బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం

First Published Jun 13, 2017, 6:48 PM IST
Highlights

తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేస్తోంది. బెజవాడ కనక దుర్గమ్మకు ఈ ఏడాది బోనాల పండుగ సందర్భంగా  ప్రత్యేకంగా తెలంగాణ సర్కారు తరుపున బోనాలు సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది సర్కారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి  వెల్లడించారు. తెలంగాణ సర్కారు  చేస్తున్న ఈ కొత్త  తరహా ఆలోచన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

కొన్ని విషయాల్లో నిప్పు ఉప్పు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కానీ సాంప్రదాయాలను గౌరవించడంలో మాత్రం రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఆ పండుగ గొప్పతనాన్ని ఆంధ్రా ప్రాంతంలో కూడా తెలిపే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు బెజవాడ దుర్గమ్మకు కూడా బోనాలు సమర్పించేందుకు ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక గా నిలిచే “బోనాలు” పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వ‌హించేందుకు   ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది సర్కారు. హైదరాబాద్ లో  బోనాల ఏర్పాట్ల కోసం గత ఏడాది 5కోట్ల రూపాయలు వెచ్చించిన సర్కారు... ఈ ఏడాది 10 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తారు. న‌గ‌రంలోని అన్ని ఆల‌యాల‌ను బోనాల పండ‌గ‌కు స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేయనున్నారు. బోనాల ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్ష జరిపారు.

 

అన్ని శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, బోనాల పండ‌గ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు మంత్రులు తెలిపారు. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా పోలీసులు భ‌ద్ర‌త ప‌రంగా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. బోనాల్లో డీజేకు అనుమ‌తి లేద‌ని, మైకులనే వాడాల‌ని వారు స్ప‌ష్టం చేశారు.  హైద‌ర‌బాద్ మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌ని, అన్ని వర్గాలు  సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కోరారు. రంజాన్, క్రిస్మ‌స్ తో పాటు ఇత‌ర మ‌తాల పండ‌గ‌లను కూడా ముఖ్య‌మంత్రి ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా మంత్రులు తెలిపారు.

click me!