టిడిపి కమాండో బోండా ఉమకు రెండో సారి అవమానం...

First Published Nov 24, 2017, 12:03 PM IST
Highlights

రౌడీ రాజకీయం నేపంతో ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయనను దూరంగా పెడుతున్నారనేది మరొక వాదన

బోండా ఉమ తెలుగు దేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గా కంటే ఆయనకు తెలుగు దేశం కమాండో గా బాగా గుర్తింపు. పార్టీలో బాగానోరున్న మనిషి. ఎవరినయినా దబాయించగలవాడు. దీనివల్లే ఆయన చంద్రబాబు కమాండో ఫోర్స్ లో ఒకడయ్యాడు.

ఆయనకు విజయవాడలో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. అధికార్లలో, పోలీసు యంత్రాంగంలో కూడా ఆయనకు బాగా పలుకుబడి ఉంది. ఒక్క మాటలో చెబితే మంచి జనబలం, అంతో ఇంతో ధనబలం కూడా ఉన్న నాయకుడని విజయవాడలో ఎవర్నడిగినా చెబుతారు. అందుకే ఆయన అసెంబ్లీలో నే కాదు, బయట కూడా తెలుగుదేశం పార్టీని, అధినేత చంద్రబాబు నాయుడిని కమాండో లాగా కాపలాకాస్తూ వచ్చారు. పార్టీ మీద, నేత మీద ఈగ వాలనీయకుండా చూశారు. పార్టీని పల్లెత్తు మాట ఎవరన్నా వూరుకోడు, కమాండో లాగానే లంఘించి దూకేస్తాడు.

 అయితే, ఈ మధ్య బోండా ఉమలో ఉత్సాహం తగ్గినట్లు కనబడుతుంది. ఆయన గొంతుఅంతగా వినిపించడం లేదు. వినిపించినా మునుపటి ధాటి లేదు. కారణం...ఆయనకు వరుసగా జరుగుతున్న అవమానాలేనని చెబుతున్నారు.  మొదటి భారీ అవమానం గత క్యాబినెట్ ఏర్పాటుచేస్తున్నపుడు ఎదురయింది. కాపు రిజర్వేషన్ల మీద కాపులంతా తెలుగుదేశంతో పోరాడుతున్నా ఆయన టిడిపి లైన్ తీసుకుని కాపునేత ముద్రగడను వ్యతిరేకించారు. విమర్శించారు. తన సేవలకు గుర్తింపుగా మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. అయితే, భంగపాటు ఎదురయింది.

ఇది ఎంతగా ఆయన్ని బాధ పెట్టిందంటే  మొదటి సారి ఉమ పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను వాడకుని వదిలేశారని అన్నారు. జనసేన నుంచి తనకు ఆహ్వానం ఉన్నా వెళ్లడం లేదని అయినా గుర్తింపు లేదని అన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తనమీద రౌడీ అనే ముద్రవేసి మంత్రిపదవి ఎగ్గొట్టారని ఆయన బాధపడ్డారు. కాపులకు అన్యాయమని కూడా అన్నారు. ఇపుడు మళ్లీ రెండో అవమానం జరిగింది. ఆయనకు కనీసం చీఫ్ విప్ గా కూడా ప్రమోషన్ ఇవ్వలేదు. ఆపదవికి అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎంపిక చేయడం ఆయన్ని బాగా బాధించిందంటున్నారు. ఇది తనని సైడ్ లైన్ చేయడమేనని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు కాపు నాయకుడొకరు ఏషియానెట్ కు చెప్పారు.

ఇప్పటికే బోండా ఉమ పార్టీ కార్యక్రమాలలో అంతగా పాల్గొనడం లేదు. ఏదో నామమాత్రంగా కనబడుతున్నారు. చీఫ్ విప్ పదవిని కూడా నిరాకరించడంతో ఉమ పార్టీ కి ఇంకా దూరంగా జరుగుతారని అంటున్నారు. దీనికి మరొక వర్షన్ వివరణ కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది. రౌడీ రాజకీయాల నుంచి విజయవాడను కాపాడలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయనను దూరంగా పెట్టారనేది మరొక వాదన.

 

click me!