అరకు వ్యాలీ లో.. అదరహో జాక్ ఫ్రూట్ వైన్

First Published Sep 13, 2017, 11:05 AM IST
Highlights
  • విశాఖపట్నంలోని గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ) ఈ పనస పండు నుంచి  వైన్ తయారు చేయాలని భావిస్తున్నారు
  • ఇప్పటికే అరకులో బ్యాంబో చికెన్( బొంగులో చికెన్) చాలా ఫేమస్. ఆ చికెన్ తోపాటు ఈ వైన్ ని కూడా కలిపి అందించాలని వారు అనుకుంటున్నారట

మనకు లభించే అన్ని పండ్లలోకెల్లా పెద్ద పండు ఏది అంటే పనస పండు అని చెబుతారు ఎవరైనా. పనస తొనలు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అంతేకాదు.. పనస పండుతో పసందైన వంటలు కూడా చేస్తారు. ముఖ్యంగా పనస  పొట్టు బిర్యానీ చాలా బాగుంటుంది. కొందరు వీటితో కూరలు, పులుసు, స్వీట్ లాంటివి కూడా చేస్తుంటారు. కానీ.. ఇదే పనస పండు నుంచి వైన్ తీస్తారన్న విషయం మీకు తెలుసా.. మీరు చదివింది నిజమేనండి.. పనస పండు నుంచి వైన్ తీస్తారు. దానిని ఎంతో ఇష్టంగా తాగేవాళ్లు చాలా మంది ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో తయారు చేస్తారేమో.. ఈ వైన్ అనుకుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే.. ఈ వైన్ లభించేది.. మన తెలుగు రాష్ట్రంలోనే. అదీ సాగరతీరమైన విశాఖలో.

విశాఖపట్నంలోని గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ) ఈ పనస పండు నుంచి  వైన్ తయారు చేయాలని భావిస్తున్నారు. విశాఖ నగరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. అందులోని అరకు ను చూడటానికి విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. అలాంటి పర్యాటకులను ఆకర్షిచేందుకు ప్రయత్నిస్తోంది జీసీసీ. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఈ పనస పండు తో తయారు చేసిన వైన్ ని అందించాలని వారు యోచిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలోని వారి యూనిట్ లో టెస్ట్ కూడా చేశారు.

 

ఇప్పటికే అరకులో బ్యాంబో చికెన్( బొంగులో చికెన్) చాలా ఫేమస్. ఆ చికెన్ తోపాటు ఈ వైన్ ని కూడా కలిపి అందించాలని వారు అనుకుంటున్నారట. ప్రారంభ దశలో దీనిని కేవలం పర్యాటకుల కోసమే ఉపయోపగించాలని.. తర్వాత ఏపీలోని ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలని భావిస్తున్నారు.

 

ఈ వైన్ తయారీ విధానం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా కొంత మంది అధికారులను కూడా పంపించారట. దీని తయారీలో గిరిజనులను భాగస్వాములను చేసి.. వారికి కొంత ప్రాఫిట్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారట. సాధారణంగా మార్కెట్ లో లభించే వైన్ లో 12 నుంచి 15శాతం ఆల్కహాల్ ఉంటుంది. కానీ ఈ పనస పండుతో చేసే వైన్ లో కేవలం 5శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుందట.విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరిలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం , శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ప్రాంతాల్లో పనస చెట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటి నుంచి పనస పండ్లను సేకరించనున్నారు.

 

పనస తొనలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో వేసి వేడి చేస్తారు. పంచదార పాకాన్ని విడిగా తయారు చేస్తారు. రెండు కేజీల పనస తొనలకు.. 500గ్రాముల పంచదార పాకాన్ని కలుపుతారు. దీనికి కొద్దిగా ఈస్టును జత చేసి.. ఒక కుండలో పోస్తారు. అనంతరం ఆ కుండని 18రోజుల పాటు చీకటి ప్రదేశంలో ఉంచుతారు. దీంతో వైన్ తయారౌతుందని జీసీసీ  డిప్యుటీ జనరల్ మేనేజర్  జే.యస్టస్ చెప్పారు. ఈ వైన్ ని రుచి చూసిన వారంతా చాలా బాగుంది అంటున్నారు. ఈ సారి మీరు కూడా అరకు వెళితే.. ఈ వైన్ రుచి చూడటం మర్చిపోకండే.

click me!