‘పవన్ పొలిటికల్ స్టాండ్ అర్థం కావడం లేదు’

First Published Dec 9, 2017, 5:11 PM IST
Highlights

 ఇది టిడిపి లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్  పరిస్థితి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంచి స్వరం ఉంది. అందుకే ఆయన తన స్వరంతో సర్కస్ ఫీట్లు చేస్తుంటాడు. ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే స్వరం పెంచి, అవేశం కట్టలు తెగేలా చేయగలడు. అపుడు సభంతా చప్పట్లు. అసలు ఆయన సభలో జనం  చప్పట్లు కొట్టడానికి ఎదురుచూస్తుంటారా అన్నట్లుంటుంది. ఆయన గొంతుపెంచినపుడల్లా జనంలో ఉద్రేకం ఉబికొస్తుంది. వెల్లువలా చప్పట్లు సభను ముంచేస్తాయి.

ఇంతవరకు బాగానే ఉంది. ఆయనేం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనేది ఒక ఆరోపణ. ఒక వాక్యానికి, మరొక వాక్యానికి పొంతన ఉండదు. గంట కింద తానే చెప్పింది. ఇపుడు ఖండిస్తారు. ఇపుడు ఖండించినదాన్ని రేపు మర్చిపోతారు. మొత్తానికి ఆయన ఉపన్యాసం గంటల తరబడి విన్నాక కూడా  కొహెరెంట్ మేసేజ్ ఉండదని  అర్థమవుతుంది. రాజకీయ నాయకుల  ఉపన్యాసాలలో ఐడియాలజీ పూలమాలలో దారం లాగా ఉంటుంది. పవన్ ఉపన్యాసం లో చప్పట్లు, అరుపులు, ఆవేశాలు ఎక్కువ అని అంటంటారు.

టిడిపి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కూడా ఇలాగే అన్నారు. టిడిపిలో బాగా చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, రాజకీయాలు వొళ్లంతా పూసుకొనని ఎంపి గల్లా జయదేవ్. ఆయన  పవన్ మీద పెద్ద బాంబు వేశారు. కత్తి దాడి కంటే తీవ్రమయిన దాడి అది.  ఇన్ని రోజులు  ఉపన్యాసాలు విన్నాక కూడా పవన్ పొలిటికల్ స్టాండ్ ఏమిటో అర్థంకాలేదు, అని జయదేవ్ అన్నారు.  ఆయన ఇంకా ఏమన్నారో చూడండి.

‘సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో నాకు అంతగా పరిచయం లేదు. అయితే ఆయన ప్రజారాజ్యం పార్టీలో పని చేస్తున్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఆయన ఆలోచనా విధానం మంచిదే.. సమాజాభివృద్థి కోసం పరితపించే నైజం ఉంది. కాకపోతే ఆయన పొలిటికల్‌ స్టాండ్‌ ఏమిటో అర్థం కావడం లేదు’ అని శుక్రవారం గుంటూరులో జయదేవ్‌ అన్నారు. ఇప్పటికి టిడిపి పవన్‌ను మిత్రుడిగానే భావిస్తన్నదని , భవిష్యత్‌లో ఆయనతో స్నేహం కొనసాగాలని తాము (టిడిపి) ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. తన బావమరిది, సినీ నటుడు మహే్‌షబాబుకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని జయదేవ్‌ చెప్పారు.

click me!