ఈ కలర్ ఫుల్ ఎంపి రాజకీయాలకు గుడ్ బై అంటున్నాడు

First Published Feb 24, 2017, 4:00 AM IST
Highlights

టిఎస్ ఆర్  రిటైరయిపోతే  ఆమేరకు రాజకీయాలూ  రంగువెలుస్తాయి

 భారత దేశ రాజకీయాలలో  తెలుగు రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి కంటే షోగ్గాడెవరూ (కలర్ ఫుల్ ) లేరు. మొత్తం పార్లమెంటులో ఈజీ గా గుర్తుపట్టగలిగే సభ్యుడాయనే. ఆయన  మాటతీరు, దుస్తులు, జీవన శైలి... ఎక్కడ ఉన్నా ఆయన కొట్టొచ్చికనిపించేలా చేస్తాయి.

 

ఢిల్లీలో ఆయన ఇచినన్ని విందులు మరొక ఎంపి ఇచ్చి ఉండరేమో.  సీనియర్ అధికారులురిటైర్ యినా, సినిమా సూపర్ స్టార్ల జన్మదినాలొచ్చినా, సెలెబ్రిటీలకు అవార్డులొచ్చినా,  ఆయన చేతుల మీదుగానే  విందులు వినోదాలు జరుగుతుంటాయి.  ఢిల్లీ తారల్లో ఆయన ఆతిధ్యంలో జల్సా చేసుకోని వారుండరంటే ఆశ్చర్యం కాదు.  ఒకసారెపుడో ఆయన వైభోగం చర్చకు వచ్చినపుడు, అవునయ్యా, డబ్బులు సంపాయిస్తున్నా, ఖర్చు పెడుతున్నానని అంటూ విమర్శలను కొట్టి పడేశారు.  గ్రూపు రాజకీయాల్లో కనిపించకపోయినా, ఆంధ్ర రాజకీయాలలో మేజర్  వ్యూహాలలో ఆయన పాత్ర ఉంటుంది. పత్రికల భాషలో ఆయన గొప్ప రాజకీయ నాయకుడు కాకపోయినా, రాజకీయాలు ఆయన చుట్టూర తిరిగేవి. గాంధీ భవన్ ని , గాంధీ భవన్ లో కూర్చునే పిసిసి పెద్దమనిషిని  చాలా కాలం ఆయనే పోషించేవాడని కూడా చెబుతారు. పేరు కు కాంగ్రెస్ లో ఉన్నా, ఆయన్ని అభిమానించని పార్టీ వుండదు.

 

రాష్ట్ర కాంగ్రెస్ లో  ఎవరిమీద అసంతృప్తి ఉన్నా ఆయన మీద ఉండేదికాదు, కాకపోతే వైజాగ్ లోక్ సభ సీటు వ్యవహారంలో మాత్రమే ఆయనకు ఒక సారి సమస్య వచ్చిందని చెబుతారు. చిల్లర రాజకీయాల్లోకి పోడు,పెద్ద  తగాదాల్లో తల దూర్చడు.  ఆగ్రూపు,ఈ గ్రూపు అని లేకుండా అన్ని గ్రూపులకు అందరివాడు ఆయన.

 

 

ఆంధ్ర కాంగ్రెస్ కే కాదు, ఎఐసిసి కి కూడా ఆయన కొండంత అండ, చెట్టంత నీడ.  ఎఐసిసి కార్యాలయంలోగాని, పక్కనే ఉన్న టెన్ జనపథ్ లో గాని ఆయన కోసం గేట్లు  ఎపుడు తెరిచే ఉంటాయి.  సెక్యూరిటీ వాళ్లు ’రెడ్డీ సాబ్ ఆగయా ’అని సెల్యూట్ కొట్టి పంపిస్తుంటారు.

 

కేంద్రంలో ఒక్కసారి తప్ప ఎపుడూ ఆయన మంత్రి కాకపోయినా, ఆయనకు న్నంత మంది ఫ్యాన్స్ మరొక ఎంపికి లేరు. మీడియా, సినిమా, రాజకీయాలు, బిజినెస్, బ్యురాక్రసీ.... లకు ఆయన అభిమాన సంఘం విస్తరించింది. అందుకేకాంగ్రెస్ పార్టీ ఆయన్నెపుడు ఖాళీ గా ఉంచలేదు. అందితే లోక్ సభ, అందకుంటే రాజ్యసభ.

 

పార్లమెంటులో కాలుపెట్టిన వాళ్లంతా  మరుక్షణమే ఖాదీ అంత పేలవంగా తయారవుతారు. ఒక్క సుబ్బరామిరెడ్డి మాత్రమే రోజుకో రంగులో కనిపించి సభనంతా తన వైపు తిప్పుుకుంటారు.

 

ఇపుడాయన రాజ్యసభ సభ్యుడు.  ఆయన నివాసం ఎబి 2, పురానా ఖిల్లా రోడ్, న్యూఢిల్లీ . టెన్ జనపథ్, సెవెన్ ఆర్సీర్, చౌబీస్ అక్బర్ రోడ్, గ్యారా అశోక్ రోడ్ ల వంటి ల్యాండ్ మార్కుల వరసలో ఎబి2 పురానా ఖిల్లా కూడా ఉంటుంది.

 

 2014 లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు కాబట్టి 2020 దాకా ఆయన పార్లమెంటులో ఉంటారు.

 

అయితే, ఆ తర్వాత తాను రిటైర్ అవుతానని ప్రకటించారు.

 

ఇపుడాయన రాజకీయాలు, బిజినెస్, అధ్యాత్మికం దట్టంగా కలసిన  త్రివేణి సంఘమం.

 

ఆయన ’మాంచి‘ శైవరాధకుడు. ఆయన పఠించే శివస్తొత్రం బాగా పాపులర్.ఢిల్లీలో చాలా సమావేశాలలో, మెడనిండా రుద్రాక్షలు ధరించి, శివభక్తుడిగామారిపోయి,  శివ  స్తోత్రం పఠించేవాడు. ఆయనలో ఒక కళాకారుడు కూడా దాక్కుని ఉన్నాడని అపుడుగాని చాలా మందికి తెలిసి రాలేదు.

 

పార్లమెంటులో  దాదాపు నాలుగయిదు ధఫాలుగా ఉంటున్నా  రాజకీయాలనెపుడూ ఆయన సీరియస్ గా తీసుకుని వొళ్లంతా పులుముకోలేదు. అలాగే, రాజకీయాలూ ఆయన్ని సీరియస్ గా తీసుకోలేదు.

 

అయినా సరే, టిఎస్ ఆర్  రిటైరయిపోతే ఆమేరకు రాజకీయాలూ  రంగువెలుస్తాయి.

 

 

 

click me!