ఆంధ్రలో కొత్త పార్టీ ఆవిర్భావం

First Published Dec 9, 2017, 3:06 PM IST
Highlights

కొంతమంది యవకులు చేస్తున్న కొత్త ప్రయోగం 'కామన్ మ్యాన్ పార్టీ'

ఆంధ్రలో  పెద్దగా చడీ చప్పుడు లేకుండా ఒక కొత్త పార్టీ వస్తాఉంది. పేరు కామన్ మ్యాన్ పార్టీ. సామాన్యుడి శ్రేయస్సే ధ్యేయంగా కామన్ మ్యాన్ పార్టీ  10.12.2017 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలో ఆవిర్భవించనుందని పార్టీ కన్వీనర్ మారసాని విజయబాబు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ పార్టీ అధ్యక్షుడితో సహా ఎవరికీ విశేషాధికారులుండవవని  సామాన్య కార్యకర్తలతో కలసి అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామిక స్వభావం పార్టీతో ఏర్పాటుచేసున్నామని ఆయన చెప్పారు.

‘ రాజ్యాధికారంలో అందరికి సమాన భాగస్వామ్యం లభించేలా పార్టీ పనిచేస్తుంది. ఇప్పటివరకు అటు అసెంబ్లీలోఇటు పార్లమెంటులో అన్ని సామాజికవర్గాలకి చోటు దక్కలేదు. ఈ దుస్థితికి చరమగీతం పాడుదాం. దీని కోసం పోరాడదాం,’ అనేది పార్టీ నినాదమని విజయబాబు తెలిపారు.  పార్టీ దేని కోసం పనిచేస్తుందో  విజయబాబు ఇలా తెలిపారు.

ఇపుడున్న రాజకీయ సంస్కృతి ధన స్వామ్య సంస్కృతి. ఎన్నికల్లో సామాన్యులెవరూ పోటీచేయలేని పరిస్తితి. ఇది పోవాలి. ఎన్నికల రంగం ప్రజాస్వామికం కావాలి.  రాజకీయ ప్రక్షాళన జరగాలి. సామాన్యుడిని ఎన్నికల్లో పోటీ చేయించే దిశగా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు కామన్ మ్యాన్ పార్టీ పనిచేస్తుంది. ప్రతి సామాజిక వర్గం వారు, ప్రతి చేతి వృత్తి,  కుల వృత్తివారు సమున్నతంగా తలెత్తుకుని జీవించేందుకు సోపానాలు నిర్మించాలనే ధ్యేయం తమ పార్టీని నడిపిస్తుందని ఆయన చెప్పారు.

‘‘ధనార్జన, పదవీకాంక్ష కోసమే ఇప్పటి నేతలు తపిస్తున్నారు. పోటీ పడుతున్న వ్యక్తులు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి లేదా కార్పొరేట్ సంస్థలు, విద్యా వ్యాపారస్థులు, బడా పారిశ్రామికవేత్తలు నుంచే వస్తున్నారు. సమాజహితం కోసం పాటుబడేవారు అసలేలేరు. ఎన్నికైన తరువాత వీరు సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో, జవాబుదారీతనతో వ్యవహరించడంలేదు. ఈ ధోరణి చూస్తుంటే భవిష్యత్తులో కూడా దేశానికి మంచి నాయకత్వం లభించదేమో అన్న భయం పెల్లుబుకుతోంది. అనర్హులు, నైతిక విలువలు లేని వ్యక్తులను ఎంపిక చేసి ప్రజా ప్రతినిధులుగా పంపితే దాని ద్వారా కలిగే పరిణామాలకు మనం బాధ్యులం కాదా?,’’ అని ఆయన చెప్పారు.

ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు మంచి వ్యక్తులు  రానున్న ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడాలి. ప్రజలు వారికే వోటేయాలి.  ప్రజల సొత్తు ఒక పైసా కూడా అశించని, బాధ్యాతాయుతమైన వారిని ఎంపిక చేద్దాం. రండి సమాజాన్ని మరమ్మతు చేసుకునేందుకు అంతా సమాయత్తం చేసేందుకు  పార్టీ కృషి ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్నవారు 8143337722,891982817 నెంబర్లను సంప్రదించవచ్చని విజయబాబు కోరుతున్నారు.

 



 

click me!