం తీసుకుకోవడం అంతా   24 నుంచి 36 గంటలలో జరిగిపోయింది.  అంటే రిజర్వు బ్యాంకు మెడలు వంచి, బలవంతంగా ఒక రికమెండేషన్ తీసుకుని మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టిందని ఈ నివేదిక వల్ల అర్థమవుతున్నది.

 

ఈ విషయాన్ని పార్లమెంటు కు చెందిన  డిపార్ట్ మెంట్ రిలేటెడ్ కమిటి ఆన్ ఫైనాన్స్ కు రిజర్వు  బ్యాంకు సమర్పించిన ఒక ఏడు పేజీల నోట్ లో పేర్కొన్నారు.

 

ఈ కమిటీకి అధ్యక్షుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీరప్పమొయిలి.

 

ఈ నివేదిక ప్రకారం, నవంబర్ 7 వ తేదీన ప్రభుత్వం నుంచి  రిజర్వుబ్యాంకు వర్తమానం వచ్చింది. ‘ప్రభుత్వం నవంబర్ 7 వ తేదీన రిజర్వు బ్యాంకుకు ఒక సలహా ఇస్తూ నకిలీనోట్ల, టెర్రిరిస్టులకు నిధులందడం,  నల్లధనం అనే మూడు సమస్యల బెడదతగ్గించేందుకు పెద్ద నోట్లయిన  అయిదొందలు, వెయ్యి నోట్లను ఉపసంహరించుకునే విషయాన్ని  బ్యాంకు సెంట్రల్ బోర్డు పరిశీలించాలని  చెప్పింది,’ అని ఆర్ బిఐ ఈ నివేదికలో పేర్కొంది.

 

ప్రభుత్వం  చెప్పినట్లుగా ఆర్ బి ఐసెంట్రల్ బోర్డు ఆ మరుసటిరోజున అంటే  నవంబర్ 8న, ప్రభుత్వ సలహాను పరిశీలించేందుకు సమావేశమయింది. తర్జన భర్జనల అనంతరం, సెంట్రల్ బోర్డు అత్యధిక విలువ ఉన్న  అయిదొందల, వేయి రుపాయల నోట్లను ఉపసంహరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానించింది.

 

ఈ నిర్ణయం ప్రభుత్వానికి తెలిపిన గంటల వ్యవధిలోనే కేంద్ర క్యాబినెట్  ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయింది. నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే, చాలా మంది మంత్రులు నోట్ల రద్దు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రభుత్వం కేవలం రిజర్వుబ్యాంకు సిఫార్సును ఆమోదించిందని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే,  వీరప్పమొయిలీ కమిటీకి రిజర్వు బ్యాంకు పంపిన నివేదిక అసలు విషయాన్ని వెల్లడించింది.

 

ప్రభుత్వం సూచన ప్రకారం రిజర్వు బ్యాంకు క్షణాల్లో సమావేశమయి, క్షణాల్లో ఆమోదించి  పంపిందని, దాని ప్రకారం ప్రభుత్వం కూడా క్షణాల్లో క్యాబినెట్ ను సమావేశపర్చి నోట్ల రద్దు నిర్ణయమం తీసుకుంది. అంటే బ్యాంకు మీద ఎత్త వత్తిడి తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇక, రిజర్వు బ్యాంకు  కూడా గొడవెందుకు అనుకుని తన స్వయం ప్రతిపత్తిని వదలుకుని ప్రభుత్వం డిపార్ట్మెంటులాగా పనిచేసిందని అర్థమవుతుంది.

 

ఈ  వివాదం గురించిన మరిన్ని వివరాలు ఈ నెల 18 వ తేదీన  వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆరోజు రిజర్వు బ్యాంకు గవర్నర్  పార్లమెంటు కమిటీ ముందు హాజరవుతున్నారు.

click me!