మాటలకు ఆకాశమే హద్దు

First Published Jan 28, 2017, 10:42 AM IST
Highlights

మోడిని పొగడటం, పార్టీని ఆకాశానికి ఎత్తేయటమే లక్ష్యంగా పెట్టుకన్నట్లు కనబడుతోంది. దాంతో వెంకయ్య మాటలను భరించటం కష్టమైపోతోంది.

కేంద్రమంత్రి వెంకయ్యనాయడు మాటలను భరించటం కష్టమే. ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఆవువ్యాసమే చెబుతున్నారు. ఎప్పుడు చెప్పినా ఒకటే, ఏంటంటే ‘తాము బ్రహ్మాండం, కాంగ్రెస్ అధమం’. సమయం, సందర్భమేదైనా కానీ తన జబ్బలను తానే చరుచుకోవటం బాగా ఎక్కువైపోయింది. మోడిని పొగడటం, పార్టీని ఆకాశానికి ఎత్తేయటమే లక్ష్యంగా పెట్టుకన్నట్లు కనబడుతోంది. దాంతో వెంకయ్య మాటలను భరించటం కష్టమైపోతోంది.

 

తాజాగా మీడియాతో మాట్లాడుతూ, భాజపా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లల్లోనే నరేంద్రమోడి దేశంలో సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అంత వరకూ ఓకే. ఆ తర్వాతే సమస్య మొదలైంది. మోడి తెచ్చిన సంస్కరణలతో తమ పార్టీపై దేశప్రజల్లో ఉన్న ముద్రలు తొలగిపోయినట్లు చెప్పారు. మరి, ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో చిత్తుగా ఎందుకు ఓడిపోయిందో కూడా చెబితే బాగుంటుంది.

 

భారతీయ జనతా పార్టీని భారతీయ జనుల పార్టీగా ప్రజలు పోల్చుకుంటున్నారట. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది.  పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో యావత్ దేశం మోడిని కేంద్రప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టిన విషయాన్ని వెంకయ్య మరచిపోయారా? లేక మరచిపోయినట్లు నటిస్తున్నారో?

 

ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఏనేత కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనలేదట. అయితే ఏంటి? స్వాతంత్ర్యపోరాటం 1947కు మునుపు జరిగింది. అంటే దాదాపు 70 ఏళ్ళ క్రితం. మరి ప్రస్తుత నాయకులు అప్పట్లో ఎలా పాల్గొని ఉంటారన్న కనీస జ్ఞానం కూడా వెంకయ్యకు లేకపోవటం నిజంగా దురదృష్టమే. ఆ మాటకొస్తే భాజపాలో ఉన్న ప్రస్తుత నేతల్లో ఎంతమంది స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారో లెక్కలు చెబితే బాగుంటుంది.

 

స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించేందుకే మోడి రాట్నం వద్ద కూర్చున్నట్లు స్పష్టం చేసారు. మరి, మోడి వేసుకునే సూట్లు పూర్తిగా స్వదేశీ వస్త్రాలతోనే నేసినట్లు వెంకయ్య చెప్పగలరా? 62 శాతం మంది దేశప్రజలు మళ్ళీ నరేంద్రమోడినే ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. మరి ఇంకేం, వెంటనే మధ్యంతర ఎన్నికలకు వెళితే బాగానే ఉంటుంది కదా?

click me!