
రాజధాని తొలిదశ నిర్మాణాలను మరో పదిహేడు మాసాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిర్ణయించటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ 2018 డిసెంబర్ కల్లా అమరావతి తొలిదశ పూర్తి కావాల్సిందేనంటూ సిఎం గురువారం ఉన్నతాధికారులను ఆదేశించటం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
గురువారం సిఆర్ డిఏ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వ భవనాల సముదాయం, భవనాల ఆకృతుల రూపకల్పన, హరిత, నీలి ప్రణాళికలు సిద్దం చేయటం, వనరుల సమీకరణ, 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాల కల్పన, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ప్రపంచస్దాయి ఆసుపత్రుల ఏర్పాటు, ఉద్యానవనాలు తదితరాల అభివృద్దిని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
వచ్చే రెండేళ్ళల్లో చేయాల్సిన పనులకు సంబంధించి 21 అంశాలతో సిఆర్డిఏ బ్లూ ప్రింట్ ను సిద్దం చేసింది. రైతులకు స్దలాలు ఇవ్వటం, ప్రభుత్వ భవనాల సముదాయానికి ప్రధాన భవనాలు నిర్మించే ఆర్కిటెక్ట్ ఎంపిక వంటి వ్యవహారాల్లో ఇప్పటికే బాగా జాప్యం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. పలుమార్లు డిజైన్లను మారుస్తూ, మార్పులు, చేర్పులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం బాగా కాలయాపన చేసింది.
దాంతో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండున్నరేళ్ళు పూర్తవుతున్నా ఇంత వరకూ రాజధాని నిర్మాణ పనులు మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు ఒకరకంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలే కారణమని చెప్పక తప్పదు. రాజధాని నిర్మాణానికి సిఎం అనుసరించాలని అనుకున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.
దాంతో చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఎన్నుకున్నట్లు ప్రతిపక్షాలు విరుచుకుపడటం మొదలుపెట్టాయి. చివరకు ఇదే విషయమై రెండు నిర్మాణ సంస్ధలు న్యాయస్దానంలో కేసు దాఖలు చేయగా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విధంగా రాజధాని నిర్మాణ ప్రక్రియ రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది
అదే సమయంలో వెలగపూడిలో ప్రభుత్వం నిర్మించదలచుకున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణానికే దాదాపు ఏడాది పట్టింది. ఇంకా అన్నీ వసతులూ సమకూరకుండానే ప్రభుత్వం హడావుడిగా హైదరాబాద్ నుండి ఉద్యోగులందరినీ తరలించేసింది. దాంతో అరా కొరా సౌకర్యాలతో ఉద్యోగులు వెలగపూడిలో అవస్తలు పడుతున్నారు.
తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్నే సక్రమంగా జరపలేకపోయిన ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు, లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సిన కట్టడాలను అది కూడా అంతర్జాతీయ స్ధాయిలో 17 మాసాల్లో సాధ్యమౌతుందా అని సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్షేత్రస్దాయిలో పరిస్ధితులు తెలుసుకోకుండా చెప్పినా వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం ఆనక ప్రభుత్వ యంత్రాంగాన్ని నిందించటం చంద్రబాబుకు రివాజుగా మారిందని ఉన్నతాధికారులు వాపోతున్నారు.