
తమిళనాడులో ‘అమ్మ’ ఆరోగ్యపరిస్ధితిపై అయోమయం, ఆందోళనలను పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం రాత్రి హటాత్తుగా గుండెపోటు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. జయను వెంటనే ఐసియులోకి మార్చిన ఆసుపత్రి యాజమాన్యం అత్యున్నత వైద్యాన్ని ఆరంభించింది.
గుండెలో మూడు వాల్వులు మూసుకుపోవటంతో గెండెనొప్పి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే స్టంట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి జయకు కృత్రిమ శాస్వ అందిస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం చేస్తున్న బందోభస్తు ఏర్పాట్లు చూస్తుంటే జయ అనారోగ్యంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, 24 గంటలైతే కానీ ఏ సంగతి చెప్పలేమని వైద్య బృందం స్పష్టం చేయటంతో జయలలిత ఆరోగ్య పరిస్ధితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దానికి తోడు రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు హుటాహుటిన మహారాష్ట్ర నుండి ఆదివారం అర్ధరాత్రే చెన్నైకి చేరుకోవటంతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదలుకుని దేశంలోని ప్రముఖులందరూ జయ ఆరోగ్య పరిస్ధితి తెలుసుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యాన్నిసంప్రదిస్తున్నారు. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు కాస్త ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.
ముందుజాగ్రత్తగా ఆసుపత్రికి చుట్టుపక్కల సుమారు 5 కిలోమీటర్ల మేర ఉన్న పలు హోటల్స్ ను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అదేవిధంగా ఆసుపత్రి చుట్టుపక్కల భారీ ఎత్తున రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలను దింపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
పలు రాష్ట్రాల నుండి తమిళనాడుకు అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేయటం, మంత్రులు ఆసుపత్రిలోనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో ఆసుపత్రిలో అసలు ఏమి జరుగుతోందో ప్రజలెవరికీ అర్ధం కావటం లేదు. ఆదివారం రాత్రి అధికారిక ప్రకటన వెలువరించిన ఆసుపత్రి యాజమాన్యం మళ్ళీ ఇంత వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.
జయలలిత అనారోగ్యంతో సెప్టంబర్ 22వ తేదీన చేరింది మొదలు ఇప్పటి వరకూ అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఆసుపత్రిలో జయ ఉన్న వార్డులోకి మంత్రులను సైతం అనుమతించకపోవటంతో అప్పట్లోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద 40 రోజుల తర్వాత జయలలిత కోలుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
దానికి తోడు ఐసియు నుండి సాధారణ వార్డుకు చేర్చటంతో పలువురు జయ అభిమానాలు సంబరాలు చేసుకున్నారు. జయ ఎప్పుడైనా సరే డిస్చార్జ్ అవ్వచ్చంటూ యాజమాన్యం కూడా ప్రకటించటంతో జయ అనారోగ్యం నుండి కోలుకుంటున్నారన్నది స్పష్టమైంది. అయితే, ఇంతలోనే హటాత్తుగా గుండెపోటు రావటంతో రాష్ట్రం మొత్తం ఆందోళన మొదలైంది.