
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వైసీపీ నేత ఇంట్లో చొరబడి చింతమనేని, ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అడ్డుకున్న మహిళలను చింతమనేని అనుచరులు దూర్భాషలాడారు.
వివరాల్లోకి వెళితే.. ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా చింతమనేని దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ తిరగుతూ.. వైసీపీనేత తూతూ నిరంజన్ ఇంటికి వెళ్లారు. వైసీపీ నేత ఇంటి వెనుక భాగంలో ప్రహరీ గోడకు పశువులను కట్టేందుకు చేసిన ఏర్పాట్లను పీకించారు. అనంతరం పంచాయితీ కొళాయికి ఏర్పాటు చేసిన మోటారు విద్యుత్ వైర్లను కట్ చేయాల్సిందిగా విద్యుత్ శాఖ సిబ్బందిని చింతమనేని ఆదేశించారు. అడ్డుచెప్పిన వైసీపీనేత భార్యను దుర్భాషలాడారు.
రోడ్డు పక్క పశువులు కట్టి, కుళాయికి మోటార్ బిగిస్తే చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులను ఆదేశిస్తూ చింతమనేని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన స్థానికులు బిత్తరపోయారు. గ్రామంలో 90 శాతం కొళాయిలకు మోటార్లు బిగించి ఉండగా, వాటన్నిటినీ వదిలేసి కేవలం వైసీపీ నేత ఇంట్లోని మోటార్ వైర్లు తొలగించడం గమనార్హం. కావాలనే చింతమనేని, ఆయన అనుచరులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
గత పది రోజుల క్రితం ఇదే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన చింతమనేని.. పేదల గుడిసెలను పీకించాడు. వారి ఇళ్లల్లోని సామాన్లనంటినీ చిందర వందర చేసి రోడ్డుపైకి విసిరేశాడు. అడ్డుచెప్పిన వాళ్లని గన్ మెన్లతో కూడా కొట్టించిన సంగతి తెలిసిందే.