
కేంద్ర ప్రభుత్వంలో సంక్షోభం తప్పదా ? అర్ధాంతరంగా పెద్దనోట్ల రద్దు, తదనంతర పరిణామాలతో కేంద్రంప్రభుత్వం సంక్షోభంలో పడుతున్నదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త కేంద్రానికి లీగల్ నోటీసు ఇవ్వటం, దేశ సర్వోన్నత న్యాయస్ధానం కేంద్రం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే కేంద్రంలో సంక్షోభం తప్పేట్లు లేదని అనుమానాలు మొదలయ్యాయి.
నోట్ల రద్దు వల్ల గడచిన పది రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజాసమస్యలు పెరుగుతున్నాయో గానీ ఏమాత్రం తగ్గటం లేదు. ఇదే విషయమై సర్వన్నోత న్యాయస్ధానం కూడా తీవ్రం ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు పర్యవసానం దేశంలో అల్లర్లు జరుగుతాయని సుప్రింకోర్టే ఆందోళన చేయటం గమనార్హం. ఇక, ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్తల్లో ఒకరైన గోవిందాచార్య కేంద్రప్రభుత్వానికి లీగల్ నోటీసు ఇవ్వటంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడి, గోవిందాచార్య లాంటి చాలా మందికి ఆర్ఎస్ఎస్సే మాతృసంస్ధ. ఎవరైనా, ఎప్పటికైనా సరే మాతృసంస్ధ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. మోడి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తీసుకున్న పలు నిర్ణయాల్లో మాతృసంస్ధదే కీలకపాత్రగా ప్రచారంలో ఉంది. అటువంటిది పెద్ద నోట్ల రద్దు విషయంలో స్వయంగా గోవిందాచార్యానే కేంద్రానికి లీగల్ నోటీసు ఇచ్చారు.
త్వరలో జరుగునున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో గెలవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టికి ఉంది. ఈ నేపధ్యంలోనే గెలుపు బాధ్యతలను ఆర్ఎస్ఎస్ మోడిపై మోపింది. అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది సూచిస్తూ కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. భాజపా గెలుపు కోసం ఒకవైపు ఆర్ఎస్ఎస్ సూచనలు పాటిస్తూనే మరోవైపు పెద్ద నోట్ల రద్దును ప్రధాని హటాత్తుగా ప్రకటించారు. దాంతో దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది.
నోట్ల రద్దు సమస్య మొత్తం దేశవ్యాప్తంగా ప్రభావం కనబరుస్తుండటంతో సహజంగా ఆర్ఎస్ఎస్ లో కూడా కలవరం మొదలైంది. ప్రస్తుత పరిస్దితులను భేరీజు వేసుకున్న తర్వాత యూపి, పంజాబ్ లో గెలుపుపై ఆర్ఎస్ఎస్ లో తీవ్ర ఆందళన మొదలైనట్లు సమాచారం. మోడి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతోనే ఇటువంటి పరిస్ధితులు తలెత్తినట్లు భావించిన ఆర్ఎస్ఎస్ మోడిపై మండిపడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే గోవిందాచార్యతో కేంద్రానికి లీగల్ నోటీసు ఇప్పించినట్లు సమాచారం.
లేఖలో గోవిందాచార్య లేవనెత్తిన అంశాలతోనే ఆర్ఎస్ఎస్ మోడిపై ఎంత ఆగ్రహంగా ఉందో తెలుస్తోంది. నోట్ల రద్దు అధికారం అసలు కేంద్రానికి లేనే లేదన్నారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రజల జీవించేహక్కుకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు ఫలితంగానే 40 మంది మరణించినట్లు ఆరోపించారు. మరణించిన వారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం మూడు రోజుల్లో నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేస్తూ డిపార్ట్ మెంట్ ఆప్ ఎకనమిక్ అఫైర్స్ కార్యదర్శి శక్తికాంత్ దాస్ కు లీగల్ నోటీసు పంపారు. లేకపోతే తగిన ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించటం గమనార్హం.
గోవిందాచార్య కేంద్రానికి లీగల్ నోటీసు పంపిన విషయం వెలుగు చూడగానే భాజపాలో కలకలం మొదలైంది. ఆర్ఎస్ఎస్ పెద్దల ఆదేశాలతోనే గోవిందాచార్య కేంద్రానికి లీగల్ నోటీసు పంపారన్న విషయం స్పఫ్టమైంది. దాంతో అంతర్గతంగా ఇటు భాజపాలో అటు ఆర్ఎస్ఎస్ లో ఏదో జరుగుతోందని అందరూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. దానికితోడు మోడి కూడా మూడు రోజులైనా పార్లమెంట్ కు హాజరై నోట్ల రద్దు నిర్ణయంపై తన చర్యను సమర్ధించుకునే పని చేయలేక పోవటాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలో కేంద్రంలో సంక్షోభం తప్పకపోవచ్చని పలువురు విశ్లేషణలు మొదలుపెట్టారు.