
ప్రజలందరూ గొడ్డుకూర తినాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆయన బ్రాహ్మణ భావజాలంపై, హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడారని వివిధ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని హిందూ సంఘాలు ఆయనపై పోలీసు స్టేషన్ లో కేసు కూడా పెట్టాయి. ఆయనపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఇలా కలెక్టర్ వ్యాఖ్యలపై ఇంత దుమారం చెలరేగుతున్న సమయంలో మరో ప్రభుత్వ అధికారి వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమవుతోంది.
కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా పంచాయత్ సీఈవో ఓ సర్వే కోసం మారుమూల గ్రామంలోకి వెళ్లారు. అయితే ఆ ఊరికి వెళ్లే దారి మధ్యలో బురద గుంట ఉంది. దాన్ని దాటి ఊళ్లో అడుగుపెట్టడానికి ఆ ఉన్నతాధికారి తటపటాయించారు. తన బూట్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని తెగ బాధపడిపోయారు.
దీంతో అక్కడున్న గ్రామస్తులు ఆయనను తమ భుజాలపై మోసుకుంటూ బురద దాటించారు. అలా భుజాలపై గ్రామస్తులు మోస్తున్నప్పుడు ఆ అధికారి ఏ మాత్రం అడ్డుచెప్పకపోవడం గమనార్హం. దీనిపై ఆయనను వివరణ కోరగా తాను బురద నుంచి నడుచుకుంటు వెళుతానని చెప్పినా గ్రామస్తులే తనను అలా మోసుకెళ్లారని వివరణ ఇచ్చారు.అయితే జరిగిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.