
ముఖ్యమంత్రి చంద్రబాబు రొటీన్ ప్రసంగాలు... ‘ఈ రోజుచీకటి రోజు’ ,’నేను వద్దన్నా విభజన చేశారు’ ‘హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను’, ‘ఇక అమరావతి వరల్డ్ క్లాస్ సిటి చేస్తున్నా’ లాంటి, ఉకదంపుడు ఉపన్యాసాలు వినివిని విజయవాడ ప్రజలు విసిగెత్తినట్లున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కోసం నిన్న చేపట్టిన నవనిర్మాణ దీక్షకు రాకుండా ముఖంగా చాటేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా డుమ్మాకొట్టారు అదే వేరే విషయం. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గంటున్నందున కనీసం పదివేల మందినయినా సమీకరించాలని పై నుంచి అదేశాలు వచ్చాయి. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా మహాత్మాగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్ రోడ్డు, బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, మచిలీపట్నం రోడ్డులో కుర్చీలు ఏర్పాటు చేశారు.
మూడేళ్లుగా ఒకటే ఉపన్యాసం. ఆగస్టు 15 అయినా, మహానాడు అయినా, అధికారుల సమీక్ష అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఒకటే ఉపన్యాసం. దీనితో ప్రజలు నవనిర్మాణ దీక్షా సమావేశం అంటే భయపడినట్లున్నారు. ముఖ్యమంత్రి దీక్ష మీద పెద్ద అసక్తి చూపలేదు. దీక్షా ప్రాంతం జనం లేక వెలవెల బోయింది.విజయవాడ ఎండల్లో తలదాచుకునేందుకు షామియానాలు లేకపోవడంతో వచ్చిన కొద్ది మంది తీవ్ర ఇబ్బందు లకు గురయ్యారు. జారుకోవడం మొదలుపెట్టారు. ఎండ నుంచి రక్షణకు దీక్షా శిబిరం వద్ద పంపిణీ చేస్తున్న టోపీల కోసం ఎగ బడ్డారు.
ఆదేశాల మేరకు వేలాది మందిని సమీకరించాలని జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. విజయవాడలోని ప్రతి డివిజన్ నుంచి 500 మందిని సమీకరించాలనుకున్నారు. జన సమీకరణకు 110 వాహనాలను ఏర్పాటు చేశారు. 10 వేల మంది వస్తారని అంచనా వేస్తే కనీసం 2 వేల మంది కూడా రాలేదు. దీంతో చంద్రబాబు రాక ముందే వెలితిని కనిపించకుండా చేసేందుకు అధికారులు ఖాళీ కుర్చీలను కూలీలతో నింపారు. డివి మేనర్ నుంచి స్కేటింగ్‌లో 100 మంది, సైకిల్ ర్యాలీలో 500 మంది పాల్గొంటారని ఆశపడ్డారు. స్కేటింగ్‌లో కేవలం 20 మంది, సైకిల్ ర్యాలీలో 100 మందికంటే మించలేదనిమీడియా కథనం.
జనం లేకపోవడంతో ముఖ్యమంత్రి ప్రారంభిం చాల్సిన స్మోక్ లెస్ జిల్లా (పొగ రహిత) కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సభకు హాజరైన వారికి అరటి పండు, బిస్కెట్లు సిద్ధం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లక్ష తాగునీరు బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. వీటిలో 70 శాతం వరకు మిగిలిపోయాయి.
ఏమిటీ అన్యాయం?
ఏమిటీ అన్యాయం అని కార్యక్రమం ముగిసిన వెంటనే అధికారులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆగ్రహంతో సమావేశం ఏర్పాటు చేశారట. ప్రజలను సమీకరించడంలో ఎందుకు విఫలమయ్యారని నిలదీశారట.
రెవెన్యూ డివిజన్ స్థాయి, డిఆర్‌డిఏ అధికారులు కమిట్ మింట్ లేక పోవడంతో జన సమీకరణ విఫలమయిందంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూన్ 3 నుంచి ఎ వన్ కన్వెన్షన్‌లో జరగనున్న కార్యక్రమాల నిర్వహణలో విఫలమైతే బదిలీ లేక సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించినట్లు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.