మోదీకి అచ్చిరాని దక్షిణం

First Published Feb 16, 2017, 7:18 AM IST
Highlights

 భవిష్యత్తులో మళ్లీ తమిళనాడులో వేలుపెట్ట లేనంతగా  బిజెపి చేతులు కాల్చుకుంది

 తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రభుత్వం ఏర్పాటుచేయమని ఎఐఎడిఎంకె  నాయకుడు ఇదప్పాడి పళని స్వామిని ఆహ్వనించడం తమిళ సంక్షోభానికి   తెర వేయడంతో పాటు, దక్షిణాదిని జయించేందుకు బిజెపి చేస్తున్న విఫలయత్నాల అధ్యాయానికి కూడా తెరవేసింది. 

 

పళని స్వామికి పలుపురావడమనేది ప్రధాని మోదీ సౌత్ ఇండియా బిజెపి విధానం పరాజయమే అని చెప్పవచ్చు.

 

  బిజెపికి ఎవరెస్టంత అండగా కనిపించినా,  మోదీ ప్రభావం గత రెండున్నరేళ్లలో దక్షిణాదిన పార్టీకి ఒరగబెట్టిందేమీ లేదని గవర్నర్ విద్యాసాగరరావు నిర్ణయం స్పష్టం చేసింది.

 

అద్వానీ, వాజ్ పేయిల వశీకరణ శక్తియే కాదు, మోదీ మాటల గారడి కూడా  వింధ్యపర్వతాల దిగువన పనిచేయడం లేదు. మోదీ దక్షిణాది వ్యూహం వల్ల బిజెపికి వచ్చిందంతా కర్నాటకలో యద్యూరప్పను మళ్లీ పార్టీలోకి రప్పించుకోవడం, వయో భారంతో ఉన్న  ఎస్ఎం కృష్ణ, అనారోగ్యం బంగారప్ప వంటి కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకోవడమే.కేరళలో కూడా  కాలుమోపేందుకు ఎన్నిరకాల ఎత్తులు పైఎత్తులు వేసిందో చెప్పనవసరం లేదు. వాటి వల్ల బిజెపికి అక్కడ చేకూరిన ప్రయోజనం కంటే అపకీర్తి యే ఎక్కువ.

 

 ఇంక ఆంధ్రలో  మోదీ (ప్లస్ వెంకయ్యా నాయుడు) ధోరణి వల్ల తెలుగుదేశానికి బిజెపి పర్మనెంటు తోక పార్టీ అయిపోయింది.  మోదీ శక్తి యుక్తులు, ఉపన్యాసాలు, ఆయన రాజకీయస్టయిల్,  ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు బిజెపి ఒక స్వతంత్ర పార్టీగా ఎదగ కుండా అడ్డుకున్నాయి.   చివరకు అలాంటి కోరికతో పనిచేసిన కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి నాయకుల నోటికి తాళాలు, కాళ్లకు గొలుసులు వేశారు. వాళ్లిపుడు ఎక్కడా కనిపించరు, వినిపించరు.  రాయలసీమలోని పార్టీ నాయకులు కూడా ఈ ధోరణివల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

 

ఇపుడు తమిళనాడులో   బిజెపి ఒకవిధంగా బాాగా అభాసు పాలయింది.మర్యాద పోగొట్టుకుంది. గతంలో అక్కడ వారికి సీట్లే లేవుకాబట్టి  తమిళ రాజకీయాలకు దూరంగా ఉంటూ మర్యాద కాపాడుకున్నారు. జయలలిత చనిపోగానే, తమిళనాడులో జండా పాతేందుకు సువర్ణావకాశం దొరికొందనుకున్నారు. పనికి రాని  పన్నీరు సెల్వాన్ని పట్టుకుని కావేరీ ఈదాలనుకున్నారు.

 

గవర్నర్ ఆఫీసును వాడుకునే ప్రయత్నం చేశారు.  శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను వెనక్కి లాగేందుకు వేయని వేషాలు లేవు,పోనీ వికారాలు లేవు. గవర్నర్ ని ముంబాయిలోనే ఉంచి  పన్నీర్ సెల్వం వారసుని ఎంపిక జాప్యం చేశారు. పోలీసులను ప్రయోగించారు. కిడ్నాప్ కేసులు పెట్టారు. ఎన్నో ఆశలు పెట్టారు.  అయినా గోల్డెన్ బే లో తిష్ట వేసిన ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, గురువారం నాడు గత్యంతరం లేక పళని స్వామిని  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాల్సి వచ్చింది.  బలనిరూపణకు 15రోజుల గడువు ఇచ్చారు.

 

  ఇక భవిష్యత్తులో మళ్లీ తమిళనాడులో ప్రవేశించలేనంతగా బిజెపి చేతులు కాల్చుకుంది. ఇది మోదీ రాజకీయ విధానాలకు విఘాతం.  తమిళనాడు దెబ్బ బిజెపి అనుసరిస్తున్న రాజకీయ విధానాలను సమీక్షించుకోవలసిన ఆవశ్యకతను చెబుతుంది.

click me!