బూచోడొస్తాడు

Published : Nov 19, 2016, 04:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బూచోడొస్తాడు

సారాంశం

చాన్నాళ్లకి తెలుగునాట  వూరూర ,ఇంటింటా  బూచోడి భయం పట్టుకుంది. బూచోడొస్తాడేమోనని, పిల్లలు కాదు, ఈ సారి పెద్ద లే భయపడుతున్నారు,  ఇంతకీ ఈ కొత్త బూచోడెవరో తెలుసా???

బూచోడొస్తాడని  పెద్దవాళ్లు భయపడిచ్చిన రోజులు చాలా మందికి గుర్తుండే  ఉంటాయి.

ఊయలలో పిల్లవాడు ఎంతకు కళ్లూ మూసుకోకుండా మూలుగుతున్నపుడు,

రాత్రి మంచమ్మీద నిద్ర పోకుండా మారాము  చేస్తున్నపుడు...

నిద్రలోకి  తోలేందుకు

పెద్ద వాళ్లు  బూచోడ్ని చూపించే వాళ్లు.

చీకట్లో బూచోడుండే వాడు.  ఇంటివెనక-ముందు, వూరి బయట పాడు పడిన సత్రాలలో, అటువైపు కొండల మీద, ఇటు వైపు తాటి వనంలో  బూచోడు దాక్కుని ఉండేవాడు. వాడి పనల్లా మారాము చేసే పిల్లల్ని, ఏడుపు చాలించని పిల్లల్ని, ఎంతకూ నిద్ర పోని పిల్లలను ఎత్తుకుపోవడమే.

ఒక రాత్రి, పొరపాటు తప్పటడుగులు వేసుకుంటూ గుమ్మం దాటి చీకట్లోకి వెళ్లగానే.... రా.. రా.. బూచోడొస్తాడని పిలలను లాక్కొచ్చిన రోజులూ గుర్తుంటాయి.

ఈ బూచోడెవరు? వాడెక్కడ పుట్టాడు? తెలుగుపిల్లల్ని ఇంతగా భయపెట్టిన ఆ  మనిషెలా ఉంటాడు? పిల్లల్ని ఎత్తుకుపోవడం మినహా  వాడికింక పనేం లేదా? ఎవరు పెద్దగా ప్రశ్నించి ఉండరు. ప్రశ్నించినా కరెక్టు సమాధానం వచ్చివుండదు.

 

ఆ రోజుల్లో ఈ బూచోడిని చూపి పిల్లలను భయపెట్టని తెలుగిల్లు ఉండదేమో.

ఇది నాలుగయిదు దశాబ్దాల కిందటి మాట

ఇపుడు పిల్లలు బూచోడంటే భయపడే అవకాశం లేదు. ఈ  పాత్ర తెలుగు జీవితం నుంచి మాయమయిపోయింది.

 

బూచోడు చాలా లోతుగా తెలుగు సైకి లోకి వెళ్లాడు గాని,వాడి  పుట్టు పూర్వోత్తరాలు గురించి  ఎక్కడా దొరకవు.

 

ఈ బూచోడంటే ఎవరో కాదు, బుస్సి దొర.

ఈమధ్య మైఖేల్ క్యాటెన్ రాసిన ’ మేకింగ్ ఆఫ్ క్యాస్ట్  ఇన్ నైన్టీన్త్ సెంచురీ ఇండియా’చదువుతూ ఉంటే  ఈ విషయం తెలిసింది. బొబ్బిలి యుద్ధం తర్వాత ఫ్రెంచ్ బుస్సి దొర తెలుగు నేల మీద ఒక విలనై పోయారు. బుస్సి ఆగడాలను, అతగాడు బొబ్బిలి వెలమ వంశాన్ని నాశనం చేసిన తీరును , వెలమరాజులను హతమార్చిన వైనాన్ని బొబ్బిలి యుధ్దం  బుర్రకథ తెలుగునాట ప్రతి ఇంటికి తీసుకువెళ్లింది. అప్పటికే బుస్సి  దొరగారి రాక్షాసాకారం, తాగుడు అలవాట్లు, కుట్ర రాజకీయాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. బుస్సీ ఎంత దుర్మార్గంగా బుర్రకథ చిత్రించిందంటే  ఏడ్చే పిల్లల నోరు మూయించేందుకు, నిద్రపోని వారిని నిద్ర పుచ్చేందుకు, అరిచే పిల్లలను భయభ్రాంతులకు గురి చేసేందుకు బుస్సీ క్రూరత్వం ఉపయోగ పడింది.  ప్రతిపిల్లవాడికి బూచి భయం ఉండేది. ఆ రోజుల్లో  బూచి  అంటే  భయం. భయానికి పర్యాయ పదం బూచి.

***   ***

ఒక వారం రోజులుగా వూరంతా బూచోడి భయం పట్టుకుంది.   ఈ సారి పిల్లలకు కాదు,పెద్ద వాళ్లకు.

బయటికెళ్లితే బూచోడెదురవుతాడని భయపడుతున్నారు.

 

పాలవాడు, న్యూస్ పేపర్ వాడు,  టిఫిన్ సెంటర్ వాడు, బస్సలో కండక్టర్,  కూరలమ్మేవాడు,

అంతా ఎదురుగా ఉన్న వాడిని బూచోడిలాగా లేదా బూచోడి దూతలాగా చూస్తున్నారు.

 

బ్యాంక్ కు వెళ్లాలంటే బూచోడు ప్రత్యక్షమవుతాడని భయంగా ఉంది.

ఎటిఎంకు వెళ్లాలంటే బూచోడొస్తాడని భయంగా ఉంది.

బజారులో ప్రతివాడు అవతలి వాడిని బూచోడిలా చూస్తున్నారు.

ఈ బూచోడిని ఎలా వదిలంచుకోవడమని అంతా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

 

ఇంతగా ప్రజలందరిని భయపెడుతున్న కొత్త బూచోడెవరో తెలుసా... రెండువేల నోటు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !